
సర్వాంతర్యామి అయిన ఓ జగన్నాధా..
ఈ సృష్టిలో నీవు లేని చోటు కలదా ప్రభూ...

పెరిగే ప్రతి మొక్కలో ఒరిగే ప్రతి కొమ్మలో
వూగేటి రెమ్మలో తొడిగేటి మొగ్గలో
విరిసిన ప్రతి పూవులో అలదిన ఆ తావిలో
నీవే కద నా కన్నుల వెన్నెలవై నిలిచేది
నీవే కద నా మనసును పరవశింపచేసేది…

జిలిబిలి ఆ జాబిల్లి జలతారు చారలో
ఒదిగొదిగే పూమొగ్గల మొగమాటపు ముడిలో
వర్షపు తుంపర జారిన ఆకుల తడి మడతలో
ఎటుచూసిన అటు నీవే అనిపించే మనసులో...

చిగురాకుల మోగేటి చిరుగాలుల పిలుపులో
తీయని తేనెలు ధారగ ఒలికేటి పూలలో
జారిన చినుకుల మ్రోగిన చిరు మువ్వల సడిలో
అదిగదిగో అదె నీ అడుగుల సడి కాదా..

తరియించెద నీ పూజకు పూదండను నేనై
తరియించెద నీ యెడదను చందనపు పూతనై
తరియించెద నీ చూపుల నిండుగ నే కరుణనై
తరియించెద తరియించెద నీ పదముల ధూళినై...

సర్వాంతర్యామి అయిన ఓ జగన్నాధా..
ఈ సృష్టిలో నీవు లేని చోటు కలదా ప్రభూ...