Pages

Wednesday, September 8, 2010

ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్?



ఉద్యోగం చేసే ఆడవారిని మినహాయించి, ఇంట్లో వుండే గృహిణుల అభిప్రాయం ఇలావుంది..
ఆడవారు ఇంట్లో చేసే పనికి గుర్తింపూ, ఆదాయమూ లేకపోవడం వల్లనే మగవారికి వారు చేసే పనుల మీద సరియైన అవగాహన లేదని వారు అనుకుంటున్నారు.
మరి ఆ గుర్తింపు రావాలంటే ఆడవారు ఏం చెయ్యాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.
అసలు మన పెద్దవాళ్ళూ బైటపని, ఇంట్లో పని అని పనిని భాగించి, బైటపని మగవారికి, ఇంట్లో పని ఆడవారికి అప్పచెప్పారు. కాని ఇంట్లో పనికి విలువ లేకుండా పోవడం వలన ఆడవారు బాధపడుతున్నారు. చెయ్యడమూ తప్పటంలేదు, గుర్తింపూ లేదని విలవిల్లాడుతున్నారు.
మగవాళ్ళు చాలా తెలివైనవాళ్ళు వాళ్ళకి బైట తిరిగే అవకాశం వుండడం వల్ల ఎదుటి మనిషిని బట్టి నడుచుకునే నేర్పు వుంటుంది. ఆడవారికి ఆ అవకాశం తక్కువ.
ఈకాలంలో ఆడపిల్లలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఈ భావన మటుకు మారలేదు..
నాన్న, అమ్మ,అన్నయ్యలు ఎంతో అపురూపంగా కావలసినవి చూసుకుంటూండేవారు కనుక అందరూ అలాగే వుంటారు అనుకుంటారు. దానికి తోడు మొగుడితో పంపించేటప్పుడు, "అతను చెప్పినట్టు వినమ్మా.." అని ఒకటికి పదిసార్లు చెప్పి పంపుతారు. అందుకని ఆయనగారు ఎప్పుడేం చెపుతారా, చేసేద్దాం అనే ధోరణిలో వుంటూంటారు.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి.
ఇంట్లో ఇల్లాలు చేసే పని, చేస్తే చేసినట్టు కనిపించదు. చెయ్యకపోతే రోజు గడవదు.
ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితి అన్నమాట
దానిని బట్టి పని చెయ్యాలో వద్దో తేల్చుకోవలసింది మనమే.
నాకు ఒక మంచి ఫ్రెండ్ వుంది లెండి. ఆమె ఏదైనా చెప్పడం మొదలుపెట్టిందంటే మన కళ్ళెదురుకుండా కట్టినట్టు చెప్పడమే కాకుండా ఆ ఫీలింగ్స్ కూడా అంత బాగానూ చూపించేస్తుంది. ఇదే టాపిక్ మా మధ్య చర్చకు వచ్చింది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం.. ఇదిగో..ఇలా వుంది...

మన అమ్మలు, మామ్మలు చెప్పినట్టు మొగుడు ఇంటి కొచ్చేసరికి మనం నానా హైరాణా పడిపోయి,
ఇల్లంతా అద్దంలా మెరిసేలా ఒకటికి నాలుగు సార్లు తుడిచేసి,
తడిబట్టలు ఆరబెట్టి, మడిచేసి, లోపల పెట్టేసి,
వాళ్ళకి ఇష్టమైన టిఫిను కష్టపడి నేర్చుకుని చేసి, వాళ్ళు వచ్చేసరికి వేడిగా వుండేలా అమర్చి,
మనం ఆ కష్టానికి చెమటతో తడిసిపోయి చిరాగ్గా వున్నందుకు,
ఫ్రెష్ గా స్నానం చేసి,మంచి చీర కట్టుకుని,
చిరునవ్వుతో, కాఫీ కప్పుతో
అస్సలు ఎదురువెళ్ళకూడదన్నమాట.
ఎందుకంటే మనం అంత నవ్వుతూ ఎదురువెడితే "ఓహో.. వీళ్ళు ఇంట్లో చేసే పని ఇలా చీర నలక్కుండా, జుట్టు చెదరకుండా చెయ్యొచ్చ"న్న అభిప్రాయం వాళ్ళకి ఏర్పడిపోతుంది.
ఇహ మనం చెయ్యాల్సింది ఏమిటయ్యా అంటే…

వాళ్ళు వెళ్ళాక ఎలాగూ తడిబట్టలు మంచాల మీద పడేసి పోతారు కనుక, తియ్యకపోతే దుప్పట్లు తడిసిపోతాయి కనుక, అవిమటుకు తీసి, బైట ఆరేసేసుకోవాలి. వంటిల్లో యుధ్ధరంగంలా వుంటుంది కనుక పైపైన మూతలు తీసిన డబ్బాలకి మటుకు గట్టిగా మూతలు పెట్టుకోవాలి. మరింకేమీ ఆలోచించకుండా కళ్ళు మూసేసుకుని (కళ్ళు తెరిచి చూసి సర్దటం మొదలుపెడితే మనకి అక్కడే సాయంత్రం అయిపోతుంది) ఒక ప్లేట్లో మనం తినేందుకు ఏమైనా పెట్టుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయిపోయి మన కిష్టమైన సీరియల్ అయినా చూసుకోవచ్చు, పుస్తకమైనా చదువుకోవచ్చు, పాటలైనా వినొచ్చు. అలా మధ్యాహ్నం ఏ చుట్టాలకో, స్నేహితులకో ఫోన్ చేసి కబుర్లు చెప్పుకోవచ్చు.(ఎందుకంటే మనం ఇలా చెయ్యకపోయినా అలాగే చేస్తామని మగవాళ్ళు అనుకుంటారు కనుక అలాగే చేసేస్తే సరి) అన్నీ అయ్యి మనకి మళ్ళీ ఏదైనా పని చేద్దామా అనే అలోచన వచ్చేవరకూ టైమ్ ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఇంక మరో అరగంటలో వాళ్ళు వస్తారనగా కాస్త పైపైన సొఫాలో దిళ్ళూ గట్రా సర్ది, సరిగ్గా వాళ్ళు వచ్చే టైముకి వంటింట్లో మహా హడావిడిగా ఏదేదో చేసేస్తున్నట్టు కనిపించాలి. తలుపు తీసేటప్పుడు మొహం మహా అలసటగా పెట్టాలి.
మరింక సంభాషణ ఇదిగో ఇలా వుండాలి..
సీతాపతి.."ఇంటి కొచ్చేటప్పటికి అలా వూసురోమంటూ వుంటావెందుకు?
సీత...."ఉఫ్...అబ్బా.. ఇవాళంతా ఎంత గొడవైపోయిందో తెలుసాండీ..."(ఏ దొంగో వచ్చాడన్నంత బిల్డ్ అప్ ఇవ్వాలన్న మాట)
సీతాపతి(ఉత్కంఠతో..).."ఏమైంది?"
సీత..మీరు మొన్న టివీలో చూపించిన టిఫిన్ బాగుందన్నారు కదా అని మీరు వచ్చేటప్పటికి అది చేద్దామని పప్పు నానబోద్దామని వెళ్ళానా..
సీతాపతి.."ఊఊ"
సీత..తీరా చూస్తే ఆ డబ్బా పై అరలో వుందీ...
సీతాపతి..అయితే,,
సీత..సరే, స్టూల్ మీద ఎక్కి తీద్దామనుకుంటుంటే..
సీతాపతి..(ఆతృతగా)..కొంపతీసి పడిపోయావా యేంటి?
సీత...అబ్బే.. స్టూల్ కోసం వెడుతుంటే ఫోన్ వచ్చింది..చేసిందెవరో తెలుసా..
సీతాపతి..ఎవరూ?
సీత..మీ చుట్టాలమ్మాయే వనజండీ..
సీతాపతి..వనజెవరు?
సీత..అదేనండీ.. మన పెళ్ళిలో మీకు కాఫీ తెచ్చిచ్చిందీ..
సీతాపతి..**********
సీత...అదేనండీ.. పంచదార చాలా..అనడిగిందీ..
సీతాపతి.. సరిలే.. ఇంతకీ ఆవిడకి ఏవయ్యింది?
సీత.. ఆవిడకి ఏం కాలేదండీ.. ఈ వూరొచ్చిందిటా.. అందుకని ఫోన్ చేసింది.. రమ్మంటుంది.. వనస్థలిపురం.. ఎక్కడ వెళ్ళగలను చెప్పండి(గారంగా)
సీతాపతి..**********
సీత.. సరే ఇంక ఎలాగూ వెళ్లలేను కదాని ఫోన్ లోనే కాసేపు మాట్లాడుకున్నాం..
సీతాపతి..కాసేపంటే...
సీత.. మీది మరీ విడ్డూరవండీ... నేను మటుకు భోంచెయ్యొద్దూ....
సీతాపతి..అంటే..పొద్దుట్నించీ భోజనం టైమ్ వరకూ మాట్లాడుకున్నారా..
సీత..మీరు మరీనూ, అంత హాయి కూడానా నాకూ..ఇంతలో చాకలాడు మీ ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకొచ్చాడు..
(వాడి రామాయణం మరో పావుగంట... ఇలా వున్నవీ, లేనివీ కబుర్లు చెపుతూ, )
"ఇదిగో..ఇప్పుడేనండి పప్పు నానబోద్దామని, స్టూల్ కోసం వెడుతున్నా"
ఇంక ఆ మహారాజుకి నీరసం వచ్చేసి,
..ఇంకిప్పుడు టిఫిన్ ఎందుకులే.. ఏకంగా భోజనం చెసేద్దాం.. అంటాడు.
లేదూ.. పప్పు ఇప్పుడెక్కడ నానుతుంది కాని, కాస్త ఉప్మా చేసెయ్యి చాలు.. అంటాడు.
దీనివల్ల మనకి రెండురకాల లాభాలు..
ఒకటి..టిఫినో, వంటో ఏదో ఒక్కటే చెయ్యడం.
రెండోది.. ఆ ఉప్మా కూడా పధ్ధతిగా అన్ని కూరలూ తరిగి, బఠానీలు వలిచి, చేసేదిలా కాకుండా ఏదో పెళ్ళివారి ఉప్మా లాగ కలియబెట్టెయ్యడం.
ఆ కలియబెట్టే ఉప్మా కూడా ఎంతో కష్టపడిపోతున్నట్టు పోపు వేయించినంతసేపూ ఉస్సురుస్సురంటూనూ,
వేడిది కలియబెడుతున్నప్పుడు నిమిషానికోసారి అరిచేతులు ఊదుకుంటూను,
ఆఖరికి ఆ గిన్నె తెచ్చి డైనింగ్ టేబిల్ మీద పెడుతున్నప్పుడు కూడా అతని సహాయం తీసుకోవాలి.. అదెలాగంటే ఇలా...
సీత... "ఏవండీ... అయ్యో మర్చిపోయాను, వేడి గిన్నె తెచ్చేసాను.. కాస్త ఆకింద పెట్టే మేట్ తెద్దురూ.." అంటూ వేడి గిన్నె పట్టుకున్నప్పటి అవస్థలన్నీ చూపించాలన్నమాట.
ఆఖరిగా మా ఫ్రెండ్ చెప్పింది ఒక్కటే..
మగవాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి.
అందులో ముఖ్యమైంది ..
పని చెయ్యడం కాదు..
పని చేస్తున్నట్టు కనిపించడం...
అందుకని
"నువ్వు పని చెయ్యడం ముఖ్యం కాదు, పని చేసినట్టు కనపడడం ముఖ్యం.."
అంటూ ఇంకా చాలా చెప్పింది.

ఇటువంటి విషయాల్లో ఎవరికైనా సందేహాలుంటే సంప్రదించవచ్చు..

(ఫొటో లోని గృహిణికి కృతఙ్ఞతలతో..)


*******************************************************************

23 వ్యాఖ్యలు:

భావన said...

శ్రీలలిత గారు, ఏమి సలహా.. ఏమి సలహా ఒక వెయ్యి వరహాలు ఇచ్చెయ్యొచ్చు ఆ సలహాకు. ;-) హ హ హ వూహించుకుని వూహించుకుని నవ్వుకున్నా ఆ సీన్ నేను.

సుజాత వేల్పూరి said...

నువ్వు పని చెయ్యడం ముఖ్యం కాదు, పని చేసినట్టు కనపడడం ముఖ్యం.."

హబ్బ, ఇది నాకెవరూ చెప్పారు కారండీ మొదట్లో! మీ ఫ్రెండ్ ఎంత మంచిదో!

మేధ said...

మీ ఐడియా సూపరో సూపరు.. :))

నీహారిక said...

లలిత గారూ,
ఈ ఐడియా బాగానే ఉంది కానీ, ఇల్లు నీట్ గా ఉంచుకోకపోతె నిద్ర పట్టని వారేం చేయాలో సలహా చెప్పండి.

కృష్ణప్రియ said...

:-) :-) బాగుంది

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

>>>>ఇల్లు నీట్ గా ఉంచుకోకపోతె నిద్ర పట్టని వారేం చేయాలో సలహా చెప్పండి.

నిద్రమాతర్లు వేసుకొని ఇల్లు ఊడవండి

జ్యోతి said...

శ్రీలలితగారు,
మీరు చెప్పిన సలహా నాకు ఎవరూ చెప్పలేదండి. పెళ్లయ్యాక అత్తారింట్లో నోరెత్తకుండా అందరికి అన్నీ అమర్చాలి,ఎవరిని నొప్పించరాదు అనే నీతిసూత్రాలు చెప్పారు. నేను అలాగే ఫాలో అయ్యాను. ఐనా మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ చిట్కాలు పెళ్లయిన కొత్తలో పనిచేస్తాయి తప్ప తర్వాత కాదు. మగవాళ్లు కూడా మనకంటే జగత్ జెంత్రీలు.. :)))

శ్రీలలిత said...

భావనగారూ,
నవ్వుతో సరిపెట్టేయకండీ..మీ వెయ్యివరహాలకోసం ఎదురుచూస్తుంటా....

శ్రీలలిత said...

సుజాతగారూ,
ఇవన్నీ ఆ అధ్యాయాలయిపోయాక తెలుస్తాయండీ.. ఇప్పుడు నాకూ ఉపకరించదు.
కొత్తగా పెళ్ళైన వారికేమయినా పనికొస్తుందేమోనని రాసానంతే..

శ్రీలలిత said...

మేధగారూ,
ధన్యవాదాలండీ..

శ్రీలలిత said...

నీహారికగారూ,
ఇంక అలాంటివారిని ఆ భగవంతుడే రక్షించాలి. అన్నీ పూసుకుని చేసేసుకుంటుంటే ఎంతకని తెమిలేది. అంటీ ముట్టనట్టు వుండాలంతే..
(మనల్ని ఇలా ఇమోషనల్ బ్లేక్ మెయిల్ చెయ్యాలనే పెద్దవాళ్ళు "ఇంటిని చూసి ఇల్లాలిని చూడు" లాంటి సామెతలు తెచ్చారు. అది పట్టుకుని మనం తెగ ఫీల్ అయిపోయి పని చేసేసుకుంటాం.)

శ్రీలలిత said...

కిష్ణప్రియగారూ,
ధన్యవాదాలండీ...

శ్రీలలిత said...

బ్లాగ్ చిచ్చుగారూ,
మీ సలహా పాటించడం కొంచెం కష్టమేమో...

శ్రీలలిత said...

జ్యోతిగారూ,
మీరన్నది అక్షరాలా నిజం. ఇవన్నీ పెళ్ళైన కొత్తలోనే తెలుసుకోవాలి. అప్పుడేమో పెద్దవాళ్ళు చెప్పినట్టు "పతియే ప్రత్యక్షదైవం", "ఇల్లే కైలాసం" అనే భావనలో ములిగిపోయుంటాం. తేరుకుని కళ్ళు తెరిచేసరికి పుణ్యకాలం కాస్తా దాటిపోతుంది. పోనీలెండి. మనకి కాకపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడొచ్చుగా..(వాళ్ళు కూడా మత్తులో ములిగిపోకుండా వుంటే..)

జయ said...

శ్రీలలిత గారు, భలే ఉంది. ఏది ఏమైనా నేను మాత్రం బాగా ఎంజాయ్ చేసాను. వీలు చూసుకొని ఎవరైనా అనుసరించవచ్చనుకుంటా.

బ్లాగాగ్ని said...

http://blogaagni.blogspot.com/2010/09/blog-post_09.html

:) :) :)

భాస్కర రామిరెడ్డి said...

శ్రీలలిత గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

హారం

పరిమళం said...

"నువ్వు పని చెయ్యడం ముఖ్యం కాదు, పని చేసినట్టు కనపడడం ముఖ్యం.." :) :)

మాలా కుమార్ said...

దసరా శుభాకాంక్షలు .

Anonymous said...

:)) బాగా చెప్పేరండీ.

శ్రీలలిత said...

మాలతిగారూ,
మీరు నా టపాకి కామెంట్ పెట్టడం నాకు చాలా సంతోషంగా వుందండీ. ధన్యవాదాలు..

Unknown said...

Cool mom!