Pages

Thursday, October 16, 2014

శ్రథ్థాంజలి..



      మాన్యులు శ్రీమతి తురగా జానకీరాణిగారు నాకు గురుతుల్యులు.

    ఇరవై సంవత్సరాలక్రితం ఒక కథ వ్రాసి ఆకాశవాణి స్త్రీల కార్యక్రమానికి పంపిస్తే, అలా కథలా కాకుండా అదే విషయాన్ని ఒక నాటికలా వ్రాసి పంపమని ఆవిడ స్వయంగా ఉత్తరం వ్రాసారు. అంత పేరున్న ఆవిడ ఎంతో ఆప్యాయంగా అలాగ వ్యక్తిగతంగా నాకు ఉత్తరం వ్రాయడం నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఆవిడ అలా చెప్పడం వలన ఆకాశవాణికి నాటికలు ఎలా వ్రాయాలో నాకు తెలిసింది. ఆ నా మొట్టమొదటి నాటికను “రేపటి మహిళ” అనే పేరుతో ప్రసారం చేసారు జానకీరాణిగారు.

    అంతే కాకుండా మీ స్నేహితులంతా కలిసి ఒక మహిళామండలిగా యేర్పడండి, మీకు ఆకాశవాణిలో కార్యక్రమం చేసే అవకాశమిస్తాను అని చెప్పి, మమ్మల్ని ప్రోత్సహించి, లలితా మహిళామండలి ఆవిర్భవించడానికి కారణమయ్యారు. మా మొట్టమొదటి ప్రోగ్రామే సంక్రాంతిపండుగ ప్రత్యేక కార్యక్రమంలా చేయించి, మమ్మల్ని యెంతగానో ప్రోత్సహించారు.  ఆవిడ ఇచ్చిన స్ఫూర్తి వలన మేము అలాగ యెన్నో కార్యక్రమాలు చేసాము.

     అంతే కాకుండా యెక్కడ కనపడినా ఆప్యాయంగా పలకరించడం ఆవిడ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. నేను వ్రాసిన కథలను చదవమని ఆవిడకు యిస్తే, యెంతో ఓపికగా అవి చదవడమే కాకుండా, మా ఇంటికి ఫోన్ చేసి మరీ ప్రతి కథనూ విశ్లేషించడం నాకు ఒక వరంగానే అనిపిస్తుంది.

   అటువంటి మహా మనీషి గురించి యెంత చెప్పినా తక్కువే. వారి పిల్లలకు ఈ దుఃఖం తట్టుకునే శక్తి నివ్వాలనీ, ఆవిడ ఆత్మకు శాంతి కలగాలనీ ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.

 

0 వ్యాఖ్యలు: