
నీ ఊహా ప్రపంచంలో
చెయితిరగని కంచంలో
ఎందుకోయ్ పెట్టుకున్నావ్ అన్నం కొంచెం..?
పెట్టుకోవోయ్ పెద్ద బంగారు కంచం
ఒంచుకోవోయ్ పాయసం నిండుగా కంచం...!
(ఇది మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు ఊహాప్రపంచం గురించి వ్రాసుకున్న కవితలో చిన్న భాగం. మన ఊహ మన చిత్తం వచ్చినట్టు ఎంతగా ఎల్లలు దాటి ఊహించుకోవచ్చోనని ఆయన చెప్పిన విషయాన్ని తెలియచెప్పడానికి ఇది ఇక్కడ పెట్టాను.)
మనం పుస్తకాలు ఎందుకు చదవాలంటే...
మనిషికి ఊహలో ఊహించుకున్నంత ఆనందం నిజజీవితంలో కనిపించదు.
నిజం కంటే ఊహ అందంగా వుంటుంది కనకే మనిషి తను చెయ్యలేని పనినీ, తన కళ్ళకు కనిపించలేని అందాల్నీ ఊహలో వెతుక్కుంటాడు.
ఒక సినిమా చూస్తున్నప్పుడు కానీ, టీవీ చూస్తున్నప్పుడు కానీ కథలోని పాత్రలు కళ్ళముందు కనపడతాయి. అవి నిర్మాతా, దర్శకుల దృష్టిలో సృష్టించుకున్న పాత్రలు, సంఘటనలు. వాటిని వారి దృష్టితోనే మనమూ చూస్తున్నాం. ఒక్కరి అభిరుచి అవి చూస్తున్నవారందరిమీదా రుద్దబడుతోంది.
అదే మనం ఒక పుస్తకం చదువుకుంటుంటే జరిగే పరిస్థితి వేరు. పుస్తకంలో కవిగాని, రచయితగాని రాసినదానిని చదువుతున్నప్పుడు మనం దానిని మన అభిరుచికి అనుగుణంగా ఆ సుందరదృశ్యవర్ణనను కానీ, ఆ పాత్ర మనసులోని భావాలనుగానీ, ఆ పాత్ర ప్రవర్తించిన తీరునిగానీ, ఆ పాత్రయొక్క అందం, ఆహార్యంగానీ ఊహించుకుంటాం. అది మన మనసుకి చాలా ఆనందం కలగజేస్తుంది. అందుకే పుస్తకపఠనంలో అంత ఆనందం వుంది.
ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు మనం అందులో లీనమైపోతాం. ఆ పుస్తకంలోని కథతో పాటుగా ప్రయాణం చేస్తాం. కథ సుఖాంతమైతే ఆనందిస్తాం. దుఃఖాంతమైతే బాధపడతాం. మన మనసుల్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న పుస్తకపఠనాన్ని మనకు సాధ్యమైనంతవరకు ప్రోత్సహిద్దాం. మన పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేద్దాం. ఎంతో గొప్ప కవులని, రచయితలని వాళ్ళకి పరిచయం చేద్దాం. పుస్తకపఠనంలోని ఆనందాన్ని వాళ్ళకీ రుచి చూపిద్దాం.
ఏప్రిల్ 23 జాతీయ పుస్తకదినం సందర్భంగా...
(చిత్రం...గూగులమ్మ సౌజన్యంతో...)