Pages

Thursday, November 5, 2009

స్వీటూ---హాటూ

వనభోజనాల సమయానికి నాకు రావడం కుదరలేదు. మన్నించాలి. అంతా సద్దుమణిగాక ఇప్పుడు వంటల గొడవలెందుకు అనుకోకండి. మనకి మూడుపూటలూ అన్ని రకాల రుచులూ కావాలి కదా. అందుకే నా పాక శాస్త్ర నైపుణ్యం కూడా మీకు చూపిద్దామని ఈ ధైర్యం చేస్తున్నాను. ఆ సందర్భంలో కాస్త దవడ ఆడింపుకి అంటే స్వీట్ హోమ్ లో విమల అన్నట్లు ఇంట్లో తింటే వీధిలోకి వినపడే స్వీటు, హాటు ఎలా చెయ్యాలో మీకు చెప్పదల్చుకున్నాను. అలాగని ఇవేమీ అషా మాషీ వనుకోకండి. ఈ స్వీటు, హాటు రెండూ కూడా బాంబినో కంపెనీ వారు నిర్వహించిన వంటల పోటీలలో నాకు ప్రథమ బహుమతులను తెచ్చిపెట్టాయి. హహహహ్.. ఇక మొదలెట్టండి మరి..

బాంబినో గవ్వలు


కావల్సిన పదార్ధాలు:
బాంబినో సేమ్యా పేకట్- - ఒకటి
పంచదార-------------పావు కిలో
గోధుమ పిండి-----వంద గ్రాములు
ఏలకుపొడి-------ఒక టీ స్పూను
నూనె----వేయించడానికి సరిపడినంత

చేసే విధానం—
ముందుగా సేమ్యాని మిక్సీలో వేసి రవ్వలాగ పొడి చేసుకోవాలి. అందులో గోధుమపిండి వేసి నీళ్ళు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఆ పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గవ్వలపీట సహాయంతో గవ్వలుగా తయారుచేసుకోవాలి. ఈ మధ్య కొంతమంది ఇళ్ళల్లో ఈ గవ్వల పీటలు ఉండడంలేదు. ఖంగారు పడకండి. దానికో ఉపాయం ఉంది. ఫోర్క్ ఉంటుంది కదా.. దాని సహాయంతో కూడా గవ్వలు చేసుకోవచ్చు. అలాగ తయారుచేసుకున్న గవ్వలని నూనెలో దోరగా వేయించుకోవాలి.
పంచదార లో తడిసేదాకా నీళ్ళు పోసుకుని బాగా ముదరపాకం పట్టుకోవాలి. అందులో ఏలకుపొడి వేసుకున్నాక ఈ వేయించి పెట్టుకున్న గవ్వలను
అందులో వేసి, స్టౌ మీంచి దించేసి బాగా కిందా మీదా కలిపేసుకోవాలి. అప్పుడు పంచదారంతా గవ్వల చుట్టూ పట్టుకుంటుంది. ఇంకేముంది..తినెయ్యడమే..(ఆగండాగండి.. కాస్త చల్లారనివ్వండి మరి)
ఈ లోగా మనం హాటు చేసేసుకుందాం....


మాకరోని మిక్చర్


కావలసిన పదార్ధాలు----
మాకరోని పేకట్--ఒకటి
పల్లీలు(వేరుసెనగపప్పులు)--వంద గ్రాములు
పొట్నాల పప్పు(గుల్ల సెనగపప్పు)--వంద గ్రాములు
చిన్న చిన్న బేకరీ బిస్కట్లు(జీడిపప్పు ఆకారంలో ఉంటాయి)(కావాలంటే వేసుకోవచ్చు)
కరివేపాకు--రెండు కట్టలు
ఉప్పు---తగినంత
ఎండు మిరపకాయల కారం పొడి ---తినగలిగినంత
జీలకర్రపొడి---ఒక టీ స్పూన్
నూనె--వేయించడానికి సరిపోయేంత.
చేసే విధానం--
మాకరోనీ, పల్లీలు, కరివేపాకు ఆకుదూసి, అన్నీ విడివిడిగా వేయించుకోవాలి.
ఒక బౌల్ లో వేయించుకున్న వాటితోపాటు పొట్నాలపప్పు, ఉప్పు, కారం, జీలకర్రపొడి అన్నీ బాగా కలుపుకోవాలి. అంతే..ఎంతో రుచికరమైన బాంబినో మిక్చర్ రెడీ..

ఇక కానివ్వండి మరి....


##################################################

18 వ్యాఖ్యలు:

సుభద్ర said...

లలితాగారు,
మీ వ౦టలు అ౦తా టేస్ట్ చూస్తారు..ఆ రోజు ఇక మా వల్ల కాదు అన్నారు...అ౦తా ఒకసారే అయితే ఎలా అన్నారు.

Rani said...

లలితగారు, మాకరొనీ డీప్ ఫ్రై చెయ్యాలా? గట్టిగా ఉంటుందిగా, మామూలు పాస్టా కోసమైతే ఉడికిస్తాము కదా.

వంటల పోటీ లొ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు అభినందనలు :)

శ్రీలలిత said...

సుభద్రగారూ,
అందరితో కలిసి నడిస్తే అదో అందం.
ఒక్కరూ ఏదైనా చూపిస్తే అది మరో చందం.
ఏదైనా బాగుందనుకోవడమే మనందరికందం.

శ్రీలలిత said...

రాణీగారూ, ధన్యవాదాలు,
అవునండీ, మాకరోనీ ని ఉడకబెట్టకుండానే డీప్ ఫ్రై చెయ్యాలి. గట్టిగా ఉండదు. మన కారప్పూస, జంతికల్లా ఉంటుంది.

తృష్ణ said...

బాగుందండీ వెరైటీ...

కొత్త పాళీ said...

ఈ మేకరోనీ మిక్చర్ సంగతేదో బావుందే. ట్రైచేస్తా.
మనలో మాట .. మేకరోనీ మిక్చరు తింటే మేకరేనా డేన్సు చెయ్యడం వస్తుందా?? :)

శ్రీలలిత said...

కొత్తపాళీగారూ,
మనలో అసలు మాట. నాకు మిక్చర్ సంగతి తెలుసు తప్పితే మేకరేనా డేన్స్ సంగతి తెలీదండీ. మీరు ప్రయోగం చేసి ఫలితం చెపితే ఆచరిస్తాం.

శ్రీలలిత said...

కొత్తపాళీగారూ,
మనలో అసలు మాట. నాకు మిక్చర్ సంగతి తెలుసు తప్పితే మేకరేనా డేన్స్ సంగతి తెలీదండీ. మీరు ప్రయోగం చేసి ఫలితం చెపితే ఆచరిస్తాం.

జ్యోతి said...

లలితగారు,

వనభోజనాలవల్ల అందరికి భుక్తాయాసమైంది.చేసినవాళ్లు కూడా అలిసిపోయారు. కాస్త గ్యాప్ ఇచ్చి మీరు అందించిన
స్వీటు,హాటు బావున్నాయి. కాని...ఈ రెండింటిలో రెండు మార్పులు చేసుకున్నా బావుంటుంది కదా.గవ్వలకు గోధుమపిండి బదులు మైదాపిండి వాడుకుంటే. మిక్చర్ లో కార్నఫ్లేక్స్ , వేరుశనగగుళ్లు కూడా వేయించి కలిపితే ఎలా ఉంటుందంటారు. నేను ఇలా చేసేయాలని డిసైడ్ ఐపోయానన్నమాట. చేసాక షడ్రుచులులో ప్రత్యక్షం అవుతాయి..

శ్రీలలిత said...

జ్యోతీగారూ, మీ డెసిషన్ బాగుంది. గోధుమపిండి బదులు మైదా వాడడం బాగానే ఉంటుంది. ఇం కొంచెం క్రిస్పీగా వస్తాయి.
మిక్చర్ లో పల్లీలు వెయ్యాలని చెప్పాననుకుంటానుకదండీ. కార్న్ ఫ్లేక్స్ కూడా వెయ్యొచ్చుకానీ, అది మరీ కార్న్ మిక్చర్ అయిపోతుందేమోనని మానేసా. అందులోనూ నేను బాంబినో వాళ్ళ వంటలపోటీకి చేసాను కదా. వాళ్ళ ప్రోడక్ట్ మైన్ గా కనిపించాలికదా. అందుకని అలా చేసానన్నమాట. వంట దేముందండీ.. మన చేతిలో పని. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. దేనికదే కొత్తది. ఎంతైనా మీ షడ్రుచులులో చోటు చెసుకునే వంట గొప్పగానే ఉంటుంది లెండి.

భావన said...

లలిత: నాకు ఇప్పుడు బాంబినో చేసేంత సీన్ లేదు కాని ఈ మిక్స్చర్ ఏదో బాగుంది ప్రయత్నించి చూస్తాను. థ్యాంక్స్ అండి.
@ కొత్త పాళి గారు: మాకరోని కొంచం ఎక్కువ వేయించి నమలటానికి ప్రయత్నిస్తే సరి అదే వస్తుంది మేకరోని డేన్స్ ఏమంటారు..

శ్రీలలిత said...

భావనా, తప్పకుండా ప్రయత్నించు. బాగుంటుంది. కాని కాస్త ఎక్కువ వేయిస్తే డేన్స్ మాట దేవుడెరుగు...ముందు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళవలసొస్తుందేమో..జాగ్రత్త...

నేస్తం said...

లలిత గారు భలే వంటలు చెప్పారు.. బాగున్నాయి

జ్యోతి said...

కొత్తపాళీగారు,

మాకరోని తింటే మేకరేనా డాన్స్ రావడం సంగతేమోగాని. మేము తలుచుకుంటే, గట్టిగా మనసు పెడితే .. ఏదైనా చేసిపెడితే తప్పక లిస్టులో లేని డాన్సులు చేయక తప్పదండి. నేను వంట చెడగొడితేగాని మావారు వంటింట్లోకి కాలెట్టలేదా?? అలాగే ...:)

జయ said...

ఆలస్యంగానే మీ వంటలు బాగున్నాయి లలితగారు. అన్నీ తినేసి అరిగిపోయాక..ఆకలిమీద...ఈ కొత్త వంటకాలు మజా నిస్తున్నాయి.చూస్తుంటేనే కడుపునిండి పోతోంది.

కార్తీక్ said...

abba meeru vantalu baaga chestharanukuntaane :)


www.thliadugu.blogspot.com

మాలా కుమార్ said...

వంటలు వెరైటీ గా బాగున్నాయండి .
వంటల పోటీ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు అభినందనలు .

వేణూశ్రీకాంత్ said...

వంటల పోటీలో గెలుపొందినందుకు అభినందనలు లలిత గారు. గవ్వలు సేమ్యా తో చేయడం భలే ఐడియా, అలానే మెకరోనీ పాస్తాని డైరెక్ట్ గా వేయించడం కూడా. మీ వంటలు రెండూ వెరైటీ గా బాగున్నాయి.