
అందరు తండ్రులకూ వారి అమ్మాయిలు బంగారుతల్లులే...
అందరు అమ్మాయిలకూ వారి నాన్నలు కల్పవృక్షాలే...
కావచ్చు... కాదనను... కాని...
మా నాన్నగారికి మేము ఆడపిల్లలం నలుగురం కూడా
పుటం పెట్టిన ఇరవైనాలుగు కేరట్ల బంగారులం...
అలాగే మా నాన్నగారు మాకు కల్పవృక్షం, కామధేనువు...ఇంకా ఎన్నో...
ఎంత పాండిత్యముందో అంత వినయంగానూ వుండేవారు
ఎదుటివారి వయసెంతయినా సరే ఎంతో గౌరవమిచ్చి మాట్లాడేవారు
ఆయన మాకు అందించిన నిధి సామాన్యమయిందికాదు..
ఆయన గురించి ఏ ఒక్కటని చెప్పను..
ఎక్కడ మొదలుపెట్టడం..?
ఎక్కడ చూసినా ఆయన చెప్పిన మాటే..
ఆయన మాకు చెప్పని విషయం అంటూ లేదు.
పద్యాలలో పొదిగిన అందాల్ని ఆస్వాదించి ఆనందించడం ఆయనే మాకు నేర్పారు.
ఆశువుగా పద్యాలు చెప్పేవారు. సమస్యాపూరణలు, దత్తపదులూ అలవోకగా చెప్పేవారు.
మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు కీర్తిశేషులయి ఈనాటికి సరిగ్గా సంవత్సరం అయింది.
ఈ రోజున ఆయన స్మృతులకు ప్రణతులర్పిస్తూ, వారు వ్రాసిన రెండు దత్తపదులను ఇక్కడ వుంచుతున్నాను.
ఇచ్చిన పదము..."సారము" అనే పదము నాల్గుపాదాలలో ఉపయోగించి ఒక వృత్తపద్యము.
సారము లేని భూమియును, సారస లోచన లేని వాని సం
సారము, యోగ విద్య తగు సాధన లేనిది, నీరు లేని కా
సారము, యోగ్యమైన దగు సంతతి కల్గని జీవితమ్ము, ని
స్సారములంచు పల్కెదరు సారెకు సారెకు విఙ్ఞులందఱున్.
"పాక, పీక, పేక, పోక.." ఈ నాల్గు పదాలు ఉపయోగించి రామాయణార్ధంలో ఒక వృత్త పద్యము.
పాకలు కావు కాలినవి, బంగరు మిద్దెలె మండిపోయె, మా
పీకల మీదకే ప్రభువు పెట్టెను, అతని దుష్టమౌ తలం
పేకద తెచ్చిపెట్టినది భీకరమైన విపత్తు, రాజుకీ
పోకడ లేమిటో యనుచు భోరున నేడ్చిరి లంకలో ప్రజల్.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
9 వ్యాఖ్యలు:
బాగుందండి. పుఠంపెట్టిన బంగారులం అని ధీమాగా చెప్పుకోవడం ఇంకా నచ్చింది. ఇప్పుడే గతంలో మీరు రాసిన కవితలు కూడా చదివాను. బాగున్నాయి.
శుభాభినందనలు.
బావుందండీ. బాగా రాసారు.
మీ నాన్నగారి గురించి మంచి విషయాలు రాసారండి .
happy fathers day .
తేజస్విగారూ,
కవితలు నచ్చినందుకు ధన్యవాదాలండీ.
"పుటం పెట్టిన బంగారులం" అన్నమాట మా నాన్నగారు అన్నదేనండీ. ఆయనకి కూతుళ్ళంటే వున్న వాత్సల్యం ఆయనచేత ఆమాట అనిపించిందనుకుంటాను.
తృష్ణగారూ,
ధన్యవాదాలండీ.
మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలండీ.
నిజంగా మీ నాన్న గారు అదృష్టవంతులు.
డాడీ ఈజ్ గ్రేట్
చాలామంది ఆడపిల్లలకు నాన్న అంటే పిసరంత ఎక్కువ ఇష్టం ఉంటుంది.చాలా బాగారాసారు :)
GOOD ONE
Post a Comment