Pages

Thursday, December 27, 2012

పిల్లలూ...మిథునం సినిమా చూడండి...






  యువతీయువకులూ......మిథునం సినిమా చూడండి. భార్యాభర్తలంటే ఇప్పటి యువత అనుకుంటున్నట్టు అభిప్రాయాలు కలవక్కర్లేదు. అభిరుచులూ కలవాలనీ లేదు. కాని ఒకరికోసం ఇంకొకరు ఆలోచిస్తూ, ఒకరిదొకరు పంచుకోవాలన్న భావన ముఖ్యమని చిత్రం చెపుతుంది.
  ఒకే ఇంట్లో పుట్టి, ఒకే పరిస్థితుల్లో పెరిగిన అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ అభిరుచులూ, అభిప్రాయాలూ ఒక్కలా వుండవు కదా... మరి వేరు వేరు ఇళ్ళల్లో, వేరు వేరు పరిస్థితుల్లో పెరిగిన వారివి ఒకలా వుండాలనుకోవడం యెంతవరకూ సమంజసం? కాని ఇద్దరు వ్యక్తులు భార్యాభర్త లయ్యాక కలిసి పిల్లల్ని పెంచి, వారి వారి జీవితాలను నిలబెడుతూ, అదే సమయంలో తమతమ వ్యక్తిత్వాలను కూడా నిలబెట్టుకోవడంజీవితభాగస్వామి మనసు బాధపడే విషయాన్ని దాచి వాళ్లకి సంతోషం కలిగించడానికి పడే తపన... ఈ జీవనయానంలో ఆ ఆదిదంపతుల ప్రయాణం...ఇదంతా మన కళ్ళ ముందు అద్భుతంగా నిలిచిన దృశ్యకావ్యమే మిథునం సినిమా.
  ఒక్కసారి పచ్చటి చెట్ల మధ్య వున్న పెంకుటింటిని చూడండి. మీరు జీవితంలో వున్నతులుగా నిలబడడానికి పాతిపెట్టబడిన పునాదిరాళ్ళని చూడండి. భవ్యమైన మీ జీవితాలని నిలబెట్టిన వారు పుట్టిపెరిగిన పరిస్థితులని గమనించండి. వారి కోసం అటువంటి పరిస్థితులు కల్పించలేని మీ జీవితాల్ని తలుచుకుని బాధపడండి. కాని అటువంటి జీవితాన్ని వదిలి రాలేని వారిని మటుకు ఛాందసులని అనకండి. అలా అని వారిని చిన్నబుచ్చకండి.
 ప్రకృతిలో మమేకమై, ఒకరికోసం ఒకరు బతుకుతున్న జంటను చూస్తే సాక్షాత్ ఆదిదంపతులనే అనిపిస్తుంది. సహజంగా భోజనప్రియుడైన అప్పదాసు భోజనం వడ్డించేవరకూ ఆకలితో అల్లల్లాడిపోతూ భార్య బుచ్చిలక్ష్మిని శాపనార్ధాలు పెట్టెస్తూ వుంటాడు. అదే అప్పదాసు కాస్త కడుపు నిండగానే భార్యను అపర అన్నపూర్ణగానే భావించి "అద్భుతః.." అంటాడు.
 బాల్య స్నేహితురాలు ఇంకా సుమంగళి గానే వుందనే ఊహతో వున్న ఆవిడని అదే భావనతో వుంచడానికి భర్త చేసే ప్రయత్నం చూస్తుంటే భార్య పట్ల అతనికి వున్న ప్రేమ యెంత గొప్పదో అర్ధమవుతుంది.
   యే భర్తకయినా సరే తన భార్య తనకన్నా మరొకరిని చేసుకుంటే బాగుంటుందనే ఊహ భార్య మనసులో కొచ్చిందంటే భరించలేడు. అటువంటిది భర్తను ఉడికించడానికి లేని ద్రాక్షారం సంబంధం విషయం భార్య యెత్తినప్పుడల్లా శివాలెత్తిపోయే అతను చివరికి అసలలాంటి సంబంధమే తనకి రాలేదు అని నిజం చెప్పినప్పుడు భర్త అనుభవించే రిలీఫ్ ( మాటకి సరైన తెలుగు పదం నాకు రాలేదు) ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం యెంత బాగా చూపించేరో చెప్పలేను. చెట్టుకీ, పుట్టకీ, ఆవుకీ, పూవుకీ అందరికీ చెప్పేసుకుంటాడు. అప్పటికి కాని అతనికి సంతృప్తి వుండదు.
   పిల్లలూ...ఆదర్శదంపతులంటే అన్నీ మనసులోనే దాచేసుకుని యెదురుగా ఒకరినొకరు పొగుడుకోవడం కాదు. ఒకరికి తెలీకుండా మరొకరు బ్యాంకు అకౌంట్లు పెట్టుకోవడంకాదు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కాదు. థాంక్స్ లూ, సారీలూ చెప్పుకోవడం కాదు.
ప్రేమించేవారికి కావలసిన  పని చేసి ఆ ప్రేమని చూపించాలి. అదీ ప్రేమంటే...
   సినిమా చూడండి. ఓపిక తగ్గిపోయినా భోజనప్రియుడైన భర్త కోసం భార్య చేస్తున్న వంటలు చూడండి. అర్ధరాత్రి లేచి ఆకలంటాడని మంచం పక్కనే మామిడితాండ్ర పెట్టుకున్న భార్య తాపత్రయం గమనించండి. కాలక్షేపానికి ఒకరినొకరు యెన్ని అనుకున్నా ఒకరికొకరం కట్టుబడివున్నామనే అద్భుతమైన భావనని గమనించండి.
 ఆఖరికి కాలగతిలో మరణం తప్పదని తెలిసి సాంప్రదాయాన్నితిరగరాసిన భార్య మనోవిశ్లేషణ చూడండి.
వట్టిగా చూడడం కాదు. ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచించండి. ఇదివరకు కన్న ఇప్పుడు విడాకులు యెందుకు యెక్కువ అవుతున్నాయొ ఒక్కసారి నిలబడి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలని పెద్దవి చేసుకోకండి. ఒకరికోసం ఒకరన్నట్టు బ్రతకండి. తిట్టుకోండి. కొట్టుకోండి. దెబ్బలాడుకోండి. మీ మనసులో వున్నదంతా బయటికి కక్కెయ్యండి. అంతే.. అద్దం మీద ఆవగింజ. మళ్ళీ ఒకరికొకరుగా బతకండి. జీవితాన్ని పండించుకోవడం యెలాగో సినిమా చెప్తుంది.
శ్రీరమణ యెంతో అందంగా రాసిన "మిథునం.." కథకు అంతే అందంగా దృశ్యరూపమిచ్చేరు తణికెళ్ళ భరణి. మరింక రెండో మాట లేదంతే.
  యెవరో అన్నారు.. సినిమా యాభైయేళ్ళు దాటినవాళ్ళకే నచ్చుతుందని. కాని నాకు అలా అనిపించలేదు. సినిమా యువత చూడాలి. వాళ్ళూ పెద్దవారవుతారు కదా. బోల్డన్ని కార్టూన్ సినిమాలూ, హారర్ సినిమాలూ చూస్తున్నారు. వాటి కన్న ఇది చాలా గొప్ప సినిమా. యువతీయువకుల్లారా, మీరు తప్పకుండా చూడండి. నవరసభరితంగా మలచబడిన మీ అమ్మానాన్నల ప్రేమకథని మనసారా ఆస్వాదించండి. ఈ ఆదిదంపతుల్లాగే మీ జీవితాన్ని కూడా పండించుకోండి.
-----------------------------------------------------------------------------------






11 వ్యాఖ్యలు:

వాత్సల్య said...

చాలా బాగ చెప్పారు

Mantha Bhanumathi said...

ఎంత చక్కని సందేశమిచ్చారు లక్ష్మి గారూ! చాలా బాగుంది.
నిజమే.. యువత నేర్చుకోవలసిన పాఠాలెన్నో ఉన్నాయి ఇందులో.
అభినందనలు.

Lakshmi Raghava said...

sree lalitha గారు ,
మేము సినిమాచూసి సుమారు ముప్పై ఏళ్ళు అయ్యింది. మీరు ఇంత చక్కగా వివరించాక ఒక్క సారి ఈసినిమ చూడాలని వుంది.
కొసమెరుపుగా మాకథ ఎక్కడైనా reflect అవుతుందేమోనని ఆశగా వుంది .
యువత చూడాలి అనుభంధాల ఆనందాన్ని! మీతో నేను ఏకీభవిస్తాను.
చక్కటి విశ్లేషణ కు అభినందనలు.

లక్ష్మి రాఘవ

Chinni said...

నేను మిథునం పుస్తకం చదివాను. కానీ మీరు చెప్పిన తర్వాత అంత అందమైన పుస్తకాన్ని ఇంకెంత అందంగా మలిచారో అని అనిపిస్తోంది.

sreeviews said...

నా కాబోయే శ్రీమతికి ఈ మీ లింక్ పంపేసా లలితగారూ.. :)

psm.lakshmi said...

మీరన్నది నిజమే. ఒకరికొకరుగా ఎలా బతకాలో చాలా బాగా చూపించారుగానీ నాకెందుకో కొంత అసంతృప్తి మిగిర్చింది. జీవితమంటే ఒకరికొకరుగా బతకటమేకాదు..మన చుట్టుపక్కలవున్న మనుష్యులూ, మమతలూ, సమస్యలూ, నక్స్ వామికాకి అందని రోగాలూ...ఇంకా ఎన్నో వున్నాయి. కేవలం ఒకే కోణం చూపించటానికి వాటిని వదిలేశారంటే..దర్శకుడు విజయం సాధించినట్లే.
psmlakshmi

శ్రీలలిత said...


రిషిగారూ, ధన్యవాదాలండీ..
భానుమన్తిగారూ, మీ అభిప్రాయానికి ధన్యవాదాలండీ...
లక్ష్మీరాఘవగారూ, ధన్యవాదాలండీ...
చిన్నిగారూ, తప్పకుండా సినిమా చూడండీ..మీకు అసంతృప్తి ఎంతమాత్రం కలగదు...
పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారూ, మీరన్నది నిజమే. ఒకే కోణం మీద ఫోకస్ చెయ్యడానికి దర్శకులు మిగిలిన విషయాలు పక్కన పెట్టి వుండొచ్చు...

శ్రీలలిత said...


రిషిగారూ, ధన్యవాదాలండీ..
భానుమన్తిగారూ, మీ అభిప్రాయానికి ధన్యవాదాలండీ...
లక్ష్మీరాఘవగారూ, ధన్యవాదాలండీ...
చిన్నిగారూ, తప్పకుండా సినిమా చూడండీ..మీకు అసంతృప్తి ఎంతమాత్రం కలగదు...
పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారూ, మీరన్నది నిజమే. ఒకే కోణం మీద ఫోకస్ చెయ్యడానికి దర్శకులు మిగిలిన విషయాలు పక్కన పెట్టి వుండొచ్చు...

తృష్ణ said...

చాలా బాగా చెప్పారు శ్రీలలిత గారూ. పెళ్లయి ఏళ్ళు గడిచాకా, అమ్మానాన్నల దగ్గరకన్నా ఎక్కువ కాలం దంపతులిద్దరే కలిసిఉన్నాకా, ఒకరిగురించి ఒకరికి బాగా తెలిసాకా పెరిగే ప్రేమలో ఎంతో స్నేహం, ఆత్మీయత ఉంటాయి.అప్పుడే ఒకరికొకరు కావాల్సినది. సరైన సామరస్యం గనుక ఉంటే నా దృష్టిలో భార్యాభర్తలిద్దరే నిజమైన స్నేహితులు. మిగతావారంతా ఆ తర్వాత వచ్చేవారే.

నవజీవన్ said...

మిధునం సినిమా బాగుంది. ఇది మా లాంటి యువకులకు కూడా బాగానే నచ్చింది.
ఒక విచిత్ర సోయగం ఈ మిధునం
శ్రీ రమణ కలం నుంచి జాలువారిన మధుర కథా సాగరం ఈ మిధునం
హాస్యం, అనురాగం, మంచితనం, అమ్మతనం, ప్రేమదనం అన్ని కలిసిన ముచ్చటైన పయనం మిధునం
తనికెళ్ళ వారి దర్శకత్వం అద్బుతం

Karthik said...

Movie chaalaa chaalaa baagundi:-):-)
me review inkaa baagundi:-):-)