Pages

Tuesday, February 1, 2011

మాయదారి వీడియో

మాయదారి వీడియో
-జి.ఎస్.లక్ష్మి
January 25th, 2011


ఈ జనవరి 25 న ఆంధ్రభూమి డైలీ పేపర్ లో పడిన నా ఆర్టికిల్ ...చదివి మీ అభిప్రాయాలు చెపుతారుకదూ...
http://www.andhrabhoomi.net/priyadarshini/mayadari-948




ఉదయాన్నే మంచి పనిలో ఉన్నాను. ఇంతలో ఫోను. ఎవరా అని తీస్తే సుందరి. మాట
మొదలెడుతూనే నిష్ఠూరాలతో మొదలెట్టింది.
‘‘ఇంత మంచి ఫ్రెండ్వి. ఇలా చేస్తావనుకోలేదే’’ అంటూ.
‘‘ఏం చేసేనే?’’
‘‘మా అమ్మాయి పెళ్ళికెందుకు రాలేదు?’’
ఒక్కసారిగా నామీద పడిన అభాండానికి తట్టుకోలేకపోయాను.
‘‘రాకపోవడమేంటే నువ్వు బిజీగా వున్నావ్. బహుశాః మేమొచ్చినట్టు గుర్తులేదేమో!’’
‘‘నీ మొహం నేనప్పుడు బిజీగా ఉన్నా తర్వాత వీడియోలోనైనా కనిపించాలిగా. వీడియో మొత్తంమీద అసలెక్కడా నువ్వు కనిపించందే’’.
తెల్లబోవడం నా వంతయింది. మరి సాక్ష్యం లేనప్పుడు నేనేమని మాట్లాడను.

ఈ అనుభవం దృష్టిలో ఉంచుకుని రేపు పెళ్లిలో మటుకు అలాంటి పొరపాటు చెయ్యకూడదనుకున్నాను. అసలే అత్తవారివైపు బంధువులు, నా అటెండెన్స్ మరీ ముఖ్యం.
మర్నాడు పెళ్లికి వెళ్లాం. సుందరి చెప్పిన మాటలు బాగా గుర్తు పెట్టుకున్నాను. రాత్రి డిన్నర్ అయ్యాక పెళ్లి. ఆదివారం కూడా అవడంతో పెళ్లికి చాలామందే వచ్చారు. ఆడపెళ్లి వారిదీ, మగపెళ్లివారిదీ, పిల్లా, పిల్లాడిదీ అందరి ఉద్యోగాలూ అదే ఊరు అవడంతో అందరి స్నేహితులూ వచ్చారు. వాళ్ళూ కాక చుట్టాలు. హాలంతా కిటికిటలాడిపోతోంది.
సుముహూర్తం అవగానే అక్షింతలు వేద్దామని క్యూలో నిలబడ్డాను.
మాయదారి క్యూ. తిరుపతి క్యూని మించిపోయినట్టుంది. అదేమిటో అరగంటైనా అంగుళం కూడా జరగటం లేదు. మెడ బాగా వంచి స్టేజ్వైపు చూసాను. ఒక్కొక్కళ్లూ స్టేజ్ ఎక్కి, అక్షింతలు వేసి, తెచ్చిన గిఫ్ట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఎంత టైమ్ తీసుకుంటుందో.. తర్వాత ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు పెళ్ళివారి పక్కన నిలబడి వీడియో తీయించుకోవడానికి అంత టైమ్ పడుతోంది.
నాకు నీరసం వచ్చేసింది. కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఈ క్యూ ఎప్పటికి తెముల్తుందో. తర్వాత నా టైమ్ వచ్చేసరికి సరిగ్గా వీడియోలో పడతానో, పడనో, పడకపోతే రేప్పొద్దున్న నేను పెళ్ళికి వచ్చినట్టు సాక్ష్యం ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో.. ఇంతా వీడియోలూ, గొడవలూ అయ్యాక డిన్నర్ దగ్గరికి వెడితే అక్కడ కనీసం నిలబడి ఏమైనా తినడానికైనా చోటుందో.. వుండదో..!
‘‘హే భగవాన్’’ ఒక్కసారి నిట్టూర్చాను.
ఈలోపల పక్కనుంచి మావారి చిరాకోటీ...
‘‘ఇప్పుడు ఇంత రష్లో స్టేజ్ ఎక్కి ఆ గిఫ్ట్ ఇవ్వకపోతేనేం. ఆ కిందున్న వాళ్ళ చేతిలో పెట్టేద్దాం. మళ్లీ డిన్నర్ దగ్గర లేట్ అయితే ఇంటికెళ్ళడం కష్టం’’ అంటూ చెవిలో జోరీగలా సణుగుడు.
మళ్లీ మెడవంచి ఇంకా ఎంతమందున్నారా అని చూసాను. అబ్బో ఇంకా చాలామందే ఉన్నారు. ఆ లెక్కన మావంతు వచ్చేసరికి మరో అరగంట పైగా పట్టొచ్చు. ఇదేమైనా వేరే క్యూ అయితే ఏదో రకంగా మధ్యలో దూరిపోదును. కాని బొత్తిగా పెళ్ళివారంటే మర్యాద చూపించే చోటాయె.
అక్కడికీ స్టేజ్కి దగ్గరగా ఎవరున్నారా అని చూస్తే …అరె మా వర్ధనొదినే వుంది.
ఇంకనేం.. ఇదీ బాగానే వుందనుకుంటూ చటుక్కున మావారి చెయ్యి పట్టుకుని, చరచరా వర్ధనొదిన పక్కకెళ్లి నిలబడిపోయి ‘‘బాగున్నావా వదినా? రామిగాడొచ్చాడా సెలవులకి’’.
అంటూ మాట కలిపేసి తనతో మాట్లాడుతూ తనతోపాటే స్టేజ్ ఎక్కేసి అక్షింతలేసేసి, గిఫ్ట్ ఇచ్చేసి, వీడియోలో పడిపోయి, ‘‘అమ్మయ్య’’ అంటూ ఊపిరి పీల్చుకుని బైట పడ్డాను.
నా తెలివికి నన్ను నేను ఎంతగా అభినందించుకున్నానో రెండు రోజుల వరకూ.. కాని రెండురోజులయ్యాక ఆ పెళ్లికూతురి తల్లి ఫోన్ చేసి అంటుంది కదా...
‘‘అయినా మీరిలా చేస్తారనుకోలేదండి. అవతల మగపెళ్లివారు వెయిట్ చేస్తుంటే మీరు చటుక్కున అలా దూరిపోడం. వాళ్ళు చూసి అలా మధ్యలో దూరిపోయింది ఎవరండీ అని అడగడం. మీరు మాకు బంధువులే అని చెప్పుకోవడం అబ్బబ్బా.. సిగ్గుతో చచ్చిపోయినంత పనయ్యిందంటే నమ్మండి.’’ అంటూ ఆవిడ చెప్పిన దెప్పుళ్ళకి తెల్లబోయాను.
అయినా దబాయింపుగా ‘‘నేను మధ్యలో దూరినట్టు ఎవరు చూసారండీ?’’ అనడిగాను.
‘‘అయ్యో... వీడియోలో అంత స్పష్టంగా కనిపిస్తేనూ’’ అంటూ ఆవిడ సాగదీస్తుంటే
‘‘ఈ మాయదారి వీడియో బంగారంగానూ’’ అనుకుంటూ ఈ వీడియో తతంగానికి గింజుకున్నాను.
(ఆంధ్రభూమివారి సౌజన్యంతో...)

2 వ్యాఖ్యలు:

Indian Minerva said...

:). మీ పోష్టు బాగుంది. పెళ్ళీ తంతుని కవర్ చేయడం మీద నాకేమీ కంప్లైంట్‌లు లేవుగానీ... భోజనాలను, చదివింపులనూ కూడా వీడియో తీయడం మాత్రం మన చీప్ మనస్తత్వాలను బైటపెడుతుంది.

cbrao said...

వీడియో తో చిక్కేనండి మరి. మీ వారు చెప్పినట్లు, అరగంట తరువాత (ఈ లోపు మీ భోజనం కూడా అయిపోతుంది) క్యూ పెద్దగా ఉండదు. అప్పుడు ఇలా మధ్యలో దూరాల్సిన అవసరం కూడా రాదు. నింపాదిగా వధూ వరులతో కబుర్లు కూడా చెప్పవచ్చు.