Pages

Monday, March 8, 2010

మరుజన్మంటూ వుంటే
అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
తేనె లోని తీయదనం, పూల లోని సౌకుమార్యం, తొలి వెలుగు లోని వెచ్చదనం, పిల్లగాలి చల్లదనం, తొలకరి లోని గిలిగింత, పౌర్ణమినాటి పులకరింత, కోయిల కూత లోని పలకరింత, ఇవన్నీ, ఇలాంటివన్నీ, ఇంకా ఇలాంటివెన్నొ కలిసి నిండురూప మిచ్చేదే ఆడజన్మంటే..
నేను స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషిస్తున్నానో, ఎంత గర్వపడుతున్నానో అనుకుంటుంటే, ఒక్కొక్కటే గుర్తొచ్చాయి. మొట్టమొదట...అమ్మ..
తెలిసీ తెలియని చేతలతో ఆమెని ఇబ్బంది పెట్టినా సరే, తప్పొప్పులు చెప్పి, చెయ్యిపట్టి, "మంచిదోవ ఇదీ" అని చూపించింది అమ్మ.
పెద్దలను ఎలా గౌరవించాలో, పిల్లలను ఎలా లాలించాలో, సాటివారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఆదర్శప్రాయమయింది...అమ్మ.
గిల్లికజ్జాలు పెట్టుకున్నా, పరుషమైన మాట నోటివెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచిమాట చెప్పింది అమ్మ.
ఎప్పుడూ కళకళలాడుతూ, నవ్వుతూ, అందరితో కలిసిపోతూ, భేషజం లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నాకు నేర్పింది మా అమ్మే.
అందరి ఆకలీ తీర్చితేకాని మా అమ్మ ముద్ద నోట పెట్టడం నేనెప్పుడూ చూడలేదు.
నాకు చాలా ఆశ్చర్యం వెసేది. చాదస్తంగా వాళ్ళ మాటే నెగ్గాలనుకుంటున్న మా నాయనమ్మ, తాతగార్లతో ఒకలా మాట్లాడేది.
"వదినా, అన్నయ్య ఇలా అంటే నేనింకీ ఇంట్లొ ఉండనంతే.." అనే బాబాయితో మరొకలా మాటలాడేది.
"వదినా, నేనింకా చిన్నపిల్లనా.." అని విసుక్కునే అత్తయ్యతో ఇంకోలా మాట్లాడేది.
"నాన్న నాకు బూట్లు కొనటం లే"దని ఫిర్యాదు చేసె అన్నయ్యతో ఒకలా మాట్లాడేది.
పట్టుపరికిణీ కోసం కొట్టుకునే మా అక్కచెల్లెళ్ళిద్దరి మధ్యా మరో రకంగా మాట్లాడి సామరస్యం కుదిర్చేది.
ఎవరితోనూ "నీది తప్పు, నువ్వలా మాట్లాడకూడదు" అని మా అమ్మ అనలేదు. ఎటువంటివాళ్ళు ఏ ఫిర్యాదుతో ఆమె దగ్గరికి వెళ్ళినా ముందు చెప్పే మాట "అవును, నువ్వు చెప్పింది నిజమే" అంటూ మొదలుపెట్టేది. మధ్యమధ్యలో తర్కాన్ని లేవనెత్తి, అంత కోపంతో వచ్చిన మనిషినీ, నాదస్వరం వూది బుట్టలో పడేసినట్టు, చివరికి ఆ వచ్చినవాళ్ళు "అలాగె నీ ఇష్టం" అంటూ తలవంచుకుని వెళ్ళేలా చేసేది .
పట్టుదలే ప్రాణంగా భావించే మా నాన్నగారితో కలిసి పైకి ఒక్కమాట వినపడకుండా యింట్లో జరపవలసిన కార్యాలూ, కథలూ, పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ, చదువులూ, ఉద్యోగాలూ అన్నీ స్వయంగా పూనుకుని చేయించేది.
అమ్మ దగ్గర వున్నన్నాళ్ళూ నాకు తెలీలేదు కాని పెళ్ళయ్యాక, అస్సలు పరిచయమే లేని కొత్త వ్యక్తుల మధ్య కొచ్చిపడ్డాక, బాధ్యతలంటూ మీద పడ్డాక, అప్పుడు అమ్మ ఈ పనులన్నీ అంత సామరస్యంగా ఎలా చేయగలిగిందా అని ఆలోచించడం మొదలుపెట్టాను.
పెద్దతరాన్ని గౌరవిస్తూనే, చిన్నతరం వాళ్ళ కోరికలు క్రమంలో పెడుతూ, తన తరం వాళ్ళని అనుకూలంగా మార్చుకోగల అమ్మని గురించి ఆలోచిస్తే---ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పబ్లిక్ రిలేషన్స్ అంటూ పనిచేసే పెద్దవాళ్ళు గుర్తుకొచ్చారు. నిజంగా ఆలోచిస్తే ఒక యింటిలో సభ్యులందరూ ఒకరిపై ఒకరు అభిమానం, ఆప్యాయత కలిగి సంతోషంగా వున్నారంటే, ఆ గొప్పతనమంతా ఆయింటి యిల్లాలిదే. యింట్లో ప్రశాంతంగా వుంటేనే కదా బైట పనులు సవ్యంగా జరిగేది. ఇంటింటి కొక పూవు ఈశ్వరుని కొక మాల అన్నట్టు ప్రతి యిల్లూ ఒత్తిడులు లేకుండా సంతోషంగా వుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుందన్న విషయం అందరికీ తెలిసినదే కదా.. దీనికంతకీ కారణం అమ్మ.
అందుకే నేను మరుజన్మంటూ వుంటే ఆడజన్మనే కోరుకుంటున్నా. అమ్మ అవడంలో వున్న ఆనందం, పిల్లలను పెంచుతున్నప్పుడు ప్రతి మలుపులోనూ కలిగే సంతోషం, వాళ్ళు ప్రయోజకులయ్యాక నలుగురూ వారిని పొగుడుతున్నప్పుడు కలిగే మమకారం కేవలం అమ్మ అయితేనే వుంటుంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ అమ్మనే అయి సమాజానికి మంచి పౌరులను అందిస్తాను..


##########################################################################

14 వ్యాఖ్యలు:

psmlakshmiblogspotcom said...

శభాష్ లలితా,
మీ అమ్మగారి ఔన్నత్యాన్ని మీరు బాధ్యతల్లో మీరు గుర్తించారు. ఎన్నటికీ గుర్తింపబడని అమ్మలు ఎందరో.
psmlakshmi

psmlakshmiblogspotcom said...

శభాష్ లలితా,
మీ అమ్మగారి ఔన్నత్యాన్ని మీరు బాధ్యతల్లో మీరు గుర్తించారు. ఎన్నటికీ గుర్తింపబడని అమ్మలు ఎందరో.
psmlakshmi

మాలా కుమార్ said...

ఇంటికి దీపం ఇల్లాల్లు అని అందుకే కదా పెద్దలన్నారు . బాగుంది . మీ కోరిక తీరాలని కోరుకుంటున్నాను .

పరిమళం said...

అమ్మాయిగా ...ఎంత గారాలుపోయినా అమ్మయ్యేసరికి ....మన అమ్మలాగే మారిపోతాం కదండీ ..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Friend said...

బాగుందండి.

జయ said...

అవునండి అమ్మ స్థానం ఎప్పుడూ గొప్పదే. అమ్మను మించిన దేవత లేదు. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

sreenika said...

ఎక్కడో చదివినట్టు గుర్తు..
80% power of Indian women is being underutilized in kitchen.
Of course changes are taking at a slow pace to empower her.
అమ్మ గురించి ఎవరు ఎంత చెప్పినా అది మధురంగానే ఉంటుంది. ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలి ఉంటుందంటే అది చెప్పేవారి లోపం కాదు. ఆమె ఔన్నత్యం అలాటిది.
మంచి కధనం. మహిళా బ్లాగర్ల కు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మధురవాణి said...

లలిత గారూ,
మొదటి పేరాలో ఆడజన్మ గురించి ఎంతందంగా చెప్పారండీ! అమ్మతనం లోని కమ్మదనం, ఇల్లాలే ఇంటికి దీపం అని చాలా హృద్యంగా చెప్పారు. నిజమే.! అమ్మ ఉండటం, అమ్మవడం కంటే అపురూపం ఏముంటుంది ఈ ప్రపంచంలో!?

రాధిక(నాని ) said...

లలిత గారూ, అమ్మ గురించి ఎంత చక్కగా రాసారండి .

శ్రీలలిత said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం లక్ష్మిగారూ,
ఇప్పటికీ ఎందరో అమ్మలకి అసలు గుర్తింపే లేదు..

శ్రీలలిత said...

మాలాగారూ, పరిమళగారూ, friend, జయగారూ
ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

శ్రీనికగారూ, మదురవాణిగారూ, రాధికగారూ
ధన్యవాదాలండీ..

Anonymous said...

శ్రీ లలిత గారూ , అమ్మగా సమాజానికి మంచి పౌరులను అందించాలనుకునే మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను.

సవ్వడి said...

మిమ్మల్ని అభినందిస్తున్నాను.