Pages

Monday, October 24, 2016

లలితా మహిళామండలి ఇరవైమూడవ వార్షికోత్సవ సంబరాలు..


లలితా మహిళామండలి ఇరవైమూడవ వార్షికోత్సవ సంబరాలు.. 

   అందరం పదకొండు గంటలకల్లా రాజ్యలక్ష్మిగారింటికి చేరిపోయాం. ఆవిడ పరమ వీర పాఠకురాలు. కనిపించిన పుస్తకాలూ, పేపర్లే కాదు, ఎదురుగా చిత్తుకాగితం కనిపించినా చదివి పడేసే స్వభావం. వట్టి చదివేసి వూరుకోకుండా అందులో చాలా చాలా కష్టమైన ప్రశ్నలన్నీ, జవాబులతో సహా ఒకచోట రాసిపెట్టుకుంటారు.  దానివల్ల మీకేం నష్టం అంటారా.. మాకేనండీ బాబూ నష్టం.. ఇలాగ మేం మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడల్లా  ఆ ప్రశ్నలన్నీ మామీద సంధిస్తారు. అలాగే ఇవాళకూడా మామీద పగ సాధిస్తున్నరీతిలో నాలుగు ప్రశ్నాపత్రాల నిచ్చి, జవాబులు రాయమన్నారు. ఏదో చిన్నపిల్లలకి తాయిలం చూపించినట్టు ఆ పోటీకి ప్రైజులు కూడా పెట్టారు. (హూ.. ఆవిడకీ అలవాటు యెప్పుడు పోతుందో.. మేమెప్పుడు సుఖపడతామోకదా..ఇది నా స్వగతం అన్నమాట..)
చూడండి.. చూడండి..మమ్మల్ని చూసి ఆవిడెంతలా నవ్వుకుంటున్నారో.. హూ!..అడిగేవాడికి చెప్పేవాడు లోకువని అందుకే అన్నారు.. 

  
  మొత్తానికి 10 నిమిషాలంటూ ఆవిడిచ్చిన టైముకి మరో 10 నిమిషాలు చేర్చుకుని, ఒకళ్ళకొకళ్లం దూరం దూరంగా జరిగిపోయి (చూసి కాపీ కొట్టకుండా అన్నమాట..) ఎమ్ సెట్ లెవెల్లో జవాబులు రాసి పడేసాం.
విధి ఎంత కౄరమైనది.. ప్రైజు నాకు రాలేదు.. కానీ చాలా మంచిది..ఫస్ట్ ప్రైజు మా చెల్లెలు భారతికి వచ్చింది.  నాకు ఇంకా సంతోషం.

సెకండ్ ప్రైజు విద్యుల్లతకు వచ్చింది.


  
  ప్రతిసంవత్సరం సభ్యులం అందరం వారి వారి ప్రతిభను చూపించుకునే కార్యక్రమం చేస్తుంటాం. 
అందులో భాగంగా మొట్టమొదట దుర్గ రెండు భర్తృహరి సుభాషితాలను వినిపించి, వాటి అర్ధాన్నివివరించారు.             కమలగారు అక్బర్ బీర్బల్ కథలూ, తెనాలి రామలింగని కథలూ చెప్పి అందరినీ ఆహ్లాదపరిచారు.                                ఉమాసుందరి తూము నరసింహదాసుగారి కీర్తన పాడి అందరినీ అలరించారు.

పద్మామూర్తి ఈ మధ్యనే తెలుగు యూనివర్సిటీనుంచి శాస్త్రీయసంగీతంలో డిగ్రీ పూర్తిచేసారు. అందుకని ఆవిడ శాస్త్రీయసంగీతం పాడి వారి విద్వత్తును చూపించారు. 
           శ్రీదేవి, అన్ని రకాల చీరలగురించీ వివరిస్తూ కలంకారీ పనితనం గురించి అందరికీ విశదపరిచారు.. 

రాజ్యలక్ష్మిగారు జోకులు పేల్చి అందరినీ నవ్వించారు.. 
భారతి "ఈమావి పైనుండి.. ఈవు కూ కూ యంచు.." అనే లలితగీతం పాడి అందరినీ అలరించింది. 


అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుకే హైలైట్ అయిన ప్రోగ్రామ్ సుందరిగారిది. ఆవిడ చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న దశావతారాలపాటను, అభినయంతో సహా అందరిముందూ ప్రదర్శించడానికి నాలుగురోజులముందునుండీ ఇంట్లో రిహార్శల్స్ వేసుకుని యెంతో అద్భుతంగా అభినయించారు. అందుకే ఆవిడ ఫొటోలు ఇంకోరెండు యెక్కువ పెడుతున్నాను. 


                                   


     తర్వాత కళ్యాణిగారు. ఈవిడ యోగా గురువు. సూర్యనమస్కారాల ముద్రలు చూపించి వాటి వైశిష్ట్యాన్ని తెలిపారు..
రామలక్ష్మిగారు  లక్ష్మీస్తుతి చదివి అందరిలో భక్తిభావం నింపారు. రమాదేవి ఖడ్గతిక్కన భార్య అయిన చెన్నమ్మ గురించి చక్కని కథను వివరించారు. ఖడ్గతిక్కన అనగానే అందరికీ సాధారణంగా ఖడ్గతిక్కన భార్య ఆయన యుధ్ధం నుండి వచ్చినప్పుడు స్నానానికి మంచం చాటుగా పసుపు పెట్టిందన్న కథే గుర్తొస్తుంది. కానీ ఈ కథలో ఆ చెన్నమ్మ యెంతటి పతివ్రతో తెలుస్తుంది. యుధ్ధంలో ఖడ్గతిక్కన తల తెగి యెక్కడ పడిపోయిందో తెలీనిపరిస్థితిలో తొమ్మిదిరోజులు గడిచిపోయాక, తల లేకుండా మిగిలిన కార్యక్రమాలు యెలా చెయ్యాలొ తోచని పరిస్థితిలో అందరూ వుంటే, ఆ తొమ్మిదిరోజులూ ఈ చెన్నమ్మ అమ్మవారిముందు ఒక తపస్సులో కూర్చున్నట్టు కూర్చుందిట. తొమ్మిదోరోజు ఖడ్గతిక్కన శరీరానికి ఆ తలవచ్చి మొండానికి అంటుకుని ఒక్కసారిగా లేచి కూర్చుని, మళ్ళి పడిపోయిందిట. అప్పుడు మిగిలిన కార్యక్రమాలు  పూర్తిచేసారుట. పతివ్రతలంటే అటువంటివారూ అంటూ మాకెవరికీ తెలీని కథని యెంతో చక్కగా వివరించారు రమాదేవిగారు.


మరింక నేను మన ఇంటిపనులను యెంత తెలివిగా చేసుకోవాలో  సూచించాను. 


దుర్గ నా సూచనలకు మరికొన్ని జోడించింది.. 


సరస్వతి, భాగ్యలక్ష్మీ  యివన్నీ చూసి ఆనందించారు.. 

   ఇన్నీ చేసి అలసిపోయాక మరింక భోజనం చెయ్యాలిగా.. ఇదిగోమరి అసలైన విందుభోజనం.. 


           ఎంతో సరదాగా ఆటాపాటలతో గడిపిన అనుభూతిని ఆస్వాదిస్తూ సాయంత్రానికి అందరం యిళ్ళకి మళ్ళాం.. 


------------------------------------------------------------------------------------------------------


5 వ్యాఖ్యలు:

Zilebi said...


శుభాకాంక్షలతో

జిలేబీమయము గా ఉంది

లలితా మహిళా మండలి
భళి సంబరములు కథలును భళి యాటాపా
టలునూ చిత్రములు భళీ
పలువిధ వంటలు జిలేబి భళిభళి భళియౌ !జిలేబి

శ్రీలలిత said...


ధన్యవాదాలండీ..

మాలా కుమార్ said...

చాలా బాగా చేసుకున్నారండి.అభినందనలు.

Lalitha TS said...


మీ బ్లాగు బావుందండీ - వీలు చూసుకుని చదవాలి - మీ ఉచిత సలహాలు :) మీకు శుభాభినందనలు!

శ్రీలలిత said...


ధన్యవాదాలండీ లలితగారూ, తప్పక చదవండి. ఎందుకంటే అన్నింటికన్నా సులభమైనపని ఉచితసలహా లివ్వడమే కదా!