Pages

Tuesday, July 25, 2017

శోభన్‍బాబు - జీవితచరిత్ర

నేను నిన్ననే శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు వ్రాసిన “శోభన్ బాబు - జీవిత చరిత్ర” చదివాను. దానికి టాగ్లైన్ “పరుగు ఆపడం ఓ కళ..” 360 పేజీల పుస్తకాన్ని మొదలుపెట్టినదానిని ఆపకుండా చదివేసానంటే ఆ పుస్తకం ఎంత బాగుందో అర్ధమైపోతుంది.
ఏ పుస్తకం యెందుకు చదవాలీ అని తెలుసుకోవాలనుకున్నవాళ్ళకు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు తెలియకుండా వుండరు. విద్యార్థులను విజయంవైపు నడిపించడానికి ప్రేరణ కలిగించే ఆయన ఉపన్యాసాలు, ఏ పుస్తకం యెందుకు చదవాలో చెపుతూ ఆయన యిచ్చిన వీడియోలూ యూ ట్యూబ్ లో చాలా చూసాను నేను. అందుకే ఈమధ్య లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆయన వ్రాసిన “శోభన్బాబు-జీవితచరిత్ర” కనపడగానే వెంటనే తీసుకుని చదవడం మొదలుపెట్టాను. అందాలనటుడు అయిన శోభన్బాబు మంచి వ్యక్తిత్వం గల మనిషి కూడానని విన్నందువల్ల ఆ విషయం తెలుసుకుందామనుకోడం ఒక కారణం అయితే, ప్రతి పుస్తకాన్నీ మంచి తర్కంతో ముడిపెడుతూ, పుస్తకం రచయిత గురించీ, పుస్తకంలోని విషయాల గురించీ అత్యంత ఆసక్తిదాయకంగా చెప్పే ఆకెళ్ల రాఘవేంద్రగారు వ్రాసిన పుస్తకం చదవాలనే ఆసక్తి మరో కారణం.
మామూలుగా యెవరి జీవితచరిత్రలువాళ్ళే రాసుకుంటారు. లేదా వాళ్ళు బ్రతికుండగానే పర్యవేక్షించుకుంటూ మరొకరిచేత వ్రాయించుకుంటారు. కానీ ఈ పుస్తకం అలాకాదు. శోభన్బాబు మరణించాక ఆయన అభిమానులు తండోపతండాలుగా చెన్నైకి వెళ్ళారు. అశృతప్త నయనాలతో ఆ మహా నటుడికి వీడ్కోలిచ్చారు. ఎప్పుడూ యే సినిమా ఉత్సవానికీ హాజరవని, అభిమానసంఘాలను అంతగా ఉత్సాహపరచని శోభన్బాబుకి ఆయన చనిపోయినప్పుడు అంతమంది అభిమానులు రావడం ఈ రచయితకు విడ్డూరంగా తోచింది.
ఏముంది శోభన్బాబులో.. అందమా? అభినయమా? ఆదర్శమా? వ్యక్తిత్వమా? ఏ ఆకర్షణశక్తి ఇంతమందిని కట్టిపడేసి వుంటుందనే ఆలోచన వచ్చిన రచయిత రాఘవేంద్రగారు శోభన్బాబు జీవితాన్ని పరిశీలించి, ఆయనలో ఒక ఆదర్శనీయ వ్యక్తిత్వం వుందని తోచి ఈ పుస్తకం వ్రాసారు. పుస్తకం వ్రాయడంకోసం వివరాలు సేకరించడం ఒక పెద్ద పని. రచయిత అన్ని రంగాలనుంచీ వివరాలు సేకరించడం ఒక యెత్తయితే శోభన్బాబు వ్రాసినట్లు వ్రాయడం మరో యెత్తు. అది ఈ పుస్తకానికి ఎంతో అందాన్నీ, హుందాతనాన్నీ, నిండుతనాన్నీ యిచ్చింది. ఈ రచనను ఒక soliloquy పధ్ధతిలో వ్రాసానని రచయితే ముందుమాటలో చెప్పారు.
శోభన్బాబు స్వతహాగా అంతర్ముఖి. లా చదవడానికంటూ చెన్నైలో భార్యతో కాపురం పెట్టి, నటనమీద అభిలాష తో స్టూడియోలచుట్టూ తిరిగే రోజుల్నించి, ఆ రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ యేర్పరుచుకోవడమే కాకుండా, వృత్తికీ, కుటుంబానికీ కూడా సమయాన్ని సరిగ్గా విభజించుకున్న మనిషాయన. జీవితంలో దేనినైన సాధించాలంటే పరుగు పెట్టడం తప్పనిసరి. కానీ ఆ పరుగు యెక్కడ ఆపాలో చాలామందికి తెలీదు. ఆ విషయం తెలుసుకుని, అందాలనటుడుగానే తన అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు శోభన్బాబు.
ఈ పుస్తకం చదువుతుంటే మెరుపువెలుగుల సినీ ప్రపంచంలో శోభన్బాబు నిలదొక్కుకుందుకు పడ్ద శ్రమ, నిలబడ్డాక దానిని నిలుపుకుకుందుకు పడ్ద తపన, మధ్యలో సినిమాలు ఫ్లాపయినప్పుడు పడిన మనోవేదన, తర్వాత వరస విజయాలతో ఆయన అందుకున్న అవార్డులు అన్నీ మన కళ్ళముందు శోభన్బాబు చెపుతున్నట్లే వుంటుంది.
చిన్నప్పుడెప్పుడో “కళ కళకోసమా?” అన్న నవల చదివాను. అందులో నాట్యం మీదున్న అభిమానం కొద్దీ కథానాయిక తన వ్యక్తిగత జీవతాన్ని వదులుకుంటుంది. అలాగే చాలామంది మంచి కళాకారులయ్యుండి కూడా వారిలోని ప్రతిభను వారిలోనే తొక్కిపట్టుకుని, బ్రతుకుతెరువుకోసం వారి మనసుకు నచ్చని ఉద్యోగాలు చేస్తూ జీవితాన్ని వెళ్ళదీసేస్తుంటారు. కానీ శోభన్బాబు యెంతో ప్రతిభావంతంగా తనకి యిష్టమైన నటననే వృత్తిగా స్వీకరించినా కూడా అది తన వ్యక్తిగత జీవితానికి యెటువంటి భంగమూ కలగకుండా తన కుటుంబానికి కూడా అంత ప్రాధాన్యాన్నీ యిచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం. సినిమా ఫీల్డంటే ఏదో పొద్దున్న పదిగంటలకి వెళ్ళి, సాయంత్రం అయిదింటికి యింటికొచ్చేసేది కాదు. అక్కడ పనంటే మామూలుగా శారీరకంగా చేయడం కాదు. ప్రతి పాత్ర పోషించడానికీ యెన్నో రకాలైన మానసిక ఒత్తిళ్ళను తట్టుకోవలసుంటుంది. ఒకచోట పగలబడి నవ్వితే, మరోచోట భోరుమని యేడ్వవలసిన పరిస్థితి. అవన్నీ నటుడు అనుభవించి, ప్రేక్షకులని మెప్పించాలి. అటువంటి పాత్రలకి న్యాయం చేస్తూ, తన కుటుంబం తన మీదే ఆధారపడివుందన్న నిజాన్ని (అప్పట్లో చాలామంది నటులకు తెలియని నిజాన్ని) తెలుసుకున్న మనిషి శోభన్బాబు.
నేనూ- నా కథానాయికలూ అన్న చాప్టర్ లో ఆయనతో నటించిన కథానాయికల గురించి అప్పటి పత్రికలో వచ్చిన వ్యాసాలను ప్రచురించారు. ప్రతి ఒక్క కథానాయిక గురించీ శోభన్బాబు చాలా చక్కగా చెప్పారు.
ఒక హీరోగా సినిమారంగంలో నిలదొక్కుకుని, హీరోలాగే ఆ రంగం నుంచి నిష్క్రమించిన ఆకెళ్ళ రాఘవేంద్రగారు వ్రాసిన శోభన్ బాబు జీవితచరిత్ర పుస్తకం, అరుదైన ఫొటోలతో చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది.

2 వ్యాఖ్యలు:

నీహారిక said...

మీ వదిన గారి కధలు మిస్ అవుతున్నానండీ ! చాలా రోజులయింది ఒకటి వ్రాయండి.

శ్రీలలిత said...

మీ అభిమానానికి ధన్యవాదాలండీ నీహారికగారూ..వదిన కథ ఒకటి ఇప్పుడే బ్లాగ్ లో పెట్టాను చూడండి.