Pages

Sunday, April 29, 2012

ఒక ఇంగ్లీష్ అమ్మాయితో పరిచయం.


       మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన "మరపురాని అనుభవాలు" అనే పుస్తకంలో ఆయన రాసుకున్న అనుభవాల్లో ఇదీ ఒకటి. 1935 ప్రాంతాల్లో జరిగిందిది. చిన్నప్పుడు ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఈ కథ చెప్పినప్పుడల్లా ఇందులో ఆ ఇంగ్లీష్ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఖండించనందుకు మా నాన్నగారితో దెబ్బలాడేవాళ్లం. ఆయన నవ్వేసి ఊరుకునేవారు. అదేమిటో మీరూ చదవండి మరి..
     ఒక ఇంగ్లీష్ అమ్మాయితో పరిచయం.
  బెనారస్ యూనివర్సిటీ చదువు పూర్తయిన తరువాత ఒకసారి ఉత్తరదేశ పట్టణాల విశేషాలు చూద్దామని ఢిల్లీ వరకు వెళ్ళాను. ముఖ్యంగా చూడదలచుకున్నది ఆ టూర్ లో తాజ్ మహల్. అందువలన ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్ళి ఆ పట్టణంలో ఇతర విశేషాలు చూద్దామని టాంగాలో బయలుదేరాను. ఫతేపూర్ సిక్రీ, ఆ చుట్టూప్రక్కల విశేషాలు చూసిన తరువాత,  ఇంకా కొన్ని చూడవలసిన గోరీలు ఉన్నాయని టాంగావాలా తీసుకువెడుతున్నాడు. కొంతదూరం వెళ్ళాక టాంగావాలా టాంగా ఆపుచేసాడు. ఎందువలన ఆపాడోనని ముందుకు చూసాను. అక్కడ ఒక విదేశీ అమ్మాయి రోడ్డు వారగా చిన్న గొడుగుతో నిల్చుని ఉంది. టాంగాలో ఇంకా ఖాళీ ఉండడం వలన ఆ అమ్మాయి టాంగాలో వస్తుందేమోనని టాంగావాలా ఆశపడ్డాడు. ఆ అమ్మాయికి వయస్సు ఇరవై సంవత్సరాలకు మించియుండదు.
టాంగావాలా ఇంగ్లీష్ లో అడిగిన ప్రశ్న ఆమెకు అర్ధం కాలేదు కాని అడిగిన విషయం గ్రహించగల్గింది. వెంటనే నిరాకరించినట్లుగా తల ఊపింది. టాంగావాలా తిరిగివచ్చి టాంగాను బయలుదేరదీశాడు. నేను వాడిని టాంగా ఆపమని క్రిందకి దిగి, ఆమె దగ్గఱకు వెళ్ళి, ఆమె వచ్చినట్లయితే సాదరంగా ఆహ్వానం ఇవ్వగలనని ఇంగ్లీష్ లో అడిగాను. అందుకామె కృతఙ్ఞతలు తెల్పుతూ ఎక్కడివరకు వెళ్తున్నారని అడిగింది. నేను వెళ్లదలచుకున్న ప్రదేశమేమిటో చెప్పాను. ఆమె తాను అవియన్నీ చూశాననీ తిరుగుప్రయాణంలో రావడానికి అభ్యంతరం లేదనీ చెప్పింది. అది విని నేను మళ్ళీ టాంగా ఎక్కి ముందుకు సాగేను. నేను చూడవలసినవన్నీ చూసి, ఆ టాంగాలోనే తిరిగివస్తుంటే, ఇదివరకు నిల్చున్న ప్రదేశానికి కొంచెం దగ్గరలోనే ఆ అమ్మాయి నిల్చొని ఉంది. నేను టాంగా ఆపగానే నన్ను చిరునవ్వుతో పలకరించి టాంగా ఎక్కి కూర్చుంది. అది ఆగ్రాకు తిరుగుప్రయాణం. సుమారు ఒక గంట సేపు పట్టింది.
ఆ సమయంలో ఆమెతో జరిగిన సంభాషణలో ఆమె చూపిన నేర్పరితనం, ఆత్మీయతా, ఇప్పటికీ నేను మరువలేకుండా ఉన్నాను. ఆమె నా వివరాలు తెలుసుకుని, తన వివరాలను ఈ విధంగా చెప్పింది. లండను నగరానికి పదిమైళ్ళదూరంలో వారి ఇల్లు ఉన్నదనీ, ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అక్కడ ఉంటోందనీ, ఆస్ట్రేలియాలో నున్న అన్నగారిని చూడడానికి వెళ్ళి, తిరిగి లండన్ వెళుతూ తాజ్ మహల్ చూడడానికి తాను కలకత్తాలో ఓడ దిగి ఇలా వచ్చాననీ, మళ్ళి తిరిగి వారంరోజుల్లో బొంబాయిలో ఓడ ఎక్కి లండను వెళతానని చెబుతూ, నేను "లా" చదువుతున్నట్లు తెలుసుకుంది. కనుక నన్ను లండన్ వచ్చి బార్-ఎట్- లా చేయవలసిందిగా ఆహ్వానించింది. లండనులో వారి కుటుంబసభ్యుడుగా ఉండవచ్చనీ తన తల్లిదండ్రులు   నాకు ఏ లోటూ రాకుండ చూసుకుంటారనీ ఎంతో ఆత్మీయతతో చెప్పింది. నేను చాలా ఆనందించాను. అతిథి సత్కారమనేది కేవలం హిందువుల ప్రత్యేకతయే కాదని తెలిసివచ్చింది.
  మేమిద్దరం కలిసి ప్రయాణం చేసిన గంటసేపూ కూడా ఆగ్రా పట్టణాన్ని గురించి మొగలు సామ్రాజ్యాన్ని గురించి, మేము చూస్తున్న శిథిలాలగురించి చాలా విషయాల నెంతో వివరంగా చెప్పింది.
     ఇండియాలో ఉన్న నాకు తెలియని యీ విషయాలన్నీ నీకెలా తెలిసాయని ఆమె నడిగాను. అప్పుడామె "నేను ఈ దేశం చూడడానికి వచ్చాను. రావడానికి ముందుగా ఈ దేశం గురించి నాకు దొరికిన పుస్తకాలన్నీ చదివాను. ఈ దేశం గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతనే ఈ దేశం చూడడానికి వచ్చాను. అలా కాకపోతే ఈ దేశం వచ్చిన ప్రయోజనం లేదుకదా! నేను చూసినదేమిటో, వాటి ప్రాముఖ్యం ఏమిటో తెలియకపోతే నా ప్రయాణం వృధాయే కదా!" అని అన్నది. ఆ సమాధానం విని, ఆమె తెలివికి జోహారులర్పించాను. ఆగ్రా పట్టణానికి ముందుగా ఒక ఇంగ్లీష్ కాన్వెంటు ఉంది. ఆమె అక్కడ నా దగ్గర వీడ్కోలు తీసుకుని దిగిపోయింది.
   నాలుగైదు రోజుల తరువాత నేను ఢిల్లీనుండి బొంబాయి వెళుతూ ఉండగా "ఝాన్సీ" స్టేషన్ లో బండి ఆగినపుడు నేను ప్లాట్ ఫారం మీద నడుస్తుండగా "శాస్త్రీ, శాస్త్రీ, " అన్న పిలుపు వినగానే తిరిగి చూశాను. ఆ బండిలో మొదటి తరగతి కంపార్టుమెంటులో ఆ అమ్మాయి కనిపించింది. నన్ను పెట్టెలోనికి రమ్మని ఆహ్వానించింది. ఇంకొక ముగ్గురమ్మాయిలు ఆమెతో ఆ కంపార్టుమెంటులో ఉన్నారు. వారు కూడా ఇంగ్లీష్ వారే.  పరస్పర పరిచయాలయిన తదుపరి ఒక పదినిముషాలు సంభాషణ మా మధ్య సాగింది. బేరర్ ఒక ట్రేలో టీ తీసికొని వచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. అందరం కలసి టీ తీసుకున్నాం. ఆ ట్రేలో టీ నిమిత్తం ఇవ్వవలసిన ఖరీదుకు ఒక బిల్లు ఉంది. నేనది చూచి ఆ మొత్తం నేనిద్దామనే ఉద్దేశంతో జేబునుండి పర్సు తీయబోయాను. అప్పుడా అమ్మాయి చిన్నగా నవ్వుతూ అన్నది కదా- "No, no,Sastry, I know Indians are poor" అని. దానికి నేనేమనగలను? ఆమె ఙ్ఞాపకాలను ఆజన్మాంతం హృదయంలో పదిలంగా దాచుకొనడం తప్ప.
---------------------------------------------------------------------------------------------
(చిత్రం--గూగులమ్మ సౌజన్యంతో...)
14 వ్యాఖ్యలు:

buddha murali said...

లలిత గారు అప్పుడు ఇండియా పూర్ కావచ్చు కానీ ఇప్పుడు ఆమెరికా వాడికే ఉపాది చూపే స్థాయికి ( ఆర్ధిక రంగం లో ) వెళ్ళాం కదా

ఎస్పీ జగదీష్ said...

మనం పూర్ అయితే ఇంగ్లీష్ వాళ్ళు అంత కష్టపడి భారత దేశం వచ్చేవారే కాదు. వారి వల్లే మనం పేదవాళ్ళమయ్యాము. నేనయితే ఇదే చెప్పేవాడిని...

జ్యోతిర్మయి said...

అంతవరకూ ఉత్తమ సంస్కారంతో మాట్లాడిన ఆ అమ్మాయి, ఆ విధంగా ఎందుకు అన్నదో అర్ధం కాలేదు.

anrd said...

మంచి పోస్ట్ వ్రాసారండి.

ఇప్పటికీ మనం పూర్ కాదని మన ప్రభుత్వం వద్ద ఉన్న బంగారు నిల్వలను బట్టి తెలుసుకోవచ్చు. ఇంకా , భారతీయులకు పెద్దలు నేర్పించిన పొదుపు వంటి మంచి అలవాట్ల వల్ల ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ దేశం నిబ్బరంగా నిలబడుతోంది..

Anonymous said...

తెల్లోడి బిస కదా...

SNKR said...

ఇరవైల్లో వున్న అమ్మాయి/అబ్బాయి మాటలను లిటరల్గా తీసుకోనవసరంలేదు లేండి. అప్పట్లో ఆమె అన్నదాట్లో తప్పేమి లేదు కాని, హర్ట్ చేయాలనే ఉద్దేశ్యం వుండదు. ఆ అమ్మాయిని క్షమించేయండి. :)

మాలా కుమార్ said...

బయట దేశాలవారికి అదే అభిప్రాయం వుంటుందేమో . మా వియ్యలవారు మా అల్లుడు పుట్టినప్పుడు హవాయిలో వుండేవారట . అక్కడి నుంచి ఇండియా వచ్చేస్తుంటే వాళ్ళ ఇంటి ఓనర్ " పాపం ఇండియా పూర్ కంట్రీ కదా , అక్కడ మీ బాబు కు పట్టటానికి పాలు కూడా దొరకవేమో " అని చాలా జాలి పడిపోయిందిట. మా ఇండియా పూర్ కాదు మేము బాగానే బతుకుతాము అని ఆవిడను ఒప్పించటానికి చాలా తిప్పలు పడ్డారట :) 35 ఏళ్ళక్రితం పరిస్తితే అలావుంటే 75 ఏళ్ళ క్రితం ఆవిడ అలా అనుకుందంటే తప్పులేదులెండి :)

కృష్ణప్రియ said...

హ్మ్.. ఆరేళ్ల క్రితం ఒక పదిహేను రోజులకి అమెరికా లో ఉత్తర కరోలినా రాష్ట్రం ఏదో ఆఫీసు పని మీద వెళ్లవలసి వచ్చింది. అక్కడ పని అంతా అయ్యాక ఒక వారాంతం ఏదైనా పిల్లలకి కొనాలి అనుకుని, అక్కడి డైరెక్టర్ గారి సెక్రెటరీ ని మాటల సందర్భం లో అడిగాను.. అతి దగ్గర లో షాపింగ్ ఏముందని.. ఆవిడ పట్టణం లో గరాజ్ సేల్స్ విషయాలు, డాలర్ షాప్ వివరాలూ మాత్రమే చెప్పింది.

పర్వాలేదు. ఇంకొంచెం డబ్బు పెట్టగలను. మాల్ కి వెళ్లి కొనగలను. అని ఒప్పించాల్సి వచ్చింది.

Rao S Lakkaraju said...

"No, no,Sastry, I know Indians are poor" అని. దానికి నేనేమనగలను?
--------------
నేనయితే థాంక్యు అంటాను. మనస్థత్వాలని అమాంతంగా మార్చలేము కదా. ఆ అమ్మాయి సంతోషానికి కారణమైన వాళ్ళ మవుతాము. ఆ పరిస్థుతులలో ఉంటే ఇంగ్లీష్ వాళ్ళ సంగతి చెప్పలేను గానీ అమెరికన్ అయితే మాత్రం థాంక్యు చెప్పేస్తాడు.

వనజవనమాలి said...

లలితా గారు.. చక్కని విషయం పంచుకున్నారు. కొందరి దృష్టిలో కొందరు అంటే! కాలగతిలో వారు వీరు అవుతారు కదా!

శ్రీలలిత said...

buddha muraligaru,
మీరన్నది నిజమేనండీ..

ఎస్పీ జగదీష్ గారు,
అంతేకదండీ.. మన సంపదంతా కొల్లగొట్టుకుపోయేరు కదా..

జ్యోతిర్మయిగారూ,
ఇదివరకు ఇతర దేశాలకు అటువంటి అభిప్రాయం వుండేదండీ.
indians are poor అనుకునేవారు చాలామంది. ఆ అమ్మాయి అందుకే అలా అనివుంటుంది.

anrdgaaru,
అవునండీ. మీరు సరిగానే చెప్పారు. కాని భారతీయుల జీవనవిధాన లెక్కలని బట్టి చూస్తే ఇప్పటికీ మన దేశాన్ని అభివృధ్ధి చెందుతున్న దేశమనే అంటున్నారు కాని అభివృధ్ధి చెందిన దేశమని అనటంలేదు.

శ్రీలలిత said...

puranapandaphanigaaru,
మీరన్నదాంట్లో పాయింట్ లేకపోలేదండోయ్..

SNKRgaru,
అలాగేనండి క్షమించేద్దాం. ఆవిణ్ణి క్షమించినందుకేనేమో మా నాన్నగారు మేము ఆ స్టేట్మెంట్ ఖండించమన్నప్పుడల్లా నవ్వుతూ ఊరుకునేవారు.

మాలా కుమార్ గారూ, నిజమేనండీ. బయటదేశాలవారికి ఇలాంటి అభిప్రాయమే వుండేదని నేనూ విన్నాను.

కృష్ణప్రియగారూ, మీరన్నది అక్షరాలా నిజం. ఇటువంటి అనుభవాలు చాలామంది దగ్గర విన్నాను.

శ్రీలలిత said...

Rao S Lakkaraju garu,
ఇంగ్లీష్ వారికీ, అమెరికా వాళ్ళకీ తేడా బలే చెప్పేసేరే..

వనజవనమాలిగారూ,
విషయం నచ్చినందుకు ధన్యవాదాలండీ. నిజమే. కాలం ఎంతపనైనా చెయ్యగలదు.

జయ said...

చాలా మంచి విషయం చెప్పారండి. మీ నాన్నగారి కథల బుక్ నాక్కూడా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. మొత్తం బుక్ తప్పకుండా చదువుతాను.