
సత్యాగ్రహం రోజుల్లో సత్యాగ్రహం కోసమై మహాత్ముని పిలుపునందుకుని ప్రతి ఊరులోను కాంగ్రెసువారు ప్రత్యేకంగా కొంతమంది వాలంటీర్లకు శిక్షణనిచ్చేవారు. వారి పేర్లను నమోదు చేసుకొని, వరుసగా వారికి సత్యాగ్రహం చేయడానికి అవకాశం ఇచ్చేవారు. నూటనలుబది నాల్గవ సెక్షను ధిక్కరించడమనేది సత్యాగ్రహంలో ఒక భాగం. రోజూ ఉదయం పదిగంటలకు కాకినాడలోని మసీదు సెంటరుకు ఐదుగురు వాలంటీర్లు "వందేమాతరం మహాత్మాగాంధీకీ జై !" అంటూ నినాదాలు చేస్తూ వచ్చేవారు. నలుగురికన్న ఎక్కువమంది ఒకచోట సమావేశం కాకూడదనే ఆర్డరును ధిక్కరించేవారు. అప్పటికి అక్కడ సిధ్ధంగా ఉన్న పదిపన్నెండుమంది పోలీసు సిబ్బందీ వాలంటీర్లు సెంటరులోనికి రాగానే తమ లాఠీలతో వారిని కొట్టడం మొదలుపెట్టేవారు. ఆ వాలంటీర్ల శిక్షణ ఎలాంటిదంటే, లాఠీదెబ్బలు వర్షంలా శరీరంపై పడుతున్నప్పటికీ తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. చెయ్యెత్తి ఆ దెబ్బలను వారించుకోకూడదు. అలా ఆ దెబ్బలను భరిస్తూ ఉండిపోవలసిందే. స్పృహ తప్పి క్రింద పడిపోయేవరకూ "వందేమాతరం" అంటూనే ఉండేవారు. స్పృహ కోల్పోయి రోడ్డుమీద పడిపోయినవారిని ఒక్కొక్కరినీ కాళ్ళు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకుపోయి ముఱికికాల్వ ప్రక్క పడేసేవారు.
ఆ వాలంటీర్లకు ప్రథమ చికిత్స చేసిన వారిని, మంచినీరు ఇచ్చేవారిని నిర్బంధించి జైలుశిక్ష వేసేవారు. ఆ విధంగా వారు రాత్రివరకూ పడి ఉన్నాక, అర్ధరాత్రి పోలీసులు ఆ స్థలం నుండి కదిలిపోయేక వాలంటీర్లు వచ్చి స్పృహలేనివారిని భుజాలపై వేసుకొని తీసుకొని వెళ్ళేవారు.
ఆ సంఘటన జరిగేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు పైనున్న జనం యావత్తూ రెండువైపులనున్న అరుగుల మీదకు పాఱిపోయి కండ్లవెంట నీరు కార్చేవారు. అటువంటి లాఠీచార్జికి గుఱిఅయి చనిపోయినవారు కొందరైతే, అవయవలోపంతో జీవితాంతం బాధపడ్డవారు చాలామంది.
ఈ రీతిగా లాఠీఛార్జికి గురయిన సత్యాగ్రహుల అవస్థ చూసి కూడా, మరునాడు ఉదయం 10 గంటలకు ఇంకొక అయిదుగురు వాలంటీర్లు శాసనోల్లంఘన చేయడానికి ఉద్యుక్తులై వచ్చేవారు. వారు కూడా అదే అవస్థననుభవించేవారు. ఆ రోజులలోని సత్యాగ్రహం, దేశభక్తి, ఉత్సాహం, త్యాగబుధ్ధి అలాంటిది. ఆ త్యాగమూర్తులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు కూడా చరిత్రకెక్కకుండా, సత్యాగ్రహసమరంలో ఆహుతి అయినవారు వేనకు వేలున్నారు.
ఎంతమంది నిస్స్వార్ధపరుల త్యాగఫలమో యీ స్వాతంత్ర్యం !
________________________________________________________________________