Pages

Thursday, January 26, 2012

కథాజగత్----కథా విశ్లేషణ--3

కథ---ఇట్స్ మై చాయిస్
రచయిత్రి--జ్యోతి వలబోజు

ఇట్స్ మై చాయిస్...
ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే...
"హ..హ..హ..నిజంగా అలాగ జరిగితే ఎంత బాగుండును.."
అని ఈ కథ చదివిన ఆడవాళ్ళందరూ అనుకుంటారు కనుక.
ఒక తరం క్రితం వరకూ ఆడవాళ్లకి వరుణ్ణి తమంతట తాము ఎన్నుకోవడానికి ఎక్కువ అవకాశముండేది కాదు.
ప్రపంచం తెలీకుండా పెరిగిన ఆడపిల్లని ఎక్కడికైనా సరే తండ్రితోకాని, అన్నదమ్ములతో కాని తప్ప (ఆఖరికి మూడేళ్ళపిల్లవెధవైనా సరే మగవాడి తోడంటూ లేకుండా )ఒంటరిగా బయటికి పంపించేవారుకాదు.
ప్రపంచం తెలీని ఆ పిల్లకి తామే పూర్తి బాధ్యత తీసుకుని కుటుంబం, సాంప్రదాయం, చదువు, ఉద్యోగం చూసి పిల్లనిచ్చేవారు. పెళ్ళి కుదిర్చేటప్పుడు కూడా "ఒకమాట అమ్మాయిని అడుగుదాం" అనుకునే తల్లితండ్రులు కూడా తక్కువే ఆ రోజుల్లో.
" అమ్మాయి నచ్చిందా?" అని అబ్బాయి నడిగేవారు తప్పితే "అబ్బాయి నచ్చాడా?" అని అమ్మాయిని అడగడం తక్కువే.
ఆ అమ్మాయి కూడా అలాగే వుండేది. తండ్రి ఏరి కోరి, బోలెడు ఖర్చుపెట్టి చేసిన సంబంధం, తండ్రి లాగే భర్త కూడా తనని అపురూపంగా చూసుకుంటాడు అనుకుంటుంది.
కాని సంసారంలో అడుగు పెట్టాక కాని అందులో సాధకబాధకాలు ఆమెకి తెలీవు.
ఊహలకీ, వాస్తవానికీ వున్న తేడా తెలిసిన ఆమె ఆడపిల్లకి కూడా వరుణ్ణి ఎన్నుకునే అవకాశం వుంటే బాగుండు ననుకుంటుంది.
తనకి అలాంటి అవకాశం ఇక లేదు కనుక కనీసం తన కూతురి కైనా అటువంటి అదృష్టం వుంటే బాగుండుననుకుంటుంది.
అదిగో.. సరిగా అలాంటి ఆలోచనే ఎత్తుకుని ఈ కథ అల్లారు రచయిత్రి జ్యోతి వలబోజు.
వ్రతాలు, నోములూ చేస్తే మంచిమొగుడొస్తాడన్నట్టు ఇక్కడ కూడా అలాగే చేయించడం, ఈ రోజులకి తగ్గట్టు కంప్యూటర్ వాడకం, అందులో మార్పులూ, చేర్పులూ అన్నీ చూపించారు.
ఇలాంటి మార్పుల వల్ల పెళ్ళికాని అబ్బాయిలు పడ్డ ఇబ్బందులూ, పెళ్ళి కోసం అమ్మాయిలు కోరినట్టు మారడానికి సిధ్ధపడ్ద అబ్బాయిలూ ..అంతా చదువుతుంటే నిజంగా ఎదురుగా జరుగుతున్నట్టే అనిపించింది.
బ్రహ్మాది దేవతల దగ్గర్నుండీ అందర్నీ ఇందులోకి లాగారు.
చాలా సీరియస్ విషయాన్ని ఇలా తేలిక మాటలతో చెప్పడం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని అవలీలగా సాధించారు రచయిత్రి.
ఇంకో ముఖ్యమైన విషయం.
మిగిలిన మనుషుల కన్న రచయిత కాస్త ముందుకాలానికి వెళ్ళి ఆలోచించాలంటారు.
ఈ కథలో రచయిత్రి ఆ విధంగా కూడా సఫలమయ్యారనే అనిపిస్తోంది.
ఎందుకంటే 2009 లో ఆవిడ ఊహించి రాసిన ఈ కథ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే నిజమైనట్టే అనిపిస్తోంది.
ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు వరుణ్ణి ఎన్నుకుని "ఇట్స్ మై ఛాయిస్.." అని చెప్పుకుంటున్నారు.
అందుకనే ఈ కథ నాకు నచ్చింది.

______________________________________________________________________________________________


ఈ కథ మీరు ఇక్కడ చదవవచ్చు.

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/its-mai-cayis--jyoti-valabojuకినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా

Saturday, January 21, 2012

కథాజగత్---కథా విశ్లేషణ--2

కథ--అమ్మకో ఉత్తరం
రచయిత్రి---కల్పనా రెంటాల

బాధ్యతలు బంధాలని ఎలా శాసిస్తాయో ఈ కథ చెపుతుంది కనుక నాకు ఈ కథ నచ్చింది.

అత్తవారింటినుంచి కూతురు ఎప్పుడు వచ్చి తనని సంతోషపెడుతుందా అని ఎదురుచూసే తల్లికి, పుట్టింటికి వెళ్ళి కాస్త సేదదీరదామని వున్నా కదలనీయని కుటుంబబాధ్యతలుగల ఒక కూతురు ఆ తల్లి మనసు కష్టపడకుండా వుండాలని అమెరికాలో తను ఎంత సంతోషంగా వుంటోందో బుకాయింపుగా చెప్పడం మొదలుపెట్టి, ఆఖరికి తన మనసుని పట్టుకోలేక బేలపడి రాసిన ఉత్తరం ఈ కథ.

చిన్నప్పుడు చిన్న చిన్న గిన్నెలతో, పప్పు, బెల్లాలతో అన్నం, పప్పు వండి బుల్లి బుల్లి చేతులతో నోటిలో పెడుతుంటే పొంగిపోతుంది అమ్మ.
బువ్వాలాట లాడుతున్న బుల్లితల్లిని మురిపెంగా చూసుకుంటుంది.

అదే అమ్మ ఆ బుల్లితల్లికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపాక అనుక్షణం ఆరాటపడిపోతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన బంగారుతల్లి అక్కడ ఎలా సమర్ధించుకుంటోందోనన్న ఆలోచనతో ఆమె నుంచి వచ్చే ఒక చల్లనిమాట కోసం కొట్టుకుపోతూంటుంది.
ఎప్పుడు ఎప్పుడు ఆ బుల్లితల్లి ఇంటికి వస్తుందా అని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంది.

కాని మరి ఆ బంగారుతల్లో...ఇప్పుడు బుల్లితల్లి కాదుకదా..

ఒక ఇంటికి ఇల్లాలు.
బాధ్యత గల ఒక తల్లి.
తగిలించుకున్న బంధాలు
తగులుకున్న బాధ్యతలు
మనసు మథనపడుతున్నా
మెదడు పనిచేయక తప్పని పరిస్థితుల్లో
బాధను అగాధాల్లో పాతిపెట్టి
పెదవులకు చిరునవ్వు అతికించుకుని
ఎంత హాయిగా వున్నానో
అనుకోక తప్పని పరిస్థితి.

తనకున్న చిన్న చట్రంలో ఇమిడిపోయి ఇతర విషయాల గురించి కనీసం ఆలోచించడానికి కూడా అవకాశమివ్వని పరుగెత్తే కాలంతో పాటు ఉరుకులూ, పరుగులతో నడిచే జీవనసరళి.

కాని అమ్మ మనసు తెలుసు. తను బాగానే వున్నానని పదిరోజులకొకసారైనా అమ్మకి చెప్పకపోతే ఆ తల్లి మనసు పడే ఆరాటం ఈ కూతురికి తెలుసు.

అందుకే సముద్రాల ఆవలితీరంనుంచి కూడా పని కట్టుకుని ఫోన్లు చేస్తుంది.

కాని పాపం.. ఆ తల్లికి అది సరిపోదు. పిల్ల ఒక్క ఉత్తరమ్ముక్క రాస్తే ఆ నాలుగు పదాలూ నలభైసార్లు చదువుకుంటే కాని ఆ తల్లికి సంతృప్తి వుండదు.
ఏడాది కోసారైనా వచ్చి తన దగ్గర ఓ నాలుగు రోజులుంటే తప్ప ఆ తల్లి కడుపు నిండదు.

ఇది ప్రతి తల్లీ, కూతురూ అనుభవించే ఆవేదనే.
దానినే కల్పన రెంటాల ఒక కథలా రాసారు.

ఆ కథ ఇలా మొదలౌతుంది,
అమెరికా నుంచి ఫోన్ చేసినా మాట్లాడడం కుదరకపోవడం వల్ల ఈ కథలో కూతురికి పెన్ పట్టుకుని కాగితాలు ముందేసుకుని (అవి కూడా టిష్యూపేపర్లు) ఇండియాలో వున్న తల్లికి తెలుగులో ఉత్తరం రాయడం తప్పలేదు. తల్లి ఈమెయిల్ ఇవ్వడం నేర్చుకోకపోయినందుకు ఒకవిధంగా నిష్ఠూరమాడుతూనే ఉత్తరం రాయడం మొదలెట్టిన ఆమె అమెరికా జీవనసరళి ఎలా వుంటుందో వర్ణిస్తుంది.
అక్కడి జీవితం ఎంత యాంత్రికమైనదో చెప్తూ, అది సుఖంగా బతకడానికి ఎంత అనుకూలంగా వుంటుందో చెపుతూ..ఆ ధోరణిలో మనుషులు మిషన్లలా ఎలా మారిపోతారో చెపుతుంది.

యంత్రాలతో పాటు ఒక యంత్రంలా మారిపోవాలనుకుంటున్న ఆమె అలా రాస్తూండగానే ఆమె మనసు తల్లి ఒడిని చేరిపోతుంది. ఆమె గుండె పట్టేస్తుంది. ఈ మాట చదువుతున్నప్పుడు మనకి కూడా గుండె పట్టేస్తుంది.
తన కుటుంబాన్ని బాధ్యతగా నడిపించుకునే క్రమంలో తల్లికి ఉత్తరం రాయలేకపోవడం, అనుకున్నప్పుడల్లా పుట్టింటికి రాలేకపోవడం అన్నవి తనకి తనే సమర్ధించుకుంటుంది.

కాని మనసులో ఎక్కడో దాగున్న తడి ఆమె కళ్ళని చెమ్మగిలజేస్తుంది.
అనురాగాలు, ఆప్యాయతలూ మనలని అంత తొందరగా వదిలిపోవని ఈ కథ నిరూపిస్తుంది.

ఈ సెంటిమెంటుతో పాటు రచయిత్రి అమెరికా జీవనవిధానం గురించి కూడా చక్కగా చెప్పారు. కథ మొదలుపెడితే కదలకుండా చదివింపజేస్తుంది.
ఆఖరున కాస్త గుండె బరువెక్కుతుంది కూడా.


-------------------------------------------------------------------------------------------

ఈ కథ మీరు ఇక్కడ చదవవచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/am-mako-uttaram---kalpana-rentala

కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా

Thursday, January 19, 2012

కథా జగత్ ---కథావిశ్లేషణ--1

కథ------ నుపకారికి నపకారము!
రచయిత --- భమిడిపాటి రామగోపాలం


ఉపకారికి ఉపకారం చెయ్యడం ఏమంత పెద్ద విషయం కాదనీ, అపకారికి ఉపకారం నెపమెన్నకుండ చెసేవాడు నేర్పరి అనీ సుమతీశతకకారులు చెప్పారు.
కాని ఈ కథ పేరే ఉపకారికి అపకారం చెయ్యడం.
సుమతీ శతకకారుల్ని గుర్తు చేసుకుంటూ అనుకుంటాను రచయిత పద్యం లో వచ్చేసంధి కలిసినట్లుగానే "నుపకారికి నపకారము!" అనే శీర్షిక పెట్టేరు.
ఉపకారికి ఉపకారం చెయ్యడం అన్నది అంత పెద్ద విషయమేమీ కాదనీ, అపకారికి ఉపకారం చెయ్యడమే జీవితంలో ధన్యమైనదని సుమతీశతకకర్త చెప్పిన సూక్తి మనకి నరనరంలోనూ జీర్ణించుకుపోయింది.
కాని ఇక్కడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు అదే సూక్తిని మరో కోణం నుంచి ఆవిష్కరించారు.
"ఉపకారికి కూడా ఒక్కొక్కసారి అపకారం జరిగితే.." అన్న పాయింట్ తీసుకుని దానికి తగ్గట్టు పాత్రలను మలచి కథ నడిపారు.
భమిడిపాటి రామగోపాలం ఎంత గొప్ప కథకులో తెలియనివారుండరు.
కథంతా ఉత్తమపురుష (first person) లో సాగుతుంది. సౌలభ్యం కోసం ఆయనను మనం పెద్దమనిషిగా పిలుచుకుందాం.
ఎప్పుడో ఆయన శృంగవరపుకోటలో పోస్టాఫీసులో క్లర్క్ గా పనిచేస్తున్నప్పుడు, కుర్రాళ్ల బాధ్యతా రాహిత్యం గూర్చి చెపుతూ పోస్ట్ మాస్టర్ రిజిస్టర్డ్ కవరు ఇవ్వద్దని చెప్పినాకూడా, అఖిలాండేశ్వరం అనబడే అతనికి ఈ పెద్దమనిషి కేవలం మానవతా దృక్పథంతో ఆ కవర్ ఇస్తాడు. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు దాటిపోలేదు కూడా. అలాగ ఆలోచిస్తే అతను అతని రూల్ ని అతిక్రమించలేదనే చెప్పుకోవాలి.
అలా ఈ పెద్దమనిషి ఉత్తరం సమయానికి ఇవ్వడం వల్ల అఖిలాండేశ్వరం సమయానికి ఇంటర్వ్యూ కి హాజరయి, సెలక్టయి, అంచెలంచెలుగా పైకెదుగుతూ, పెద్దమనిషి రైల్లో కలిసే సమయానికి ఉద్యోగాలకి సెలక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు.
ఆ అఖిలాండేశ్వరమే ఈ పెద్దమనిషి కొడుకు ఉద్యోగం పనిమీద హైదరాబాదు వెడుతున్నాడని తెలుసుకుని, ఆపని తన చేతిలో పనే అని చెప్పి, ఉపకారికి ఉపకారం చేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలు చెప్పి తనని కలవమంటాడు.
అంతా బాగానే అవుతుంది. పెద్దమనిషి కొడుకుకి ఉద్యోగం వస్తుంది. స్వయంగా ఆర్డర్ తీసుకునే ఊరు వెడదామని ఆయన హైద్రాబాదు లోనే వుండిపోయినప్పుడు ఈ అఖిలాండేశ్వరం పర్సనల్ సెక్రటరీ నని చెప్పి గంగాధరం అనే ఆయన ఈ పెద్దమనిషిని కలిసి, అబ్బాయి ఆ ఉద్యోగంలో ఎంత తొందరలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో చెప్పి, తెలిసినవాళ్ళు కనక అందరిలా రెండు లక్షలు ఇవ్వకపోయినా యాభైవేలైనా ఇస్తే బాగుంటుందనీ, ఆ యాభైవేలూ కూడా ఈ పెద్దమనిషి ఎలా సమకూర్చుకోవాలో కూడా సలహా చెప్తాడు.
ఆ పెద్దమనిషికి విషయం అర్ధమౌతుంది. కొడుకు ఉద్యోగస్తుడవడానికి గంగాధరం కోరినట్టే యాభైవేలూ పట్టికెళ్ళి కమీషనర్ గారికిచ్చి, అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకునే క్షణం లోనే అనుకోని సంఘటన జరుగుతుంది.
అవినీతి నిరోధకశాఖలో డిప్యూటీ సూపరెంటెండేంట్ గా పనిచేస్తున్న ఆ పెద్దమనిషి అల్లుడుగారు హఠాత్తుగా ప్రత్యక్ష్యమయి, ఆ అఖిలాండేశ్వరుణ్ణి రెడ్ హేండెడ్ గా పట్టుకుంటారు.
సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా సేకరిస్తారు.
ఆ విధంగా ఉద్యోగమిచ్చి ఉపకారం చేసిన అఖిలాండేశ్వరానికి అపకారం జరిగింది.
కథలో ఈ మలుపు రచయిత హఠాత్తుగా తీసుకొస్తారు. విషయం అర్ధమయ్యే లోపలే సాక్ష్యాలు సేకరించబడతాయి. ఆ విషయం ఆ పెద్దమనిషికి కూడా అప్పుడే తెలుస్తుందనుకోవాలి. ఎందుకంటే పాఠకులకి కూడా ఆ పెద్దమనిషి అల్లుడు అవినీతి నిరోధకశాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్టు అప్పుడే తెలుస్తుంది.
అలా లంచం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగిని పట్టుకుంటూ సాక్ష్యాధారాలను సేకరించడంతో కథ ముగుస్తుంది.
అంతటి గొప్ప రచయిత ప్రతిభంతా ఆ ముగింపులోనే కనిపిస్తుంది.
ఎందుకంటే ఒక కథ మంచికథ అని చెప్పుకోవాలంటే కథ చదవడం పూర్తయిన తర్వాత పాఠకుడు ఆ కథ గురించి కాస్త సేపైనా ఆలోచిస్తేనే దానిని మంచికథ అంటారని పెద్దవాళ్ళు చెపుతుంటారు. అలాగే ఈ కథ పూర్తి చేసాక కూడా దీనిగురించి ఆలోచించకుండా వుండలేరు.
ముందు అందరికీ వచ్చే సందేహం ఈ విషయం ఆ పెద్దమనిషికి ముందే తెలిసుంటుందా అని.
కాని ఆ పెద్దమనిషి కూడా ఆర్డర్ కాగితాలు తీసుకుని అలాగే నిలబడడంతో ఆయనకు తెలీదనే అనుకోవాలి.
ఈ కథని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే మనిషి ఒకటనుకుంటే పరిస్థితులు దానిని మరోవిధంగా మార్చేస్తాయి అని.
పాత్రలను తీసుకోవడం లోనూ, సన్నివేశాలను సృష్టించడంలోనూ రచయిత ప్రదర్శించిన తీరు అమోఘం.
తనకి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసుకునే అవకాశం వచ్చినందుకు అఖిలాండేశ్వరుడు ఆనందించి, మిగిలిన అభ్యర్ధుల దగ్గర రెండు లక్షలు తీసుకుంటున్నా ఈ పెద్దమనిషి సహాయానికి ప్రతిగా కేవలం యాభైవేలే తీసుకుంటాననడం ఆ పాత్రకి తగ్గట్టే వుంది. అలాగే పెద్దమనిషి కూడా ప్రస్తుత పరిస్థితులని అర్ధం చేసుకుని ఆ డబ్బుని తీసికెళ్ళి అతని కివ్వడం కూడా సబబుగానే వుంది. ఈ విషయం తెలిసిన అవినీతిశాఖ లో ఉద్యోగి (పెద్దమనిషిగారి అల్లుడు) తన డ్యూటీ ప్రకారం లంచం పుచ్చుకుంటున్నవాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం విధిని నిర్వహించెనట్టే అనిపించింది.
ఇలా ఏ ఒక్క పాత్రనూ తక్కువచెయ్యకుండా కేవలం పరిస్థితుల ప్రభావం వలనే ఉపకారికి అపకారం జరిగినట్టు రచయిత చాలా గొప్పగా చెప్పారు.
మనిషి ఏం చెయ్యాలనుకున్నా పరిస్థితులకి ఎంత బానిసో, ఉపకారం చేసినవారికి కూడా ఎలా అపకారం జరుగుతుందో ఎంతో సూటిగా చెప్పారు.
ఈ కథ అందుకే నాకు నచ్చింది. మహారచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు కథని ఎంతో పట్టుగా, సూటిగా నడిపారు. అనుకోని మలుపుతో ఇచ్చిన ముగింపు కథ పూర్తిచేసాక పాఠకుణ్ణి తప్పకుండా ఆలోచింపచేస్తుంది.

==============================================================
ఈ కథకి లింక్...http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nupakariki-napakaramu---bhamidipati-ramagopalamకినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా

Tuesday, January 10, 2012

హమ్మ మొబైలా...

మొబైల్ ఫోన్లు కొత్తగా వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు వాటిని సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించేవారు. అలాంటివారిని చూసి వ్యంగ్యంగా అల్లిన చిన్న రచన.
ఈ కథ 2004 సంవత్సరంలో డిసెంబరు నెల ముఫ్పై తారీకు ఆంధ్రభూమి వారపత్రికలో అచ్చయింది.
వారికి నా ధన్యావాదాలు తెలుపుకుంటూ...

హమ్మ మొబైలా...హమ్మ మొబైలా...
ఆ వేళ నగరంలో ఎన్ని పెళ్ళిళ్ళో! మంచి ముహూర్తం కావడం వల్లనూ, అంతకు ముందే మూఢం వెళ్ళడం వల్లనూనేమో ఆ ముహూర్తానికి చాలా పెళ్ళిళ్ళౌతున్నాయి.

కళ్యాణ మండపాలకి గిరాకీ, పురోహితులకీ గిరాకీ, పెళ్ళిమండపం కట్టేవాళ్ళకీ గిరాకీ, కేటరింగువాళ్ళకి గిరాకీ, పూలకి గిరాకీ, అన్నింటికీ గిరాకీయే. అంతదాకా ఎందుకూ.. నా మటుకు నాకే అదే ముహూర్తానికి నాలుగు శుభలేఖలొచ్చేయి.

ఒకటెలాగోలాగ తప్పించుకున్నా మిగిలిన మూడూ మరీ తప్పించుకోలేని బంధువులవీ, స్నేహితులవీను. ఏం చెయ్యను? సరే, ఒకచోటికి ముహూర్తానికి ముందే వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని, అక్కడే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని, అక్కడినుంచి రెండోచోటికెళ్ళి సుముహూర్తం దాకా కూర్చుని, అక్షింతలు వేసి, అక్కడ్నించి మూడోచోటకెళ్ళి, సూత్రధారణ చూసి, భోంచేసి రావడానికి ప్రణాళిక వేసుకున్నాను.
జీలకర్ర, బెల్లం పెట్టే సుముహూర్తం తరవాత పెళ్ళికూతురు మధుపర్కాలు కట్టుకునివచ్చి, మంగళసూత్రధారణ జరిగేటప్పటికి సమయం పడుతుంది కదా... ఆ సమయంలో మూడో పెళ్ళికి అందుకోవచ్చని నా అభిప్రాయం.

మనలో మన మాట.. ఈ వీడియోల ప్రభావమేమో మరి, ఈ మధ్య పెళ్ళికూతుళ్ళు సుముహూర్తం మేకప్ వేరేగా.. మంగళసూత్రధారణ సమయానికి మేకప్ వేరేగా, వస్త్రధారణ, శిరోజాలంకరణలతో సహా మార్చుకొస్తున్నారు. మరి దానికి సమయం పడుతుంది కదా.. ఆ సమయాన్ని మూడో పెళ్ళికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను.

పొద్దున్నే ఎనిమిదిగంటలకల్లా అనుకున్నట్టుగానే మొదటి పెళ్ళికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని, బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి రెండోపెళ్ళి మండపానికి వచ్చాను. మొదటిపెళ్ళివారికన్నా వీరు కొంచెం హైక్లాసు వాళ్ళు. మామూలు మధ్యతరగతివాళ్ళే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి లక్షలు ఖర్చు పెడుతుంటే, మరి వీళ్ళకేం లోటు? ఆవరణంతా వాహనాలతో నిండిపోయింది. నా చిన్న స్కూటరు పెట్టే స్థలం కూడా కనపడక రోడ్డు మీదున్న కిళ్ళీకొట్టు పక్కన పెట్టి వాడికి జాగ్రత్తలు చెప్పి లోపలికెళ్ళాను.

రెండువైపుల తల్లితండ్రులూ పెద్ద హోదాల్లో వున్నవాళ్ళు. పిల్లలు కూడా బాగా చదువుకుని ఈ హైటెక్ రోజులకి తగ్గ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు. శుభలేఖ ఇవ్వడానికి ఇంటి కొచ్చినప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అన్న మాటలు గుర్తొచ్చేయి.

"ఏం రోజులండి గురువుగారూ యివి? ఉద్యోగ భద్రత అంటూ ఏమీ అఖ్ఖర్లేదు. అంతా అనుభవించెయ్యడమే అంటాడు మావాడు. వాడు మొదట చేరిన కంపెనీ లోనే నేను రిటైరయ్యే టైముకి వచ్చిన దానికన్నా రెట్టింపొచ్చేది జీతం. ఆ తరవాత వాడు మూడు కంపెనీలు మారేడు. అటువంటిదిప్పుడు వాణ్ణి పటుకోగలమా?"

నిజమేకదా అనిపించింది.

అమ్మాయి కూడా యించుమించు అన్ని అర్హతలూ వున్న పిల్లేనట. యింకేం? మరింక వాళ్ళిద్దరూ పెళ్ళిపీటల మీద కూర్చుంటారో లేక ఆకాశానికి వేసే నిచ్చెన మీదుంటారో అనుకుంటూ లోపలి కడుగుపెట్టాను.

ఏమాట కామాటే చెప్పాలి. ఇద్దరూ పీటల మీదే వున్నారు. మధ్యలో తెర. సుముహూర్తానికింకా సమయముందనుకుంటాను. హాలు కిటకిట లాడిపోతోంది. ముందు నుంచి చివరిదాకా చూస్తే పెళ్ళికొడుకు బంధువుల్లో ఒకరు నన్ను గుర్తుపట్టి తీసికెళ్ళి మండపం పక్కన అతను కూర్చున్న కుర్చీని ఖాళీ చేసి నాకిచ్చి అతను అదృశ్యమైపోయేడు. ఒకసారి నాలుగువైపులా చూసి దృష్టి పెళ్ళిమండపం వైపు తిప్పాను.
అద్భుతంగా అలంకరించారు పెళ్ళిమండపాన్ని. రంగురంగుల పువ్వులతో ఏ రంగుకారంగు ప్రాధాన్యతనే ఎక్కువన్నట్టు చూపిస్తూ ఎంతో కళాత్మకంగా వున్న పెళ్ళి మండపాన్నిచూసి మెచ్చుకోకుండా వుండలేకపోయాను.

మండపంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మధ్యలో తెర, దాని మీద అందంగా "తెర తీయగానే -సుమ దరహాస సుమ వర్షం" అని వుంది. అవును, గుర్తొచ్చింది, పెళ్ళికూతురు పేరు సుమ కదా అనుకున్నాను. దృష్టి పెళ్ళిపీటలవైపు మళ్ళించాను.

పెళ్ళికూతురు బంగారు మలామా వేసినట్టు మెరిసిపోతోంది. పెళ్ళికొడుకేమీ తక్కువగా లేడు.
ఎవరో డిజైనర్ చక్కగా డిజైన్ చేసిన పంచెలాంటి పైజమా, మెడకీ, భుజాలకీ, చేతులకీ భారీగా ఎంబ్రాయిడరీ చేయబడిన కుర్తా, ఆ జరీని కప్పేస్తూ మెడలో బంగారు గొలుసొకటీ, ముత్యాల హారమొకటీ, పగడాల దండొకటీ వేసుకున్నాడు. ఎవరు మేకప్ చేసేరో కానీ మొహాన కళ్యాణంబొట్టు కూడా అందంగా దిద్దారు.
కాని.. కాని.. అదేమిటి? ఆ పెళ్ళికొడుకు మెడ అలా వంగిపోయిందేవిటీ? నాకు తెలిసినంతవరకు ఆ కుర్రాడు స్ఫురద్రూపేనే.. నా మెడని కాస్త ముందుకి వంచి చూసేను. ఆ... అదీ సంగతి.. అది మెడ వంగడం కాదు. ఆ పిల్లాడు మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మెడకీ, భుజానికీ మధ్యలో నొక్కిపెట్టిన మబైల్ లో మాట్లాడుతూ, ఎడంచెయ్యి పైకెత్తి వచ్చినవారిని విష్ చేస్తూ, కుడిచేత్తో తన ముందున్న దేవుడికి పూజ చేస్తున్నాడు. ఆ సమయంలో అతను చేస్తున్న అష్టావధానానికి తెల్లబోయేను. అతను పురోహితుడు చెప్పే మంత్రాలు వింటూ పూజ చేస్తున్నాడో లేకపోతే మొబైల్ ఫోన్ లో మాటలు వింటూ చెయ్యాడిస్తున్నాడో నాకర్ధం కాలేదు.

చూపు పెళ్ళికూతురి వైపు తిప్పాను. ఆమె లోపలే గౌరీపూజ ముగించుకుని వచ్చిందనుకుంటాను. ఇంకా యిక్కడామెకి పురోహితుడు పూజ చెయ్యడానికేమీ చెప్పలేదనుకుంటాను. అందుకనామె అలవోకగా కుడిచేతిలోని రుమాలుతో మేకప్ కి పట్టిన చెమటని సుతారంగా అద్దుకుంటూ, ఎడంచేత్తో మొబైల్ ఫోన్ చెవి దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతోంది. ఆ కాసేపూ కూడా మొబైల్ ఫోన్లు వదలలేని వాళ్ళ హైటెక్ జీవితాలకి విస్తుపోకుండా వుండలేకపోయాను.

సుముహూర్తం సమీపిస్తోంది. పురోహితులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ యిద్దరిచేతులూ జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద పెట్టడానికి ముందుకి తీసుకున్నారు. వాళ్ళ చేతులు పురోహితులు తీసుకున్నా వాళ్ళు మాత్రం మొబైల్ లో మాట్లాడుతూనే వున్నారు.

"బాబూ, ఆ మాట్లాడ్డం కాస్త ఆపితే సుముహూర్తం జరిపిస్తాం." ఒకాయన స్పష్టం చేసాడు. పెళ్ళికూతురు మొబైల్ ఫోన్ లో ఏదో చెప్పి సంభాషణ ముగించి మొబైల్ చేతిలో పట్టుకుంది. ఆమెని చూసి పెళ్ళికొడుకు కూడా అదేపని చేసాడు. "అమ్మయ్య" అనుకుని పురోహితులు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు.

మళ్ళీ "కుయ్ కుయ్ " మంటూ ఏవేవో రాగాలతో మొబైల్స్ రెండూ మోగడం మొదలుపెట్టాయి. స్ప్రింగ్ లాగా పెళ్ళికొడుకు మొబైల్ ని మళ్ళీ మెడకీ, భుజానికీ మధ్యలో అతికించేసుకున్నాడు. పెళ్ళికూతురి ఎడమ అరిచేయి మొబైల్ తో సహా ఎడమచెవికి అతుక్కుపోయింది. పురోహితులు మంత్రాలు చదవడం ఆపేసి వీళ్ళకోసం నిరీక్షించడం మొదలుపెట్టేరు. ఎక్కువ టైమేమీ తీసుకోకుండా పాపం రెండు నిమిషాల్లోనే వధూవరులిద్దరూ మాట్లాడ్దం ముగించి మళ్ళి సుముహూర్తం ఫోజ్ కొచ్చేసేరు.

మళ్ళీ పురోహితులు మంత్రాలు మొదలుపెట్టేరు. మళ్ళీ మొబైల్స్ మోగేయి. మళ్ళీ అంతరాయం. నాకు చిరాకనిపించింది. నాకే యిలా వుంటే మరింక ఆ పెళ్ళి జరిపించే పురోహితులకెలా వుంటుందో! ఆ కాసేపూ మొబైల్ ఆఫ్ చెయ్యొచ్చు కదా! వాళ్ళకి ప్రతి నిమిషం విలువైనదే స్వంత పెళ్ళి కన్నా కూడా.
పురోహితులకి పాపం ఏం చెయ్యాలో తెలీట్లేదు. గట్టిగా ఏమీ అనలేరు. అలాగని వాళ్ళు చెయ్యవలసిన పధ్ధతిని మార్చుకోలేరు.

మొబైల్స్ ఆఫ్ చెయ్యమని పెద్దవాళ్ళే వాళ్ళకి చెప్పే పధ్ధతక్కడ కనిపించటంలేదు. ఈ విధంగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాలుగైదుసార్లు జరిగింది. పురోహితుల కింక విసుగొచ్చేసింది. ఇద్దరూ ఒకవైపుకి జరిగి కూడబలుక్కున్నారు. పిల్లతండ్రిని, పిల్లాడితండ్రిని పిల్చి ఏదో అడిగారు. పెళ్ళిమండపం దిగి, నేనున్న వైపుకొచ్చి నా పక్కనున్న కుర్చీల్లో సెటిలయ్యి ఎదురుగా వున్న పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళనే చూస్తూ కూర్చున్నారు.

నాకేమీ అర్ధం కాలేదు. చిన్నప్పుడు చదివిన కథలు గుర్తొచ్చేయి. తపస్సు చేసే మునీశ్వరుల్ని నిర్లక్ష్యం చేసిన రాజుల్ని ఆ మునులు శపించినట్లు యిప్పుడీ పురోహితులు ఆ పెళ్ళి చేసుకునే పిల్లల్ని శపించేస్తారేమోనని అనిపించింది. అంతటి తపఃశ్శక్తి వీళ్ళకుండదేమోలే అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. కుతూహలం ఆపుకోలేక వాళ్ళనే గమనిస్తూ కూర్చున్నాను.

వధూవరులిద్దరినీ దీక్షగా గమనిస్తున్న పురోహితులిద్దరూ వాళ్ళు మొబైల్ లో మాట్లాడ్డం ఆపడం చూసి ఒక్కసారిగా అలర్టయ్యేరు. ఇద్దరూ నడుములో దోపుకున్న మొబైల్ ఫోన్లని బైటకి తీసేరు. నంబర్లు నొక్కేరు. మొబైల్ మోగగానే పెళ్ళిమండపంలో కూర్చున్న పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ ఆటోమేటిగ్గా వాటిని చెవులకంటించేసుకున్నారు. పురోహితులిద్దరూ నా పక్కనున్న కుర్చీల్లో కూర్చుని సుముహూర్తం మంత్రాలు చదువుతుంటే పెళ్ళిమండపం లోని వధూవరులిద్దరూ మొబైల్ ఫోన్లు చెవికంటించేసుకుని వీళ్ళు చెప్పినట్లు చేసేస్తున్నారు. ఒకళ్ళనెత్తిమీదొకళ్ళు జీలకర్రబెల్లం పెట్టేసుకుని సుముహూర్తం కానిచ్చేసారు.
అయమ్ముహూర్త స్సుముహూర్తమస్తు.
నేను "హమ్మ మొబైలా!" అనుకున్నాను.

==============================================================


ఆంధ్రభూమి సౌజన్యంతో...