Pages

Wednesday, December 30, 2009

పండుగ బహుమతి--

సంక్రాంతి పండగంటేనే పెద్దపండుగ అంటుంటాం.. సుమారు పదేళ్ళ క్రితం ఇలాంటి సంక్రాంతి పండుగకే మా స్నేహితులందరం కలిసి ఆకాశవాణి లో ఒక చిన్న నాటిక వేసాం. అది గుర్తొచ్చి ఇక్కడ పెడుతున్నాను. దీనికి కొన్ని పరిమితులున్నాయి. అన్నీ స్త్రీపాత్రలే ఉండాలి లాంటివి. అందరం అనుభవం లేని వాళ్ళమే. సరదాగా చేసిన ఈ నాటకం మళ్ళీ పండక్కి ఒకసారి గుర్తుచేసుకుంటూ మీ అందరికీ వినిపిస్తున్నాను. ఇది చదవాలంటే ఇక్కడ చదవండి. వినాలంటే ఈ లింక్ కి వెళ్ళి వినండి. ఇక్కడే వినాలంటే పైన బటన్ క్లిక్ చెయ్యండి..
http://www.divshare.com/download/9971636-534పండుగలన్నింటిలోకీ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు అత్తవారింటికి రావడం, బహుమతులు అందుకోవడం మనం చూస్తున్నదే. ఈ సంక్రాంతి సందర్భంగా చిన్న నాటిక. "పండుగ బహుమతి." రచన, నిర్వహణ శ్రీమతి.జి.ఎస్.లక్ష్మి. పాల్గొన్నవారు- అమ్మమ్మ పార్వతమ్మగా-శ్రీమతి జయలక్ష్మీ కృష్ణమోహన్, అమ్మ వసుంధరగా-శ్రీమతి మణి,
పెద్దకూతురు సునందగా -శ్రీమతి దుర్గ, రెండవ కూతురు వైదేహిగా-శ్రీమతి శుభ, పక్కింటావిడ మాలతిగా-శ్రీమతి దుర్గాశేఖర్..
వసుంధరగారి పెద్దమ్మాయి సునంద కి కొత్తగా పెళ్ళైంది. వెంటనే వచ్చిన సంక్రాంతి పండగకి అమ్మగారింటికి వచ్చింది. ఆమె అమ్మ, అమ్మమ్మ, చెల్లెలు వైదేహి సునందను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ లోపల పక్కింటావిడ మాలతి కూడా వాళ్ళింటికి వెళ్ళింది. మనమూ వెళ్ళి చూద్దాం రండి సంగతేవిటో.....
మాలతి--వసుంధరగారూ, ఇల్లంతా చాలా సందడిగా ఉంది. సునంద వచ్చిందా యేంటి?
వసుంధర--రండి వదినగారూ, ఇవాళ పొద్దున్నే వచ్చింది.
మాలతి--అల్లుడు కూడా వచ్చాడా?
వసుంధర-- ఇంకా లేదు. వస్తాడు. ముందు అమ్మాయిని పంపించాడు.
పార్వతమ్మ--ఏమ్మా..మాలతీ, కులాసానా..
మాలతి-- మీరా పిన్నిగారూ, ఎప్పుడొచ్చారు? బాబయ్యగారు కులాసానా..
పార్వతమ్మ--ఆ..బానే ఉన్నారమ్మా. సంక్రాంతి పండగకి కొత్తల్లుడు వస్తున్నాడని అమ్మాయి ఉత్తరం రాసింది, కాస్త సాయంగా ఉంటానని బాబయ్యగారు నన్ను పంపారు.
వసుంధర--మంచిపని చేసారు. అసలే పెద్ద పండుగ. అల్లుడేమో కొత్తల్లుడాయే. పెద్దవారు మీరు దగ్గరుండి మంచీ చెడ్డా చూసుకోకపోతే వసుంధరగారికి ఇబ్బందే కదా.
సునంద-- హాయ్ ఆంటీ, బాగున్నారా..
వసుంధర--అహా.. మా మాటకేం కాని నీ సంగతి చెప్పు. కొత్త పెళ్ళికూతురువికూడాను. కొత్తగా అత్తవారింటినుంచి వచ్చావ్. విశేషాలేంటో చెప్పు మరి..
సునంద--విశేషాలేమున్నాయాంటీ. అంతా మామూలే.
వసుంధర--ముందు మీ ఆయన సంగతి చెప్పు. సంక్రాంతికి యేం బహుమతి కావాలిట మీ ఆయనకి?
వైదేహి-- ఒక జెట్ ఎయిరోప్లేన్ కావాలిటాంటీ..కొనిస్తారా?
వసుంధర-- ఈ వైదేహి కన్నింటికీ వేళాకోళమే.
సునంద-- అయినా బహుమతులేంటాంటీ సిల్లీగా..
పార్వతమ్మ--అదేంటే.. సిల్లీ. పిల్లీను. పండక్కి బహుమతులివ్వడం మామూలేకదా..అందులో కొత్తల్లుడూ, పెద్ద పండగానూ. అవునూ, సునందా, మీ ఆయన యేం కావాలన్నాడే. నాతో చెప్పు. నేను మీ అమ్మతో చెప్తాలే..
వైదేహి-- నే న్చెప్పనా అమ్మమ్మా..
సునంద-- నువ్వుండవే..ఈ రోజుల్లో ఇవన్నీ యేంటి అమ్మమ్మా..
పార్వతమ్మ-- అదేంటే , మరీ చోద్యం..రోజుల్తో పాటు కానుకలు మారతాయి కాని కానుకలు ఇవ్వడం మానేయరెవరూను.
వైదేహి-- ఎందుకివ్వాలి? ఈ మధ్యనే కదా నాన్న అంత ఖర్చు పెట్టి పెళ్ళి చేసేరు. మళ్ళీ పండుగలూ, బహుమతులూ అంటూ పూర్తిగా అప్పుల్లో మునిగిపోతే కాని ...
పార్వతమ్మ-- అదెంటె.. పండగకి కొత్తల్లుడికి బహుమతి ఇవ్వడానికి కష్టమేవిటే పిచ్చిదానా. ఇది మన సాంప్రదాయం. మీ నాన్న మా దగ్గర పుచ్చుకోలేదూ? తనూ అల్లాగే ఇస్తాడు అల్లుడికి.
వైదేహి-- దీనినే తనతో పాటు ఎదుటివాడిని కూడా గోతిలోకి లాగడం అంటారు.
మాలతి-- మీ అల్లుడికి ఆ రోజుల్లో మీరేవిచ్చారు పిన్నిగారూ?
పార్వతమ్మ-- ఏమోనమ్మా..సరిగా గుర్తులేదు. నాకూ నలుగురాడపిల్లలా.. అలాగని ఊరుకున్నామా..దేని ముచ్చట దానిదే.
ఒకాయనకి ఉంగరమిస్తే మరొకాయనకి వాచీ, ఇంకొ కాయనకి రేడియో..ఇలా ఇచ్చాం. అంతేకాని పండగ బహుమతులు మానుకుంటారా యెవరైనా?
మాలతి-- అది నిజమేనండి పిన్నిగారూ. కానుకలు స్వరూపాలు మారేయి కాని కానుకలు ఇవ్వడం మానలేదు ఎవరూ. మొన్న మా అన్నయ్యగారబ్బాయికి వాళ్ళ మావగారు కలర్ టీ. వీ. ఇచ్చారు.
వసుంధర-- యేదో ఒకటి. టీ.వీ కాని, వీడియో కాని, స్కూటర్ కాని ఎవరికి తగ్గది వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. కట్నాలు లేవన్న మాటే కాని యే ఖర్చు తగ్గిందనీ..
పార్వతమ్మ-- అదీ నిజమే.. మొన్నీమధ్య మా మేనకోడలు పెళ్ళి చెస్తే వెళ్ళేను. పెళ్ళికొడుకు అమెరికా నుంచొచ్చేట్ట. యెంత గొప్పగా చెప్పుకున్నారో అతని గురించి. కాని పెద్ద పేచీ పెట్టేసేడనుకో పెళ్ళిలో..
మాలతి, వసుంధర-- అదేవిటీ? యెందుకూ?
పార్వతమ్మ--పెళ్ళిలో ఊరేగింపుకి పల్లకీయే కావాలని కూర్చున్నాడు.
మాలతి--పల్లకీయా? యెందుకూ?
పార్వతమ్మ-- పల్లకీ యెక్కి ఊరేగాలిట. అది వీడియో తీసుకుని అమెరికాలో చూపిస్తాడుట.
వసుంధర-- యేవిటీ? నిజంగానే?
పార్వతమ్మ-- ఆ. ఇంక మా మేనకోడలు మొగుడి ఖంగారు చూడు. హైదరాబాదులో పల్లకీ ఎక్కడ దొరుకుతుంది చెప్పు?
అందరూ--హహ్హహ
వైదేహి-- ఫారిన్ లో మన గురించి యేదో చెప్పుకోవాలని కాకపోతే యెందుకిదంతా చెప్పు అమ్మమ్మా.. వాళ్ళ వేషభాషలు, టెక్నాలజీ అంతా అనుకరిస్తాం. కాని వాళ్ళెమో భార్యా భర్తలు కావాలనుకున్నవాళ్ళు మరొకరిని అడక్కుండా స్వయంకృషితో
ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. మరి మనమో..మీ అమ్మేవిచ్చిందీ.. మీ నాన్నేవిచ్చాడూ అని పెళ్ళైన మర్నాటినుంచీ గొడవే..
మాలతి-- పిన్నిగారూ, ఈ అమెరికా వాళ్ళతో ఇదే గొడవండీ బాబూ.. మొన్నీమధ్య మావారి ఫ్రెండింట్లో పెళ్ళి కెళ్ళానని చెప్పానా? పెళ్ళికొడుకు అక్కగారు అమెరికా నుంచి వచ్చిందిట. ఆవిడకి తిరగట్లో విసిరిన కందిపొడే కావాలని కూర్చుంది. మిక్సీ లో చేసిన కందిపొడికి ఆ రుచి రానే రాదుట. ఇంక ఆ పెళ్ళివారి పాట్లు భగవంతుడికే తెలుసు.
పార్వతమ్మ-- ఏవోనమ్మా, రోజులు మారేయంటున్నారు. మనుషులు మారేరంటున్నారు. కానీ ఈ పధ్ధతులు మటుకు పేర్లు మారాయి తప్పితే ఇచ్చిపుచ్చుకోడాలు మటుకు యేమీ మారలేదు.
మాలతి-- ఇదివరకే నయం పిన్నిగారూ, యేదిస్తే అది తీసుకునేవారు. ఇప్పుడు వాళ్ళ కేంకావాలో అడిగి మరీ తీసుకుంటున్నారు. ఈ మధ్య మా అక్క అల్లుడు పండక్కియేం కావాలో పెళ్ళానికి చెప్పి మరీ పంపించేడు.
పార్వతమ్మ-- యేం కావాలన్నాడూ?
మాలతి-- ఆ.యేముందీ... ఈ రోజుల్లో హై లైట్ లొ ఉన్నదే.. మంచి కంపెనీ లో షేర్లు కొనిమ్మన్నాడుట.
వైదేహి-- గోవిందా. గోఓవింద.. చాలా షేర్స్ రేట్లు పడిపొయాయాంటీ.
మాలతి-- సునందా, నువ్వు మీ ఆయనకి యేం కావాలో రాసి కనుక్కో. అతనడిగింది మీ నాన్నగారు మటుకు కాదంటారేంటి?
వసుంధర-- అవును మరి. అయ్యే ఖర్చు ఎల్లాగూ అవుతుంది.. ఆ ఇచ్చేదేదో అతనడిగింది ఇస్తేనే సరి.
వైదేహి-- అక్కా, ఓ పని చైవే..మనం ఈ సారి పధ్ధతి మారిస్తే..
సునంద-- అంటే?
వైదెహి--మనవే పండక్కి బావగారింటికి వెళ్ళిపోతేనో..రోజులు మారేయి కదా.
పార్వతమ్మ-- చాల్లే ఊరుకొ..ఎవరైనా వింటే నవ్విపోతారు.
మాలతి-- పిన్నిగారూ, ఇంతకీ పండగ స్పెషల్స్ యేం చేస్తున్నారు మీ మనవడికి?
పార్వతమ్మ--పెద్ద పండగాయె. బొబ్బట్లు లేపోతే యెలా?
సునంద--అమ్మో బొబ్బట్లా? అవాయన తినరే అమ్మమ్మా.
పార్వతమ్మ-- బొబ్బట్లు తినకపోవడమేమిటే చోద్యం? అసలు అలాంటి పిండివంట ఉందా అని?
సునంద-- బొబ్బట్లు ఆయనకి అరగవే అమ్మమ్మా..ఆయన బ్రేక్ ఫాస్ట్ కూడా కార్న్ ఫ్లేక్స్, బ్రెడ్, బటర్ తప్పితే తినరు.
పార్వతమ్మ-- అదేవిటే రోగిష్టి వాళ్ళ లాగ ఆ బ్రెడ్ ముక్కలూ. మీ తాతగారు పనికట్టుకుని నన్ను పంపిందే అందుకు.. చక్కగా బొబ్బట్లు చేసి, ఇంత నెయ్యి వేసి మీ ఆయనకి వడ్డించమని..
వైదేహి-- ఈ రోజుల్లో అంతంత నేతు లెవరూ తింటం లేదు అమ్మమ్మా. ధరల మాటటుంచి ముందంతంత నెయ్యి తింటే కొలెస్టరాల్ పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు.
పార్వతమ్మ--ఇప్పటికీ మీ తాతగారికి ముద్దపప్పూ, పేరిన నెయ్యీ లేకపోతే ముద్ద యెత్తరు.. ఆయనకేవీ? గుండులా లేరూ..
వైదేహి-- తాతయ్యంటే మరి నీ హీరో కదా .. నీకలాగే అనిపిస్తార్లే..
పార్వతమ్మ-- చాల్లే ఊరుకో.. అవునే అమ్మాయ్, మన రవిని రమ్మని రాసావా లేదా?
వసుంధర-- రవెందుకమ్మా?
పార్వతమ్మ--అదేవిటే.. బావగారు పండక్కి వస్తుంటే బావమరిది లేకపోతే ఎలా? పేకాడాలన్నా, ఫ్రెండ్సిళ్ళకీ, సినిమాలకీ వెళ్ళాలన్నా బావమరిది లేకపోతే ఎలా?
వైదేహి-- ఆ రోజులు పోయాయ్ అమ్మమ్మా. ఇప్పుడు బావమరిదితో పనిలేదు. అన్నీ భార్యే.. కదే అక్కా..
పార్వతమ్మ-- ఏవోనమ్మా.. సునందా, మరీ మీ అత్తగారూ, మామగారూ ఎప్పుడొస్తారూ?
సునంద-- వాళ్ళెందుకు?
మాలతి-- అయ్యో, అదంతా అదివరకు రోజుల్లో పిన్నిగారూ. ఒక పెళ్ళి జరిగిందంటే ఆ కుటుంబమూ, ఈ కుటుంబమూ కలిసిపోయేవి. మంచికీ, చెడ్డకీ ఒకరికొకరుగా ఉండేవారు. మరి ఈ రోజుల్లోనో.. మొగుడూ పెళ్ళాలకి మరొకరి పొడే కిట్టదు.
ఎంతసేపూ వాళ్ళిద్దరే.
పార్వతమ్మా-- ఏంటో.. ఏం మారినా ఈ ఇచ్చిపుచ్చుకోడాలు పోలేదు కదా. అమ్మాయీ, ఈ రోజుల్ని బట్టి సునంద మొగుడికి కలర్ టీవీ కొనివ్వండే.. చెప్పుకుందుకూ దర్జాగా ఉంటుంది.
మాలతి-- కలర్ టీవీ ఈపాటికి కొనేసుకునే ఉంటారండీ వదినగారూ. నా మాట విని విసిఆర్ కొనిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
వసుంధర--పోనీ ఓ పని చేస్తే..స్కూటర్ కొంటే ఎలా ఉంటుందంటారు? చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఇద్దరూ సినిమాల కెళ్ళడానికి బాగుంటుంది.
వైదేహి-- చాలా.. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉట్టినే ఇస్తే పుచ్చుకునేందుకేం? అన్నీ కొనివ్వండి.
సునంద-- అబ్బబ్బబ్బ.. ఉండండే..ఏదో లెటర్ వచ్చింది చూణ్ణివ్వండి..
పార్వతమ్మ-- ఎవరే ఉత్తరం? మీ ఆయనేనా? ఏం కావాలన్నాడూ? టీవీనే కదూ?
మాలతి-- కాదు. వీడియో అయ్యుంటుంది. కదూ సునందా?
వసుంధర-- అతని కామాత్రం తెలీదేంటీ.. స్కూటర్ కే ఓటు వేసుంటాడు.
వైదేహి-- ఎంతైనా బావగారు గ్రేట్. పండక్కి మనందర్నీ అక్కడికే రమ్మనుంటారు. నాకు తెలుసు. కదే అక్కా..
సునంద-- అయ్యాయా మీ ఊహాగానాలు. ఆయన నన్ను వెంటనే బయల్దేరి రమ్మన్నారు.
అందరూ-- అదేంటి?
పార్వతమ్మ-- పండక్కి మీ ఆయనిక్కడికి రాడూ?
సునంద-- అనుకోకుండా ఆయనకి వారం రోజులు సెలవు దొరికిందిట. అందుకని సౌత్ టూర్ వెడదామని రమ్మన్నారు. రిజర్వేషన్స్ అన్నీ అయిపోయాయిట. సెలవులు, పండగలు అన్నీ అక్కడే గడిపేసి అలా వెళ్ళి ద్యూటీ లో జాయిన్ అయిపోడమే. అమ్మా, నా సూట్ కేస్ ఏదీ?
అంతే కాదు. బోనస్ వచ్చిందట. పెద్దవాళ్ళు కదా, అమ్మకీ, నాన్నకీ బట్టలు కొనమని వెయ్యిరూపాయలు డ్రాఫ్ట్ పంపించారు.
అందరూ-- నిజవే...
సునంద-- ఆ... నిజవే..
వైదేహి-- ఇదిగో.. నే చెప్పలా? బావగారూ ఈజ్ గ్రేట్.౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮౮

13 వ్యాఖ్యలు:

'Padmarpita' said...

పండగ కోలాహలం అంతా మీ టపాలో కనపడింది...బాగుందండి!

మాలా కుమార్ said...

పండుగ బాగా జరుపుకుంటున్నరన్న మాట . బాగుంది . మరి పండుగ కు మీకే బహుమతి దొరికిందేమిటి ?

జయ said...

మీ పండగ ముచ్చట్లు భలే బాగున్నాయండి. మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

శ్రీలలిత said...

పద్మార్పితగారూ, మాలాకుమార్ గారూ, జయగారూ ధన్యవాదాలు.
మరి పండక్కి రెండు వారాల ముందైనా ఏర్పాట్లు చేసుకోవాలి కదండీ..

SRRao said...

శ్రీలలిత గారూ !
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

SRRao
sirakadambam

sreenika said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.
పండగ ముచ్చట్లు చాలా బాగున్నాయి.

Anonymous said...

బావుందండీ సందడి . నాటకం నాటకం లాగే వుంది . అంటే నిజంగా అయితే ఏ అల్లుడూ ఇలాంటి ఫ్రీ గిఫ్ట్ ఒచ్చే చాన్స్ ఒదులుకోడుకదా !
ఇంతకీ నాటకంలో మీ పాత్ర ఎక్కడా ?

శ్రీలలిత said...

SRRaogaru,
Happy Newyear..

శ్రీలలిత said...

శ్రీనికా, లలితా
ధన్యవాదాలు..
లలితగారూ, రచనా, నిర్వహణా నాదేనండీ.. మరి మిగిలిన స్నేహితులకి కూడా ఛేన్స్ ఇవ్వాలికదా.. అందుకని..

భావన said...

బాగుందండీ నాటకం. ఏమిటీ మా మీద కాసిన్ని సెటైర్ లు కూడా పడ్డాయి. :-(

శ్రీలలిత said...

ధన్యవాదాలు. ఇప్పుడంత లేదు కానండీ, భావనా, ఈ నాటిక రాసే సమయానికి అంటే పదేళ్ళక్రితం అమెరికా నుంచి వచ్చే వారి మీద అడ్మిరేషనూ ఉండేది, సెటైర్లూ వేసేవారు. ఆ టైమ్ లో రాసింది కదా..అయినా మీరు మా మీద మేము మీ మీద సెటైర్లు వేసుకోపోతే లైఫ్ బొత్తిగా డల్ అయిపోదూ...

శ్రీలలిత said...

ధన్యవాదాలు. ఇప్పుడంత లేదు కానండీ, భావనా, ఈ నాటిక రాసే సమయానికి అంటే పదేళ్ళక్రితం అమెరికా నుంచి వచ్చే వారి మీద అడ్మిరేషనూ ఉండేది, సెటైర్లూ వేసేవారు. ఆ టైమ్ లో రాసింది కదా..అయినా మీరు మా మీద మేము మీ మీద సెటైర్లు వేసుకోపోతే లైఫ్ బొత్తిగా డల్ అయిపోదూ...