Pages

Saturday, July 17, 2010

"రోజూ పూచే రోజా పూలే





"రోజూ పూచే రోజా పూలే
ఒలికించినవీ నవరాగాలే.."
అందంగా విచ్చుకున్న రంగురంగుల గులాబీలను చూస్తుంటే నాకు వెంటనే ఈ పాట గుర్తు వచ్చింది.
ఆణిముత్యం లాంటి సినిమా "మాంగల్యబలం" లోని దీ పాట.
"తెలియని ఆనందం...నాలో కలిగినదీ ఉదయం.." అంటూ మొదలవుతుందీ పాట.
నిజమే కదా..
ఉదయాన్నే లేచి పచ్చని ప్రకృతిలో విరిసిన పూబాలలని చూస్తుంటే కలిగే తృప్తీ, అనందం పంచభక్ష్యపరమాన్నాలూ మన ముందు పెట్టినా మనకు కలగదు. అంటే మనిషి మీద మనసు ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో తెలుస్తుంది.
మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే...
మన మూడ్ కనక బాగుంటే మనకి ఇష్టంలేనివారితో కలిసి వెళ్ళినాసరే, అర్ధం పర్ధం లేని పిచ్చి సినిమా అయినా సరే ఎంతో బాగుంటుంది.
అదే మన మూడ్ బాగులేనప్పుడు ఎంత మనకి బాగా కావలసినవాళ్ళతో వెళ్ళిచూసినా, ఆ సినిమా ఎంతటి కళాఖండమయినా సరే మనకి కావలసిన అనుభూతి నివ్వదు.
ఈ మనసనేది వుంది చూసారూ.. కోతి లాంటిది.
అసలే కోతి... అందులో కల్లు తాగింది... అపై ముల్లు గుచ్చుకుంది అన్నట్టు..ఈ కోతిలాంటి మనస్సు అప్పుడప్పుడు మైకంలో పడుతుంది.
కల్లు తాగిన కోతి కాలిలో ముల్లు గుచ్చుకున్నపుడు ఎన్ని పిచ్చిగంతులు వేస్తుందో చూడాలే కాని చెప్పడానికి రాదు. అలాగే పిచ్చిగంతులు వేసే ఈ మనసుని అదుపులో పెట్టుకోవాలంటే యేం చెయ్యాలి?
ఇదివరకు వీధుల్లో కొంతమంది వచ్చి కోతినాడించేవారు. వాళ్ళు ఆ కోతికి ఎంచక్కటి శిక్షణ నిచ్చేవారు. దానిని ఒక తాడుతో కట్టి ఆ తాడుని ఆ కోతి నాడించేవాడు చేత్తో పట్టుకునేవాడు. వాడు పిల్లిమొగ్గలు వెయ్యమంటే ఎంచక్కా వేసేది. ఒక గిన్నెలాంటిది దాని నెత్తి మీద పెట్టి, "అత్తింటి కుండ నీళ్ళు తే.."అంటే ఢామ్మని కింద పడేసేది.
అదే గిన్నె మళ్ళీ నెత్తి మీద పెట్టి, "పుట్టింటి కుండ నీళ్ళు తే.." అంటే ఎంతో జాగ్రత్తగా తెచ్చేది.
అటువంటిదే ఈ మనసు కూడా. తాడేసి కట్టేసి దానిని జాగ్రత్తగా మన కట్టడిలో వుంచుకోవాలి. చెడు భావనలను దరి చేరనీకుండా మంచి ఆలోచనలనే స్వాగతించాలి. (అంటే అత్తింటివైపున్నవన్నీ చెడు భావనలా అనకండి. ఉదాహరణ కోసం చెప్పానంతే).

మంచి, చెడు అంటే యేమిటో వివరించి చెప్పనక్కర్లేదనుకుంటాను. ఇక్కడ మనం మంచి అంటే ధర్మం అనే అర్ధంలో తీసుకుంటే, "ధర్మ మంటే యేమిటి?"అని యక్షుడడిగిన ప్రశ్నకు ధర్మరాజు చెప్పిన సమాధానం
"ఎదుటివాడు ఎటువంటి పని చేస్తే నువ్వు బాధ పడతావో అటువంటి పని నువ్వు యెదుటివానిపట్ల చెయ్యకుండా వుండడమే ధర్మమంటే.." అన్న ధర్మరాజు సమాధానం అందరికీ తెలిసే వుంటుంది.

అలాగ యెదుటివారికి హాని కలిగించనిదీ, మనకు సంతోషాన్నిచ్చేదీ అయిన ప్రకృతి లోని అందాలను ఆశ్వాదించడంలో వున్న ఆహ్లాదాన్ని ఈ పాట వింటూ అందరం అనుభవిద్దాం...





*********************************************************

4 వ్యాఖ్యలు:

జయ said...

చాలా చక్కటి పాట...ఎంత చక్కని వివరణో...ఎంతో ఆస్వాదించినా తీరని ఆనందం... ఎదుట నిలిచిన ఈ విందులు. ఈ తెలియని ఆనందం!!!

శ్రీలలిత said...

అవునండీ.. ఆ పాట ఎంత బాగుంటుందో..
మా అమ్మాయి ఇంటి చుట్టూ రంగురంగుల గులాబీలే.. ప్రొద్దున్నే లేచి చూస్తే అలా అనిపించి రాసేసాను..

పరిమళం said...

మంచిపాట! చూసే అవకాశం కల్పించినందుకు మీకు థాంక్స్ ! అసలు సావిత్రిగారిని చూస్తె నన్ను నేనే మరిచిపోతాను :)

శ్రీలలిత said...

పరిమళగారూ,
నిజమంతె కదండీ..
ఆ మహానటి కనుబొమల కదలికలో,
పెదవి విరుపులో
ఒలికించే భావాలు
మాటల్లో చెప్పతరమా..