Pages

Saturday, November 5, 2016

ఉపాయం వుందిగా..ఉపాయం వుందిగా..

అచ్చంగా తెలుగు సమూహంలో శ్రీమతి మంథా భానుమతిగారు శ్రీ కట్టుపల్లి ప్రసాద్గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కథలపోటీలో తృతీయ బహుమతి పొందిన నేను వ్రాసిన కథ..
"ఉపాయం వుందిగా.."


సిరికిం జెప్పడు శంఖ చక్రయుగామున్ చేదోయి సంధింపడు...” అంటూ గజేంద్ర మోక్షంలో పోతనగారు చెప్పినట్టు తనను తానూ పూర్తిగా భగవంతుని శరణాగతి కోరిన వాడిని రక్షించటానికి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు అలాగే పరుగెడుతూ వచ్చేస్తాడు...”
చాగంటి వారి ప్రవచనాలలో లీనమైపోయి వింటున్న పద్మనాభం గారికి, హాల్లోనే మరో మూల కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటున్న మనవాడి శశాంక్ గొంతు టీవీ వాల్యూమ్ ని మించి వినిపించింది.
అబ్బ! తాతయ్యా.... సౌండ్ కాస్త తగ్గిస్తావా? ఇక్కడ నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఇంకా బోల్డు హోమ్ వర్క్ ఉంది...” గబుక్కున టీవీ ఆఫ్ చేసేసేరు పద్మనాభం గారు.
బెడ్ రూమ్ లో ఉతికిన బట్టలు మడత పెడుతున్న భార్యని చూసి రాజారావు, “వాడెందుకలా అరుస్తాడు? పెద్దాయన ఫీల్ అవరూ?” అన్నాడు.
పొద్దుటినుంచీ ఏదో ఒక పనిలో అలిసిపోయున్న దమయంతి, “ఆయన పెద్దాయన, వీడు చిన్నవాడు... ఇద్దరిలో ఎవరికీ మటుకు ఏం చెప్పగలం?” అంది.ఇక వాదన పెంచుకుందుకు అది సమయం కాదనుకుంటూ, “రేపు నేను వచ్చేటప్పుడు కరెంట్ బిల్లూ, ఫోన్ బిల్లూ కట్టేస్తాను. నువ్వు వచ్చేటప్పుడు దారే కనుక, అమ్మా నాన్నల మెడికల్ రిపోర్ట్స్ తీసుకొస్తావా?” అనడిగాడు.“అలాగే, అన్నట్టు మీరు వచ్చే దారిలోనే కదా జనరిక్ మందుల షాపులున్నాయి... నాకు కొంచెం పెయిన్ కిల్లర్స్ తెస్తారా, వచ్చేటప్పుడు?” అడిగింది దమయంతి.
...” అంటూ ఆఫీస్ ఫైల్స్ తీసుకోవటానికి హాల్లోకి వెళ్ళిన అతను తల్లిదండ్రులు నెమ్మదిగా మాట్లాడుకోవటం విన్నాడు.
మనం మన ఊరు వెళ్లి ఒక్కళ్ళం ఉండలేమంటారాండీ?” అడుగుతోంది సావిత్రి.“ఏమని వెడతాం చెప్పు? ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుని వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళినా అద్దింట్లోనో ఉండాలి...” అంటున్న పద్మనాభం గారి మాటలకి అడ్డు వస్తూ, “ పోనీ, అలాగే ఉందాం... రామం గారింట్లో పక్కన రెండు గదులూ తీసుకుని ఉందాం... మాత్రం ఉండలేమా?” అందావిడ.
ఎలా ఉండగలం? నాకా పెన్షన్ రాదు... మళ్ళీ మన అద్దెకీ, నెల గడవడానికీ వీడే డబ్బు ఎత్తి పంపాలి కదా.. ఏదో అందరం కలిసి ఉంటున్నాం కనుక సర్దుకొస్తున్నాడు కానీ మళ్ళీ మనకి వేరే కాపురం పెట్టి డబ్బు పంపాలంటే పాపం వాడికీ కష్టమే కదా?”
ఏమోనండి... ఇంత వయసొచ్చి, చిన్నపిల్లాడి చేత మీరు మాటనిపించుకుంటుంటే నాకు బాధగా అనిపించి అలా అన్నాను... నిజమేలెండి... పాపం వాడు మటుకు ఎత్తి పంపడం కష్టమే కదా... అయినా మీరు మరీనండి... టీవీ అంత గట్టిగా పెట్టుకోవాలా? చదువుకునే పిల్లాడింట్లో ఉన్నాడని మాత్రం తెలీదూ?” “అలాగేలే... ఏవిటో, వినిపించక అలా పెట్టుకున్నాను. ఇక మీద వాడి హోమ్ వర్క్ అయ్యేకే పెట్టుకుంటాలే టీవీ...”
అమ్మానాన్నల సంభాషణ విన్న రాజారావు మనసు భారమైంది.
ఊళ్ళో ఎప్పుడో తాతల నాటి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఉండేవారు అమ్మా, నాన్నా... కప్పు ఎప్పుడు కూలి తలమీద పడుతుందో అని హడిలిపోయే వారు. మరమ్మతులు చేయించుకునేంత స్తోమత లేదాయె. అందుకే దానిని అమ్మి, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసేడు. పల్లెటూరూ, పడిపోతున్న ఇల్లూ కనుక దానికి అంత ఎక్కువ డబ్బేమీ రాలేదు. వచ్చిన డబ్బుతో ఫ్లాట్ కి డౌన్ పేమెంట్ కట్టాడు. మిగిలినది నెలనెలా వాయిదాలతో తీరుస్తున్నాడు. తన పరిస్థితులతో వాళ్ళూ, వాళ్ళ సర్దుబాటులతో తామూ కలిసి ఉండక తప్పదు.
ఇందులో ఎవరూ పరాయి వాళ్ళు కాదు. ‘నాకేమి ఒరిగిందీ?’ అనుకునే కంటే, ‘నేనేరకంగా సర్దుకోగలనూ అనుకుంటేనే సంసారం సవ్యంగా నడుస్తుంది. అదృష్టం బాగుండి దమయంతి మంచిదే. అత్తమామలు పనికిరారనే మనిషి కాదు. ఎటొచ్చీ ఆఫీసులో కూడా పని ఎక్కువైనప్పుడు కాస్త విసుక్కుంటుంది. తప్పదు. అందరమూ మనుషులమే... వాళ్ళు పెద్దవాళ్ళు... కాలం గడవక కాలక్షేపం కోసం టీవీ పెట్టుకుంటారు. శశాంక్ చదువుకునే పిల్లాడు... వాడికి ప్రతి నిమిషమూ విలువైనదే... వాడి చదువుకు కూడా అంతరాయం కలగకూడదు కదా! ఎలా సమస్యను పరిష్కరించడం? రాజారావు అన్ని విధాలుగానూ ఆలోచిస్తున్నాడు.
***
భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వైపు వెళుతున్న రాజారావుకి, దమయంతి మాటలు వినబడ్డాయి.
చూడు నాన్నా, తాతగారికి వినిపించదు కనుక కొంచెం ఎక్కువ సౌండ్ పెట్టుకుంటారు. నువ్వలా ఆయన మీద అరిస్తే డాడీ బాధపడరూ?” కొడుక్కు నచ్చజెబుతోంది.
ఏంటి మామ్, అసలే హోమ్ వర్క్ తెమలక నేను చస్తుంటే, తాతగారు టీవీ అంత సౌండ్ పెడితే నాకేమైనా బుర్రకెక్కాలా వద్దా? ఆఖరికి ఎగ్జామ్స్ లో కూడా ప్రవచనాలే రాసేట్టున్నాను...” చిరాగ్గా అన్నాడు శశాంక్.
భోజనం చేస్తూ, “ సమస్యకి పరిష్కారం లేదా దమ్మూ?” అనడిగాడు రాజారావు.
ఏమో బాబూ, కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది. పూట పూటా భాగోతం భరించలేను. ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు తెలియదు. ఉన్న కొద్దీ వాడు పెద్ద క్లాసుల్లోకి వెడతాడు. ఇంట్లో వాడికి చదువుకుందుకు చోటే లేకుండా పోతోంది. హాల్లో టీవీ సౌండ్ తో వాడెలా చదువుకోగలడు? పైగా ఏడు వాడికి కంప్యూటర్ కూడా కొనాలి. ఎక్కడ పెట్టుకుంటాం? మనక్కావలసినవి మనమెలాగూ మానుకున్నాం. పిల్లాడి చదువు చూసుకోకపోతే ఎలా?” నిష్ఠూరంగానే అన్నా, దమయంతి మాటల్లో సత్యం కనిపించింది రాజారావుకి.
అసలే ఆఫీసులో పనీ, ఇంట్లో గొడవతో చిరాగ్గా ఉన్న దమయంతికి రాత్రి నడుమునొప్పి విపరీతంగా వచేసింది. టాబ్లెట్ వేసుకొని, గదిలో కిటికీ తలుపులన్నీ మూసేసుకొని, భోజనం కూడా చేయలేక పడుకుండిపోయింది. దమయంతి నడుము నొప్పితో నాలుగురోజులకో సారైనా చాలా బాధ పడుతూ ఉంటుంది. పొద్దుట్నించీ గిలక్కాయలా తిరుగుతూ పనులన్నీ చేసుకునే కోడలు ఇలా నడుమునొప్పితో బాధ పడటం చూస్తూంటే సావిత్రికి చాలా బాధగా అనిపించింది. కాసిని పాలు వేడి చేసిద్దామని చూసేటప్పటికి గిన్నెలో పాలు కొంచెమే కనిపించాయి. అవి మర్నాటికి తోడు పెట్టడం కోసం అట్టిపెట్టిన పాలు. తాతా, మనవడు కూడా అన్నంలో పెరుగు బిళ్ళ వేయనిదే భోజనం చేయరు. కాసిని పాలూ ఉన్న గిన్నె చేతిలో పెట్టుకుని, ఒక్క క్షణం చూసి, ‘పోనీలే, రేపు ఉదయం ఆయనకి పెరుగు వెయ్యడం మానేస్తాను...’ అనుకుంటూ గ్లాసులోకి పాలు తీసుకుని, వేడి చేసి, పంచదార కలిపి రాజారావు చేతికిచ్చి దమయంతి చేత తాగించమంది.
రాజారావు తెచ్చిన పాలు చూసి దమయంతి, “ఇప్పుడీ పాలు నాకెందుకండీ? రేపు పెరుగు లేకపోతే ఇబ్బంది అవుతుంది...” అంది.
పోనిద్దూ! రేపు శశాంక్ పెరుగు వేసుకోవడం మానేస్తాడు. ఒక్క పూటకి ఏమీ కాదులే... నువ్వు పాలు తాగు..” అంటూ ఒక విధంగా బలవంతంగానే దమయంతి చేత పాలు తాగించాడు రాజారావు.
రాత్రి జరిగిన గొడవతో నిద్ర సరిగ్గా లేకపోవడంతో ఉదయం లేచేసరికి రాజారావు, దమయంతీ కూడా కాస్త చిరాగ్గానే ఉన్నారు. పొద్దున్నే హడావిడిగా తయారయి శశాంక్ ను స్కూలుకు పంపి ఇద్దరూ ఆఫీసులకి బయలుదేరేరు.
వచ్చేటప్పుడు మరచిపోకుండా నా మందులు తెండి... నొప్పి భరించలేకపోతున్నాను...” అని వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తు చేసింది దమయంతి. మరో పదినిమిషాలకి దమయంతి కూడా తయారై అత్తగారితో చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది.
కొడుకూ, కోడలు ఆఫీసులకీ, మనవడు శశాంక్ స్కూలుకీ వెళ్ళాక, అప్పటిదాకా కాళ్ళూ చేతులూ కట్టేసినట్టు, కదలకుండా పేపరు పుచ్చుకుని గదిలో ఉండిపోయిన పద్మనాభం గారు హాల్లోకి వచ్చి భక్తి టీవీ పెట్టుకుని ప్రవచనాలు వింటూ జరిగినది మర్చిపోడానికి ప్రయత్నిస్తున్నారు.
***
సాయంత్రమైంది. అందరూ గూటికి చేరారు. పద్మనాభం గారు మళ్ళీ తమ గదిలోకి దూరిపోయి, పొద్దున్న చదివిన పేపరే మళ్ళీ చదవడంలో మునిగిపోయారు.
ఇంటికి వచ్చిన రాజారావు తను వస్తూ తెచ్చినవన్నీ, డైనింగ్ టేబుల్ మీద పెట్టి, కాళ్ళూ చేతులూ కడుక్కు రావడానికి వెళ్ళాడు. అవన్నీ విడదీసి ఎక్కడివక్కడ సర్దుతున్న దమయంతి అందుల పాకెట్ తీసి చూసింది.
ఇదేమిటండీ, పెయిన్ కిల్లర్ ఒక్కటే తెచ్చారు? జెంటాక్ తేలేదేం? ఆంటాసిడ్ వేసుకోకుండా పెయిన్ కిల్లర్ ఒక్కటే వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ కి కడుపులో మండిపోతుంది కదా?” నిలదీసింది భర్తని.
అరెరే... పెయిన్ కిల్లర్ ఒక్కటే చాలనుకున్నాను...” భర్త జవాబుకు తల కొట్టుకుంది దమయంతి.
నడుము నొప్పి తగ్గటానికి పెయిన్ కిల్లర్. కానీ పెయిన్ కిల్లర్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంది. అదేమిటంటే కడుపులో మంట. సైడ్ ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే ఆంటాసిడ్ వేసుకోవాలి...” విడమరచి చెప్పింది.
అంటే, ప్రతీ సమస్యకీ ఒక పరిష్కారం ఉన్నట్టే పరిష్కారానికి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట!” ఆలోచిస్తున్నట్టు అన్నాడు రాజారావు.
మాత్రం దానికి అంత ఆలోచన ఎందుకో...”
దమయంతిని చేయిపట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాడు, రాజారావు.
అంటే, తల్లిదండ్రులు వృద్ధులైపోయి, ఒంటరిగా ఉండలేకపోవడం సమస్య అయితే, వాళ్ళని కొడుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం దానికి పరిష్కారం. కానీ మూడుతరాలు ఒకే ఇంట్లో ఉండాల్సివచ్చినప్పుడు పరిష్కారానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవే మనం రోజూ అనుభవించే ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్...”
అర్థం కానట్టు చూసింది దమయంతి.
దమ్మూ, అమ్మానాన్నలు మనింట్లో ఉండటం మనం సమస్యగా అనుకోకూడదు. అది సమస్య కాదు కానీ, ప్రస్తుతానికి సమస్యగానే అనుకుందాం. అమ్మా నాన్నా మనతోనే ఉండాలి, ఉంటారు కూడా.. దానికి నీక్కూడా విధమైన అభ్యంతరం లేదని నాకూ తెలుసు. కానీ చదువుకుంటున్న పిల్లాడి దృష్ట్యా చూస్తే వాళ్లిక్కడ ఉండడం వాళ్ళ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. వాటిని మనం ఫేస్ చేయకతప్పదు. కానీ ఇప్పుడు నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ కి అది రాకుండా ఎలా ఆంటాసిడ్ వేసుకుంటున్నావో అలాగే మనం కూడా వాళ్లుండడం వాళ్ళ వచ్చే సమస్యకి ఆంటాసిడ్ వేద్దాం.”
ఎలా?” కుతూహలంగా అడిగింది దమయంతి.
మనది టూ బెడ్ రూమ్ ఫ్లాట్ కదా! సౌకర్యంగా ఉంటుందని, పెద్ద అటాచ్డ్ బాత్ ఉన్నది అమ్మానాన్నలకిచ్చి, మనం చిన్నదానిలో ఉంటున్నాం. ఇన్నాళ్ళూ శశాంక్ చిన్నవాడు కనుక నడచిపోయింది. ఇప్పుడు వాడూ, వాడు చదివే క్లాసూ కూడా పెరుగుతున్నాయి. ఇకపై వాడికి చదువుకునేందుకు ఒక రూమ్ కావాలి. అందుకని మనం మనింట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇక గొడవలేం ఉండవు...”
ఏం మార్పులు?”
మనది డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూమ్ పొడుగ్గా ఉంది కదా... దాన్ని ఒక్క సోఫాలు పట్టేంతవరకే ఉంచి, అక్కడినుంచి డైనింగ్ వరకూ ఒక్క సన్నని పాసేజ్ మటుకే ఉంచి ఒక పక్కకి పార్టిషన్ పెట్టేద్దాం. అది శశాంక్ కి స్టడీ రూమ్ అవుతుంది. కిటికీ పక్కకి రైటింగ్ టేబుల్ వేస్తే, పక్క గోడకి కంప్యూటర్ సెట్ చెయ్యొచ్చు. పక్క బాల్కనీలో మరో బాత్ రూమ్ కట్టిద్దాం. చిన్నదైనా ఫర్వాలేదు. టీవీని అమ్మా వాళ్ళ రూము లోకి షిఫ్ట్ చేద్దాం. మనకి ఎటూ చూడడానికి టైముండదు. ఎప్పుడైనా చూడాలంటే అక్కడే కూర్చుని చూద్దాం. ఇంకోటీ, అంతే ముఖ్యమైనది ఏమిటంటే, నాన్నగారికి టీవీకి కనెక్ట్ చేసే ఒక హెడ్ ఫోన్ సెట్ కొనివ్వడం. అవి చెవిలో పెట్టుకుని, ఆయన టీవీలో, ఛానెల్ ఎంత సౌండ్ పెట్టుకుని చూసినా పక్కవాళ్ళకి కూడా వినిపించదు. శశాంక్ కి అసలు డిస్ట్రబెన్స్ ఉండదు... ఏమంటావ్?”
మరి డబ్బు?” చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగింది దమయంతి.
మా ఆఫీసులో ఉన్న కోపరేటివ్ సొసైటీ లో రెండేళ్ళ క్రితం తీసుకున్న లోన్ ఈనెలతో తీరిపోయింది. వచ్చేనెలలో మళ్ళీ తీసుకుంటాను. ఏముందీ? ఇంకో రెండేళ్ళు లోన్ కట్టుకుంటాం.. అంతే...”
కళ్ళు విప్పార్చుకుని రాజారావుని చూసింది దమయంతి.
సమస్య ఇంత సులువుగా తీరుతుందనుకోలేదండీ... రోజూ అటు పెద్దవాళ్ళని ఏమీ అనలేక, ఇటు పిల్లవాడికి నచ్చజెప్ప లేక నన్ను నేను తిట్టుకుంటూ, మిమ్మల్ని విసుక్కునే దాన్ని. మీరన్నట్టు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకునే ముందు ఆంటాసిడ్ వేసుకున్నట్టే, సమస్య వస్తే పరిష్కారం చూసే ముందు అది అందరికీ ఆమోద యోగ్యమైనదైతే అంతా సుఖాంతమే కదండీ...” మెరుస్తున్న కళ్ళతో అంది.
, సుఖాంతమే... ఎందుకంటే, ఇదంతా నువ్వు అర్థం చేసుకున్నావు చూడు... అందుకూ సుఖాంతం...” అన్నాడు మనస్ఫూర్తిగా రాజారావు.
***
--------------------------------------------------------------------