Pages

Thursday, January 26, 2012

కథాజగత్----కథా విశ్లేషణ--3

కథ---ఇట్స్ మై చాయిస్
రచయిత్రి--జ్యోతి వలబోజు

ఇట్స్ మై చాయిస్...
ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే...
"హ..హ..హ..నిజంగా అలాగ జరిగితే ఎంత బాగుండును.."
అని ఈ కథ చదివిన ఆడవాళ్ళందరూ అనుకుంటారు కనుక.
ఒక తరం క్రితం వరకూ ఆడవాళ్లకి వరుణ్ణి తమంతట తాము ఎన్నుకోవడానికి ఎక్కువ అవకాశముండేది కాదు.
ప్రపంచం తెలీకుండా పెరిగిన ఆడపిల్లని ఎక్కడికైనా సరే తండ్రితోకాని, అన్నదమ్ములతో కాని తప్ప (ఆఖరికి మూడేళ్ళపిల్లవెధవైనా సరే మగవాడి తోడంటూ లేకుండా )ఒంటరిగా బయటికి పంపించేవారుకాదు.
ప్రపంచం తెలీని ఆ పిల్లకి తామే పూర్తి బాధ్యత తీసుకుని కుటుంబం, సాంప్రదాయం, చదువు, ఉద్యోగం చూసి పిల్లనిచ్చేవారు. పెళ్ళి కుదిర్చేటప్పుడు కూడా "ఒకమాట అమ్మాయిని అడుగుదాం" అనుకునే తల్లితండ్రులు కూడా తక్కువే ఆ రోజుల్లో.
" అమ్మాయి నచ్చిందా?" అని అబ్బాయి నడిగేవారు తప్పితే "అబ్బాయి నచ్చాడా?" అని అమ్మాయిని అడగడం తక్కువే.
ఆ అమ్మాయి కూడా అలాగే వుండేది. తండ్రి ఏరి కోరి, బోలెడు ఖర్చుపెట్టి చేసిన సంబంధం, తండ్రి లాగే భర్త కూడా తనని అపురూపంగా చూసుకుంటాడు అనుకుంటుంది.
కాని సంసారంలో అడుగు పెట్టాక కాని అందులో సాధకబాధకాలు ఆమెకి తెలీవు.
ఊహలకీ, వాస్తవానికీ వున్న తేడా తెలిసిన ఆమె ఆడపిల్లకి కూడా వరుణ్ణి ఎన్నుకునే అవకాశం వుంటే బాగుండు ననుకుంటుంది.
తనకి అలాంటి అవకాశం ఇక లేదు కనుక కనీసం తన కూతురి కైనా అటువంటి అదృష్టం వుంటే బాగుండుననుకుంటుంది.
అదిగో.. సరిగా అలాంటి ఆలోచనే ఎత్తుకుని ఈ కథ అల్లారు రచయిత్రి జ్యోతి వలబోజు.
వ్రతాలు, నోములూ చేస్తే మంచిమొగుడొస్తాడన్నట్టు ఇక్కడ కూడా అలాగే చేయించడం, ఈ రోజులకి తగ్గట్టు కంప్యూటర్ వాడకం, అందులో మార్పులూ, చేర్పులూ అన్నీ చూపించారు.
ఇలాంటి మార్పుల వల్ల పెళ్ళికాని అబ్బాయిలు పడ్డ ఇబ్బందులూ, పెళ్ళి కోసం అమ్మాయిలు కోరినట్టు మారడానికి సిధ్ధపడ్ద అబ్బాయిలూ ..అంతా చదువుతుంటే నిజంగా ఎదురుగా జరుగుతున్నట్టే అనిపించింది.
బ్రహ్మాది దేవతల దగ్గర్నుండీ అందర్నీ ఇందులోకి లాగారు.
చాలా సీరియస్ విషయాన్ని ఇలా తేలిక మాటలతో చెప్పడం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని అవలీలగా సాధించారు రచయిత్రి.
ఇంకో ముఖ్యమైన విషయం.
మిగిలిన మనుషుల కన్న రచయిత కాస్త ముందుకాలానికి వెళ్ళి ఆలోచించాలంటారు.
ఈ కథలో రచయిత్రి ఆ విధంగా కూడా సఫలమయ్యారనే అనిపిస్తోంది.
ఎందుకంటే 2009 లో ఆవిడ ఊహించి రాసిన ఈ కథ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే నిజమైనట్టే అనిపిస్తోంది.
ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు వరుణ్ణి ఎన్నుకుని "ఇట్స్ మై ఛాయిస్.." అని చెప్పుకుంటున్నారు.
అందుకనే ఈ కథ నాకు నచ్చింది.

______________________________________________________________________________________________


ఈ కథ మీరు ఇక్కడ చదవవచ్చు.

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/its-mai-cayis--jyoti-valaboju



కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా

0 వ్యాఖ్యలు: