Pages

Saturday, August 1, 2009

కేశవనామపూజకీర్తన

ఈమధ్య ఒక పెద్దావిడను కలుసుకున్నప్పుడు ఆవిడ కేశవ నామాలతో మనం నిత్యం పూజ చెసుకునే పధ్ధతిని పాటగా పాడడం విన్నాను. అంటే మనం రోజూ పూజ చెసుకుంటున్నప్పుడు భగవంతుడిని ధ్యాన, ఆవాహనాది షోడశోపచారాలతో పూజిస్తాంకదా.. దానిని కేశవ నామాలతో పాడారన్నమాట. దానిని అందరికీ అందించాలని ఇది రాస్తున్నాను. నేను విని రాయడంలొ పొరపాట్లు ఏమైనా వుంటే దయచేసి సరిచెయ్యగలరు.

కేశవనామపూజ కీర్తన(నిత్యపూజ)



పల్లవి// రాముని పూజింపరే-భద్రాద్రి శ్రీరాముని పూజింపరే

రాజీవదళముల కామితార్ధప్రదుడైన కౌసల్య తనయుని//రాముని//

1. కేశవమూర్తిని-క్లేశనరసింహ్వుని-శ్రీశుని మదియందుచేర్చి-ధ్యానించి//రాముని//

2. నారాయణుడౌ-తారకరాముని-నారదసన్నుతు నావాహనముచేసి//రాముని//

3.మాధవమూర్తి-మంగళాకారుడౌ-ఆదిదేవున కర్ఘ్యపాద్యాచమనములా//రాముని//

4. గోవిందమూర్తియౌ-గోపరిపాలునికి-భావములరవేడ్క పంచామృతస్నానమున//రాముని//

5. విష్ణుస్వరూపునకు-విజ్ఞానమూర్తి ప్రభ-విష్ణుశ్రీరామునకు-విశుధ్ధోదకస్నానముచే//రాముని//

6. మధుసూదనుండౌ-మహనీయతేజునకు-ముదమున తడియొత్తి-అగరుధూపమువేసి//రాముని//

7.త్రివిక్రము-శ్రీరాము-దేవాదిదేవునకు-భువనసుందరునకు-సువర్ణ వస్త్రంబిడి//రాముని//

8.వామనుడౌ-హరికి-యజ్ఞోపవీతమొసగి-కామజనకునకు-గంధాక్షతిలిడి//రాముని//

9.శ్రీధరమూర్తియౌ-శ్రీరామచంద్రునకు-మోదముతో మంచి మొల్లలు మల్లెలు//రాముని//

10.హృషీకేశు-సాధుహృదయనివాసుని-భాసిల్లు మందార-పారిజాతంబుల//రాముని//

11.పద్మనాభమూర్తి-పరంధామునకు-సహస్రపద్మములచేత-పరమానందముమీర//రాముని//

12.దామోదరుండైన-దశరధశ్రీ-స్వామికి సంపెంగి, జాజి, విరజాజుల//రాముని//

13. సంకర్షణమూర్తియౌ-సర్వాంతర్యామికి-ప్రాకటముగ ధూప దీపములర్పించి//రాముని//

14.వాసుదేవు-పరమేశు-శ్రీరాముని భాసురంబుగ మంచి భక్షభోజ్యంబుల//రాముని//

15.ప్రద్యుమ్నమూర్తియౌ-పరమోత్తరామునకు హృద్యముగ కర్పూర విడెము సమర్పించి//రాముని//

16.అనిరుధ్ధమూర్తికి-వనజదళాక్షునకు-ఘనముగ పచ్చకర్పూరహారతులిచ్చి//రాముని//

17.పురుషోత్తముండైన పుండరీకాక్షునకు కరుణసాగరునకు కర్పూర నీరాంజనాచమున//రాముని//

18. అధోక్షజుండైన-ఆనందరామునకు-మదిని పొంగుచు వేగ మంత్రపుష్పంబుడి//రాముని//

19.నారసింహుడైన శ్రీరామమూర్తికి-సారెకు ప్రదక్షిణ నమస్కారములుచేసి//రాముని//

20.అచ్యుతమూర్తియౌ-హరిశ్రీరామునకు-హెచ్చుగ చామరాలే వీవ నిజభక్తులు//రాముని//

21.జనార్ధనమూర్తి-శ్రీజానకీపతిచెంత- గానంబుసేయగా-గంధర్వ కిన్నెరులు//రాముని//

22.ఉపేంద్రమూర్తియౌ-శ్రీపతి శ్రీరామ-భూపాలచంద్రుపై పన్నీరు చల్లుచు//రాముని//

23.హరి-శ్రీరామయని-ఆనందమగ్నులై-సురలు సుమవృష్టిని-సొంపుగ కురియింప//రాముని//

24.శ్రీకృష్ణ యని-బుధులు చేరి-నృత్యము చేయ-కౌకుత్సతిలకుడౌ ఘనుడు-సీతా సహితు//రాముని//

25.భూమిజతోగూడి-పూర్ణేందువదనుడు-రామపుత్ర హృదయధామమున రంజిల్లు//రాముని//



--------------------------------------------------------------------------------

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ said...

ఇది భలే బాగుంది

durgeswara said...

అమ్మా
నమస్కారములు . మీలాంటి పెద్దవారు ఇలా చక్కగా మనధర్మం లోని విషయాలను చక్కగావివరించటం చాలాసంతోషంగావున్నది . మీతో మాట్లాడాలి దయచేసి మీ mail aDress ivaagalaru

naa mail

durgeswara@gmail.com