Pages

Tuesday, October 27, 2009

వనభోజనాలు (కాదుటండోయ్)








ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా కార్తీక వనభోజనాలకి వెళ్ళాలని మా స్నేహితురాళ్ళం నిశ్చయించేసుకున్నాం. ఇక మొదలు---

ఎక్కడికి వెళ్ళాలి..ఎప్పుడు వెళ్ళాలి..ఎలా వెళ్ళాలి అని ప్రశ్నలు, చర్చలు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అక్కడే వంటలు చేసుకోవాలని కొందరంటే కాదు తీసికెడదాం లేదా కేటరింగు కిద్దాం అని మరి కొందరు.

.ఒకరి డైలాగ్, ”అయినా రోజూ వండేదే కదా, ఈరోజైనా బైట తిందాం.”.

మరొకరి డైలాగ్.”మనం బైట తింటాం సరే..మరి ఇంట్లో మగవారికోసం ఎలాగూ వండాలి కదా”

..”మా ఆయనతో ఫర్వాలేదు. బైట తినేస్తారు ఒక పూటకి..” అని ఒకావిడ గర్వంగా చెపితే,

”మా ఆయన అస్సలు బైట తినరు. అన్నీ వండి టేబిల్ మీద పెట్టి రావల్సిందే..”అని మరొకావిడ గారంగా విసుక్కుంది.

”అసలు వంటిల్లు తాళం పెట్టేసి తాళంచెవి పడేసుకుంటే కాని మనకి సుఖ ముండదు.”ఒకావిడ విప్లవాత్మకంగా ప్రకటించింది.

అది రామలక్ష్మీఆరుద్రగారి కొటేషనేమో..” తప్పులు పట్టుకునే ఆవిడ వెంటనే పట్టుకుంది.

”ఎవరి దయితేనేం.. మనకి పనికొస్తే వాడేసుకోడమే.. కనీసం తాళం చెవి దొరికే వరకూ మనకి రెస్టు..”

”మా ఆయన అయితే తాళంచెవి కొసం వెతికి టైము వేస్టు చెయ్యడు. తాళం పగలగొట్టేస్తాడు..”ఇంకో ఆవిడ వాపోయింది.

”అబ్బబ్బ.. అసలు సంగతి వదిలి ఆయన్ల గురించి మాట్లాడతారేం.. ఇప్పుడెక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తేల్చండి..”పెద్దరికం ఆపాదించుకుని కాస్త గట్టిగా మాట్లాడి అందరినీ దారిలొకి తెచ్చింది ఇంకో ఆవిడ.

ఆఖరికి అందరం తలో అయిటమూ చేసి తీసికెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఒకళ్ళు పొద్దున బ్రేక్ ఫాస్ట్ లాగ, మరొకరు లంచ్ లోకి స్వీటు, ఇంకోరు హాటు, మరొకరు బిసిబెళబాతు, ఇంకొకామె పులిహార, మరొకామె దధ్ధోజనం, ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ కొందరూ ఇలా పదిమందీ పది రకాలూ చేసి తెచ్చేసుకోవాలని తేల్చేసుకున్నాం..(ఆహా..ఆడజన్మ ఎంత గొప్పదో కదా.. వంటింటి మహారాణులం. ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేసుకోవచ్చు..తినడం మాట దేముడెరుగు..)

తీరా ఎక్కడి కెళ్ళాలో తేల్చుకోడంలో అందరూ అన్ని చోట్లకీ వెళ్ళొచ్చేసిన వారే కనక అంత తొందరగా నిర్ణయించుకోలేకపోయాం. ఆఖరికి తక్కువమంది చూసినదీ, ఎక్కువమంది చూడనిదీ అయిన సురేంద్రపురి (కుందా సత్యనారాయణగారి కళాధామం) కి సెటిల్ అయిపోయాం. మళ్ళీ చర్చలు. అక్కడ లోపలికి తినే పదార్ధాలు తీసికెళ్ళనివ్వరనీ, బైట తినడానికి అంత వెసులుబాటుగా ఉండదనీ తెలిసి ఏం చెయ్యాలా అని చించి చించి అలోచించి ఆఖరికి స్కూలుపిల్లల్లాగ ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకోవాలనుకున్నాం. ఇంటి దగ్గర కష్టపడి స్పెషల్స్ చెయ్యక్కర్లేదు. నాకు హమ్మయ్య అనిపించింది. (నాకు వంట అంటే కొంచెం బధ్ధకమే అందుకన్నమాట.)

ఒక వేన్ మాట్లాడుకుని సరిగ్గా పొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరదామనుకున్నవాళ్ళం అనుకున్నట్టే తొమ్మిదిన్నరకి ”జై భజరంగభళీ” అనుకుంటూ బయల్దేరాం.

గంటన్నర ప్రయాణించి అడంగు చేరాక గేటు దగ్గర తెలిసింది అక్కడ ఏదో బ్రిడ్జి కడుతున్నారనీ, వాహనాలన్నీ యాదగిరిగుట్టదాకా వెళ్ళి రావాలనీ.. మళ్ళి అంతదూరం వెళ్ళేక కళాధామం చేరేసరికి పదకొండు అవనే అయింది. పొద్దున్నే ఆదరా బాదరాగా ఇళ్ళల్లోంచి బయట పడ్డామేమో వేన్ ఆగగానే అక్కడే ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు విప్పేసాం.

ఇంక మొదలు. నువ్వేం తెచ్చేవంటే నువ్వేం తెచ్చేవంటూ చూసుకుని, ఒకరి దొకరు పంచుకుని, ఇదెలా చేసేరంటే, అదెలా చేసేరంటూ రెసిపీలు చెప్పేసుకుని, (రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు), అందరం బాక్స్ లు ఖాళీ చెసెసాం. బిస్కట్ పేకట్లు, మంచినీళ్ళబాటిల్స్ తీసుకుని మేం కళాధామంలో అడుగు పెట్టేటప్పటికి సరిగ్గా పన్నెండు అయింది.

అబ్బ.. ఎంత బాగున్నాయో అన్ని బొమ్మలూ. బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం, గీతాప్రవచనం, క్షీరసాగరమథనం, కాళీయమర్దనం, ఇలాంటివి ఎన్నెన్ని పురాణగాథలో.. ఒకరికొకరం తెలీనివి చెప్పుకుంటూ, రామాయణం, భారతం, గిరిజాకల్యాణం లాంటి వెన్నో చూసుకుంటు వెడుతున్నాం.

ఎవరో అబ్బాయి. పాతికేళ్ళుండొచ్చు. ఒక బొమ్మ చూసి మమ్మల్ని వివరం అడిగాడు. అశోకవనం లో సీతాదేవితో రావణుడు మాట్లాడుతున్నప్పుడు చేతిలో గరికపోచ పట్టుకునుండడం చూసి ఏదో పెద్దవాళ్ళం, మాకు తెలుస్తుందని అలా ఎందుకు పట్టుకుందని అడిగాడు. అంతే..పాపం .మాకు బలయిపోయాడు. మేమందరం పొటాపోటీలుగా మాకు తెలిసిన పురాణకథలన్నీ చెప్పేసి, సీతాదేవి మహా పతివ్రత అనీ, రావణబ్రహ్మ అంతటి వాడిని గడ్డిపరకగా తీసి పడేసిందనీ, ఆ గరిక పోచని ఒక మీడియేటర్ లా వాడుకుందనీ ఇలా ఎన్నో చెప్పేసాం. పాపం ఆ అబ్బాయి మాకు మళ్ళీ కనపడలేదనుకోండి.

ఇలాగ మన పవిత్ర గాథలన్నీ చూసుకుంటూ, మధ్య మధ్యలో కూర్చుంటు , చివరికి కేంటీన్ దగ్గర అరగంట సెటిల్ అయిపోయి, మళ్ళీ ఆత్మారాముణ్ణీ తృప్తి పరిచి, పద్మవ్యూహం నుంచి బైట పడేటప్పటికి సాయంత్రం నాలుగయ్యింది. పక్కనే ఉన్న పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించుకుని, తిరుగుప్రయాణం అయ్యేటప్పటికి అయిదు. ఇంటికి చెరేటప్పటికి ఆరున్నర. హమ్మయ్య. ఎంచక్కా వెళ్ళొచ్చాం అనుకుంటుండగానే మళ్ళీ చర్చలు.

ఇదసలు కార్తీకమాస వనభోజనాల లెక్క లొకె రాదనీ, కేవలం విహారయాత్రగానే అనుకోవాలనీ, ఎక్కడా ఉసిరిచెట్టుక్రింద భోజనం చెయ్యలేదు కనక మళ్ళీ మరోచోటికి ప్రోగ్రామ్ వెయ్యాలనీ అందరూ భావించారు. అందుకని మాకు మళ్ళీ వనభోజనాల ప్రోగ్రామ్ ఉంది కనక ఎవరైనా వచ్చేవాళ్ళుంటే చేతులెత్తొచ్చు...








12 వ్యాఖ్యలు:

Ram Krish Reddy Kotla said...

నేను ఆల్రెడీ రెండు చేతులు ఎత్తేసానండి... :) చాలా బాగుంది ..వన భోజనాలు కాని విహార యాత్ర :)

కొత్త పాళీ said...

బాగుంది మీ కళాభోజనం. ఇంతకీ ఈ కళాధామం ఎక్కడుంది?

భావన said...

నే రాను బాబోయ్ నాకు వంటసలే బద్దకం, ఇంతకు ఈ కళా ధామమెక్కడండి? బాగుంది మీ విహార యాత్ర.

శ్రీలలిత said...

http://anu-parimalam.blogspot.com/2009/05/blog-post.html
ఈ పైనున్న పరిమళగారి బ్లాగ్ లో కళాధామం విశేషాలున్నాయి.
తప్పక చూడవలసిన ప్రదేశం. ఈ మధ్య బాగా అభివృధ్ధి వేసారు. ఇంకా చెయ్యవలసింది ఉంది. అయినా బాగుంది.

Anonymous said...

సర్లెండి , మేం రావటానికి అసలు అక్కడ వనాలెక్కడున్నయ్....మీరే ఇటొచ్చేసారంటే , శుభ్రంగా మా తోటలో భోజనాలు పెట్టేసుకుందాం. చక్కగా ఉసిరిచెట్టుకూడావుంది. ఇంకా బోలెడన్ని వానరాలుకూడా ఉంటాయి. ఒకపక్కనించి మనం వండుకున్నవి అవి ఎత్తుకెళ్ళిపోతుంటే , మనం వాటి వెనకాలే పరిగెడుతుంటే ...భలే సందడిగా ఉంటుంది.అపుడేకదా వనభోజనాల అనుభూతి కలిగేది. ఏవంటారు!

మాలా కుమార్ said...

బాగుందండి , మీ వన విహారయాత్ర.

శ్రీలలిత said...

లలితగారూ,
మనం వానరులకి వారసులమే కదండీ..ఏం చేస్తాం..
ఇక్కడ మాకూ వనాలున్నాయండోయ్. ఒక యాభై రూపాయలిస్తే ఒక ఉసిరికాయున్న ఉసిరికొమ్మ దొరుకుతుంది. అదే పేద్ద చెట్టనుకుని దాని దగ్గర దీపం పెట్టేసి వనభోజనాలు కానిచ్చేస్తాం. ఎలా ఉంది అవిడియా.. ఒక జీవితాన్నే మార్చేయలేదూ..

శ్రీలలిత said...

మాలగారూ, మరి చేతులెత్తలేదేం...

జయ said...

శ్రీ లలిత గారూ, నన్నూ తీసుకెళ్ళరూ ప్లీజ్.

కార్తీక్ said...

బాగుందండి మీ విహారయత్ర.......
నేను చేతులెత్తెసే వణ్ణె కానీ నేను ఒకసారి వెల్లొచ్చెసా మళ్ళి అంటె నా వల్ల కాదు బాబొయ్ మీరు ఆ వన బొజనాల చరిత్రంతా ఒకళ్ళ తర్వాత మొరొకరు నాకు చెప్పేస్తె ఇంక ఎమన్న ఉందా నా పనైపొదూ.....

www.tholiadugu.blogspot.com

సుభద్ర said...

నేను చెయ్యి ఎత్తాను..కనిపిస్తు౦దా???సరే నాకు ఇచ్చే డిష్ ము౦దుగా చెప్ప౦డి!!ఏ డిష్ కి అయినా నేను రడీ..ప్లేస్ కూడా చెప్ప౦డి.భావన డిష్ కూడా నాకే ఇచ్చేయ౦డి.సరేనా!!
@భావన ఇక మీరు వస్తారుగా

భావన said...

అబ్బ మా సుభద్ర ఎంత మంచిదో.. ఎంతైనా కృష్ణుడి సోదరి కదా .. ఇంటి పేరు ప్రేమ వారు గోత్రమేమో అనురాగం వూరిపేరు రేపల్లె ఇంటి ముందే పొదరిల్లు..
నేను వస్తాను వంట లేక పోతే.. లలితా నన్ను కూడా లెక్క లో వేసుకోండి.. వచ్చి తిని పెడతాను, కబుర్లు చెప్పి పెడతాను.