ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో మా స్నేహితురాళ్ళ మందరం కలిసి హైదరాబాదు శివార్లలో వున్న ఏదో ఒక దేవాలయానికి వనభోజనాల పేరుతో వెళ్ళివచ్చేవాళ్ళం. కాని ఈసారి కారణమేదైతేనేం వెళ్ళడానికి కుదర్లేదు. వనభోజనాలా మానుకోలేము. అందుకని ఉభతారకంగా ఒక పని చేసాం.
మా స్నేహితురాలి పెరట్లో ఉసిరిచెట్టుంది. ఇంకనేం అందరం కలిసి బహుళద్వాదశినాడు, అంటే నవంబరు, 22 మంగళవారం మధ్యాహ్నం పన్నెండయ్యేసరికల్లా వాళ్ళింట్లో జేరిపోయాం.
ఎవరికి వారు సంకల్పం చెప్పేసుకుని, చక్కగా తులసిచెట్టుకీ, ఉసిరిచెట్టుకీ పూజ చేసేసుకుని, నైవేద్యాలర్పించేసి, మంగళహారతి పాడేసుకున్నాం.(అదిప్పుడిక్కడ పాడనులెండి..ఖంగారుపడకండి..)
అందరం వంటింటి మహరాణులమేకదా. అందుకే తలొక వంటకం చేసుకుని తీసికెళ్ళాం. మొత్తం పదముగ్గురం చేరాం. ఒక్కొక్కరైతే మరీ వీర మహారాణులయిపోయి రెండేసీ, మూడేసీ అయిటమ్స్ తెచ్చేసేరు. మొత్తం అన్నీ కలిపి ఇరవైరకాలు తేలేయి.
తినడానికి మాత్రం పక్షపాతం లేకుండా అందరం వీరనారీమణులమే అయిపోయాం. సాయంత్రందాకా ఎంచక్కా తంబోలా లాంటివి ఆడుకుని, పోదామా.. ఇక పోదామా.. అందరం ఇళ్ళకు పోదామా.. అని పాడుకుంటూ (తప్పదుకదా మరి..) ఇళ్ళకు చేరాం.
అందుకని అందరికీ తెలియజేయునదేమనగా ఈ సంవత్సరం కూడా మేము మానకుండా వనభోజనాలు చేసుకున్నామహో.. అని...
(ఇంటావిడ లక్ష్మిగారి సౌజన్యంతో...)