Pages

Monday, September 26, 2011

“ హు….”





“ హు….”

"హు.. మన దేశం ఇంకా ఎప్పటికి అభివృధ్ధి చెందుతుందో...?"
సాయంకాలం తీరుబడిగా కూర్చుని పొద్దున్ననగా వచ్చిన పేపర్ ని తిరగేస్తున్న తాయారు అన్నమాటకి ఎదురుగా కూర్చుని పుస్తకం చదువుతున్న ఆమె భర్త తెల్లబోయాడు.
"అదేంటి తాయారూ అలా అంటావ్..?" ఆశ్చర్యంగా అడిగాడు. సర్దుకుంది తాయారు. నిజంగా తాయారు పేపర్ లో చదివిన వార్త గురించి భర్తకి చెప్తే ఇంకేదైనా వుందా... వెంటనే అప్పటికప్పుడు నోటికొచ్చింది చెప్పింది.
"ఏం లేదండీ.. మనవాళ్ళకి సివిక్ సెన్స్ అసలు ఎప్పటికైనా వస్తుందా.. అని. అప్పుడేకదా మనం మన దేశాన్ని అభివృధ్ధి చెందిన దేశమని చెప్పుకోవచ్చు. "
ఇంట్లో చెత్తంతా పట్టికెళ్ళి రోడ్డు మీద పోసే భార్యకి పేపర్ చదివితే వచ్చిన సివిక్ సెన్స్ కి సంతోషపడిపోయాడు పాపం ఆయన.
భర్తకి తను పేపర్లొ చూసింది చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ నెమ్మదిగా ఓ మూలకున్న ఆ వార్తని మళ్ళీ చదివింది తాయారు.
అసలా టైటిల్ చూస్తేనే పరవశమైపోయిందావిడ. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే "హజ్బెండ్స్ డే కేర్..". ఆ సంస్థ ఏంచేస్తుందంటే భార్య రోజంతా ఏ ఫంక్షనుకైనా వెళ్ళాలన్నా, షాపింగ్ కి వెళ్ళి గంటలు గంటలు గడపాలన్నా పిల్లల్ని డేకేర్ లో దింపినట్టే భర్తని ఇక్కడ దింపి భార్య తీరుబడిగా తన పనులు చూసుకుని మళ్ళి ఇంటికెళ్ళేటప్పుడు భర్తని తీసికెళ్ళొచ్చు. కొన్ని కొన్నింటికి భర్త పక్కనుంటే హుందాగానే ఉంటుంది కాని కొన్ని కొన్నింటికి ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.
అందుకని ఈ వార్త చదవగానే తాయారుకి చిన్నప్పుడు వినే "పిల్లలతో తీర్థానికి, మొగుడితో పుట్టింటికీ వెళ్ళకూడ" దనే సామెతొకటి గుర్తొచ్చింది. అలా ఎందుకంటారా అనుకునేది చిన్నప్పుడు. కాని అనుభవంలో కొచ్చేక తెలిసింది అందులో అసలైన అర్ధం. తీర్థానికి తీసికెడితె పిల్లలు అక్కడ చూసినవన్నీ కొనమని పేచీలు పెడతారు. ఎన్నని కొనగలం? వాళ్ళ పేచీలు తీర్చేటప్పటికి తల ప్రాణం తోకకి వస్తుంది. అలాగే మొగుడితో పుట్టింటికీనూ. అత్తింటిలో ఒదిగి ఒదిగి అన్ని పనులూ చేసుకునే ఆడదానికి పుట్టింటి కెళ్ళగానే ఎక్కడలేని స్వేఛ్ఛ వచ్చేస్తుంది. ఎప్పుడైనా నిద్ర లేవచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చిన్నప్పటి స్నేహితులని, దగ్గరి బంధువులని కలిసి కరువుతీరా మాట్లాడుకోవచ్చు. కాని ఆమెతోపాటు మొగుడు కూడా వస్తే ఇంకింతే సంగతులు. భర్తకి వేళకి కావల్సినవి చూడడం, అత్తింట్లో లాగే అతను ఎక్కడికి వస్తానంటే అక్కడికే వెళ్ళడం .. మరింక తనకి స్వేఛ్చ ఎక్కడ..?
కాని కాలాన్ని బట్టి తాయారు ఆ సామెతని కాస్త మార్చుకుంది. అదేంటంటే "పిల్లలతో సినిమాకి, మొగుడితో మాల్ కి వెళ్ళకూడదు.." అని చెప్పేసుకుంది. ఈరోజుల్లో సినిమాలేవీ పిల్లలతో కూర్చుని చూసేలాలేవు కదా..
మరింక మొగుడితో మాల్ అంటే ఈ మొగుళ్ళున్నారే వాళ్ళకి ఇంట్లోనే మనం ఏ షాప్ కి వెడతామో, ఏం కొంటామో, అది ఎంతుంటుందో అన్నీ ముందే చెప్పాలి. డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి కావల్సినవి కొనుక్కుని ఇంటికొచ్చెయ్యాలి. అంతే. కాని ఆడవాళ్ళలా కాదు. కొన్నా కొనకపోయినా ముందు మార్కెట్లో కొత్త రకాలేమొచ్చేయా అని చూడడం వాళ్ళ జన్మహక్కు. అవి బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, హౌస్ హొల్డ్ అయిటమ్స్ కావచ్చు, ఫాన్సీజ్యూయలరీ కావచ్చు, ఎలక్ట్రానిక్ అయిటమ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు... ఈ రోజుల్లో ఆడవాళ్ళకి అఖ్ఖర్లేని సరుకు లేదు కదా.. అందుకని అన్నీ చూడాలనుకుంటారు. అసలు ఆడవాళ్ళని టార్గెట్ చేసుకునే కదా అంతంత మాల్స్ వస్త.. హు.. ఏవ్హిటో.. అర్ధం చేసికోరూ..
అందుకే పేపర్ లొ వచ్చిన ఆ వార్త అంత నచ్చేసింది తాయారుకి. గబగబా వార్త పూర్తిగా చదివింది.
అదేదో దేశంలో ఇలా కొత్తగా "హజ్బెండ్’స్ డే కేర్ " అని పెట్టారనీ, భార్యలు బైటకి వెడుతూ భర్తల్ని అక్కడ దింపి వెడితే, అక్కడ వాళ్ళు వీళ్ళకి కావల్సిన బ్రెక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ లాంటివి ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి అక్కడ కాలక్షేపం అవడానికి ఎవరికిష్టమైనవి వాళ్ళు అంటే పేకాడుకునేవాళ్ళు పేకాట, పుస్తకాలు చదివే వాళ్ళకి పుస్తకాలు, కబుర్లతో కాలక్షేపం కావాలనుకున్నవాళ్ళకి కంపెనీ ఇవ్వడం.. ఇలా ఎవరికేది కావాలంటే అది అమర్చి వాళ్లని మొత్తం రోజంతా ఎంగేజ్ చేస్తారనీ ఆ వార్తలో వుంది.
మరింక భార్యలు హాయిగా, నిష్పూచీగా, ఏ టెన్షనూ లేకుండా మాల్ మొత్తం తిరిగేసి తిరిగి వెడుతూ భర్తని ఇంటికి తీసికెళ్ళొచ్చు. ఎంచక్కా... ఎంతబాగుందో ఈ ఏర్పాటు..అదేవిటో.. ఆ దేశాలన్నీ ఇలాంటివి భలే ఆలోచించి పెడతారు. మరి మన దేశమో.. ఇలాంటివాటిల్లో ఎప్పుడూ వెనకబడే వుంటుంది. అందుకే లోపల అనుకోవాలనుకున్నమాట బైటకే అనేసింది పాపం తాయారు.
"హు.. మన దేశం ఇంకా ఎప్పుడు అభివృధ్ధి చెందుతుందో..?" అంటూ.

(చిత్రం..గూగులమ్మ సౌజన్యంతో...)
----------------------------------------------------------------------

10 వ్యాఖ్యలు:

vasantham said...

అబ్బ పిచ్చ పిచ్చ గా నచ్చేసిందండి..మాల్ల్స్ లో ఎన్ని రకాల షాప్స్ ఉంటాయి..ఇంట్లో పని అంటే ఎక్కడ లేని నీరసం, అదేమిటో, మాల్ల్స్ లోకి వెల్ల గానే, కళ్ళల్లో చురుకు, కాళ్ళల్లో హుషారు, మొహం లో వెలుగు మనకి, అవి ఆ షాప్ లోని లిట్లు వి అంటారు మా ఆయన..ఆయన కేమో, ఆవిలింతలు, నీరసం, వణుకు...అదే బిల్లు తలచు కుని--అబ్బ ఎంత బాగుందండి..హస్బెండ్ డే కేర్ సెంటర్..అదేదో ,ఆ దేశం పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి..అక్కడికే పోతాం..మన దేశం లో లెం, ఎక్కడైనా ఒక్కటే మాకు.

వసంతం.

కొత్త పాళీ said...

హ హ.
మా వూళ్ళో కూడా ఎక్కడన్నా ఉన్నదేమో చూసుకుంటా

మాలా కుమార్ said...

హ హ హ అలా వుంటే ఎంతబాగుంటుందో ! నిజమేకదా మన దేశం ఎప్పుడు అంత అబివృద్ది చెందుతుందో ఏమో హుం . . .

Anonymous said...

అబ్బ ! ఆ భర్తలు ఎంత అదృష్టవంతులో కదా !
మాప్రాణానికి అక్కడే హాయిగా ఉంటుంది !!!!!

శ్రీలలిత said...

వసంతంగారూ,
మీకు నచ్చినందుకు సంతోషమండీ..
అదేదో దేశంలో మొదలయ్యిందికదా.. తొందరలోనే మిగిలిన దేశాలకీ పాకుతుందని ఆశిద్దాం..

శ్రీలలిత said...

కొత్తపాళీగారూ,
Wish you all the best...

శ్రీలలిత said...

మాలాగారూ,
తొందరలోనే మన దేశం కూడా ఈ విషయంలో అభివృధ్ధి చెందుతుందని ఆశిద్దాం..

శ్రీలలిత said...

harephala garu,
నిజంగానే ఈ ఆలోచన ఉభయతారకంగా వుంది కదండీ...

ఆవకాయ said...

సూపర్ ఐడియా.

హస్బెండ్ డే కేర్ కి ఓ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షను, వివిధ రకాల ఛానెళ్ళతో నాలుగు టీవీలు చాలు. పెద్ద పెట్టుబడి అక్కర్లేదు, చిన్న పిల్లల దానిలా :).

శ్రీలలిత said...

ఆవకాయగారూ,
మీ ఐడియా ఇంకా సూపర్ గా వుందండీ..