Pages

Friday, July 15, 2011

సరస్వతిశాపం

పిడపర్తి వారి వంశ చరిత్ర, ఆ వంశస్థుల యొక్క పాండిత్య ప్రతిభ అందరికీ తెలియాలనే ఉద్దేశ్యముతో మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు "పిడపర్తి వారు- --కథలూ-గాథలూ" అని ఒక పుస్తకం వ్రాసారు. అందులో ప్రచురించిన "సరస్వతిశాపం" అను ఈ కథ "ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలోను, ఆంగ్లానువాదం Andhra Pradesh journal లోను ప్రచురించబడింది.
సరస్వతీదేవిని దేవతగా పూజిస్తూ, శాస్త్రాధ్యయనాన్ని ఒక తపస్సుగా భావించి, స్వార్ధ మనేదే లేకుండా, అతి సాధారణ జీవితం జీవిస్తూ, ఆ శాస్త్రాన్ని తరతరాలుగా నిలబెట్టడానికి కృషి చేసిన ఇలాంటి మహా మనీషులుండబట్టే ఈ కాస్త విఙ్ఞానమైనా ఇప్పటికి మిగిలి ఉందనిపిస్తుంది ఈ కథ చదువుతుంటే. అందుకే అభిలాషగలవారికోసం దీనిని ఇక్కడ ఉంచుతున్నాను.

సరస్వతిశాపం

కొన్ని శతాబ్దాల నుండి ప్రస్తుత కాలం వరకూ జ్యోతిశ్శాస్త్రంలోని అన్ని శాఖలలోనూ అద్వితీయ పాండిత్యానికీ, అకుంఠిత ప్రఙ్ఞకూ ప్రసిధ్ధి చెంది అనేక సభల్లో అసమాన సన్మానాలను పొంది అఖండకీర్తి నార్జించినవారు పిడపర్తి వంశీయులు యీ ఆంధ్రదేశంలో. అట్టి వంశమందలి ఒక శాఖవారు రామచంద్రపురం తాలూకాలోని సోమేశ్వరం గ్రామంలో నున్నారు. ఆ శాఖకు చెందినవారే పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు. జాతక ప్రశ్న భాగాల్లో అద్వితీయ ప్రతిభాశాలి. అట్టి మహా పండితుడు తపశ్శాలి "నభూతో న భవిష్యతి" అన్న అతిశయోక్తికాదు.
సుమారు నూరు సంవత్సరాలకు పూర్వం ఒకనాటి ఉదయం సుబ్బయ్యశాస్త్రిగారు స్నాన సంధ్యాదనుష్ఠానాలను పూర్తి చేసుకుని వారి యింటి అరుగుపై కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటూ యఙ్ఞోపవీతాన్ని వడుకుతున్నారు. రెండవ అరుగు మీద కూర్చున్న వారి ప్రియశిష్యుడు శ్రీధర తాళపత్ర గ్రంథాన్ని చదువుతూ యేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అట్టి సమయంలో ఠాణేదారుగారూ ఆ ఊరి పెద్దలు కొందరూ లోనికి రావడం చూసి శాస్త్రిగారు కలవరంగా లేచి నిల్చున్నారు.
"నమస్కారమండీ శాస్త్రిగారూ! తమరు పెద్దలు, మమ్ములను మీరు గౌరవించడం న్యాయమా? దయచేయండీ" అంటూ ఠాణేదారుగారు శాస్త్రిగారిని కూర్చుండమని వారు కూడా అరుగు మీద కూర్చున్నారు. కూడా వచ్చినవారు రెండరుగులమీద సద్దుకుని కూర్చున్నారు.
శాస్త్రిగారు వారి రాకకు కారణం తెలియక "చిత్తం. తమరు వేంచేసిన కారణం?" అన్నారు నెమ్మదిగా.
"శాస్త్రిగారూ! మహారాజుగారి దగ్గరనుండి వార్తాహరుడు నిన్న వచ్చేడు. ప్రభువులు తమ దర్శనాన్ని కోరుతున్నారు. వారి కోట లోనికి ఒకసారి దయచేయమని మిమ్మల్ని ప్రార్ధించవలసినదిగా మమ్ము ఆదేశించారు. మీకు ప్రయాణానికి ఎప్పుడు అనువుగా ఉంటుందో చెబితే పాలకీ యేర్పాటు చేస్తాను."
శాస్త్రిగారికి అర్ధమయింది. మహారాజావారికి జ్యోతిశ్శాస్త్రంలో చాలా ఆసక్తి కలదని వారు విన్నారు. బహుశా యేదైనా జాతకం చూపడానికిగాని ఆహ్వానించి ఉంటారని అనుకున్నారు. కాని దివానుగారికి మాత్రం యీ శాస్త్రమన్న సగమెరుక. ఆయన యీ శాస్త్రాన్నీ యీ శాస్త్రఙ్ఞుల్నీ కూడా చాలా చిన్నచూపు చూడడమే కాకుండా ముఖస్థంగా కూడా దూషిస్తారని ప్రతీతి. కోటలోనికి పోయి తన విద్యను అక్కడ చూపడం శాస్త్రిగారికి ఇష్టంలేదు. సరస్వతికి తగిన గౌరవం జరగదని ఆయన అనుమానపడ్డారు. అందువలన ఆదినిష్ఠూరమే మేలనే సామెతగా వెళ్ళకుండా ఉండడానికే నిశ్చయించుకున్నారు.
"క్షమించాలి! నేను కోటలోనికి పోవడమేమిటి? మాబోంట్లు దర్బారులో అడుగు పెట్టడానికి తాహతు లేనివారం. మాకెందుకీ రాజసభా ప్రవేశాలు బాబూ! క్షమించవలసిందిగా మహారాజువారికి విన్నవించండి." అన్నారు శాస్త్రిగారు.
"శాస్త్రిగారూ! తమరు పొరబడుతున్నారు. మీరిక్కడ ఉండిపోయినంత మాత్రం చేత మీ పాండిత్యం, ప్రతిభ యిక్కడే ఉండిపోయాయనుకుంటున్నారా? దేశ దేశాలు పాకిపోయేయి. మీ ప్రతిభను విని, మీ విద్వత్తుకు ఆశ్చర్యపడి మీ దర్శనం చేసుకోవాలని ఉన్నట్లు ఆ మధ్య దర్బారులో ఒకసారి అందరి యెదుటా వారి కోరికను వెలిబుచ్చారు మహారాజావారు. ఇప్పుడు ప్రభువులకు మీ వలన సలహా యేదైనా కావలసి ఉండవచ్చు. అది నెరవేర్చడం మన విధికదా శాస్త్రిగారూ." అన్నారు ఠాణేదారుగారు.
"ఏమైనా ప్రభువులకు నా ప్రణతుల నందజేసి క్షమించవలసిందిగా కోరండి. "అన్నారు శాస్త్రిగారు.
ఠాణేదారుగారికి యేమనడానికి తోచలేదు.
"శాస్త్రిగారూ! మీ యీ నిరాకరణకు కారనం మేము తెలుసుకోవచ్చునా?" మృదువుగా ప్రశ్నించేరు.
“సరస్వతీదేవికి తగిన గౌరవం ఆ దర్బారులోజరుగబోదని నాకు తోస్తోంది. అది నేను సహించలేను" అన్నారు శాస్త్రిగారు.
ఠాణేదారుగారికి అర్ధమయింది. దివాన్జీ బిళ్ళగోచీ పండితుల్ని అగౌరవపరచడం తనకు తెలిసిన విషయమే. ఆ రాచఠీవి ఆ దర్పం దివాన్జీ కళ్ళకు పొరలు కప్పేయంటే అసత్యమేమీలేదు. ఆయన దర్శనార్ధమై వచ్చెడి ద్రవ్యాపేక్షగల పండితులనతడు యెట్లు కించపరచినా చెల్లేది. కాని తపస్సంపన్నులూ, శపించగల శక్తిమంతులూ అయిన శాస్త్రిగారిలాంటి పండితులను ఆయన యెరుగడు. శాస్త్రిగారి అనుమానానికి కూడా అవకాశమున్నట్లు తోచింది ఠాణేదారుగారికి. మారు చెప్పలేక కొంత తడవు అవనత శిరస్కుడై
"తమ చిత్తం. ఇం కొకసారి ఆలోచించండి" అంటూ లేచేరు. శాస్త్రిగారూ, పెద్దలూ కూడా లేచేరు.
వారు వెళ్ళిన తరువాత ధైర్యాన్ని చిక్కబట్టి శ్రీధర్ "అయ్యా! రాజాస్ఠానానికి పోవడం మనకు వద్దండి"అన్నాడు.
"ఏమిరా శ్రీధర్, ఎందువలన?"
"అయ్యా, ఆ దివానుగారు చాల చెడ్డవారని వాడుకండి. మొన్న మా మేనమామ అవధాన్లు మీరు యెరిగే ఉంటారు. వేదపఠనంలో అందెవేసిన చెయ్యిలెండి. అతడు ఘన చెబుతుంటే వినవలసిందేనండి. ఆయన దివాన్ గారి దర్శనానికి వెళ్ళేడు, మహారాజా వారి దగ్గర వార్షికం యేర్పాటు చేసుకుందామని. ఇంటివద్ద దివాన్జీని కలుసుకుని ఒక పనస అందుకునేసరికి ఆయన ఉగ్రుడై "ఏమీ ఈ వెధవ గొడవ? అవతలకు పొమ్మను" అని తాబేదారు వైపు తిరిగి అరిచేరుటండి. అల్లా ఉంటుందండి ఆయన ఆహ్వానం."
శాస్త్రిగారికి ముఖం కందగడ్డలా అయింది. విద్యకు ఎంత అపచారం జరిగిందోనని చాలా బాధపడ్డారు.
"శ్రీధర్! పాపం పండాలి నాయనా! అంతవరకూ యింతే" అన్నారు శాస్త్రిగారు.
శ్రీధర్ చదువులో పడ్డాడు.

2

"ఆ బిళ్ళగోచీ పండితునిక్కూడా యెంత అహంభావం ఉందో చూసేరా ప్రభూ!" అన్నారు దివానుగారు మహారాజావారితో.
దివానుగారికి శాస్త్రిగారి సమాధానం అందింది. అది మహారాజావారికి విన్నవిస్తూ యీ విధంగా అన్నారాయన.
"దివాన్జీ! శాస్త్రి గారిని సామాన్య పండితుడనుకుంటూన్నారా! ఆ జైమిని అవతారమే ఆయన"అన్నారు మహారాజావారు.
"సందేహమే లేదు ప్రభూ! ఊరూరా ఆయన ప్రతిభే వినపడుతోంది. జాతకభాగంలోనైతేనేం ప్రశ్నభాగంలోనైతేనేం ఆయన ప్రఙ్ఞ అమోఘం. నిజంగా పూర్వపు మహర్షుల కోవకు చెందిన వారాయన" అన్నారు కవిగారు.
"నాలుగు గీతలు గీయగలిగినవాడల్లా జాతకం చెబుతానని బయల్దేరే యీ రోజుల్లో ఆ విద్యకు తగిన గౌరవం లభించడం చాలా కష్టం"అన్నారు మహారాజావారు.
మహారాజావారికి శాస్త్రిగారియందున్న గౌరవ ప్రపత్తులు అసమానవైనవని గ్రహించేరు దివానుగారు. మౌనంగా కొంతసేపు ఊరుకున్నారు.
"ఆయన విద్యకు తగిన మర్యాద తప్పక లభిస్తుందని వారికి తెలియజేసి సగౌరవంగా వారినిక్కడకు తోడి తేవలసినదిగా ఠాణేదారుకు కబురుచేయండి." అన్నారు మహారాజావారు.
"చిత్తం" అన్నారు దివానుగారు.
కాని ఆయనకు యిష్టంలేదు. ఈ శ్రోత్రియ బ్రాహ్మణునకు యింత గౌరవమివ్వడమా అని ఆయన వ్యథ.
"కాని ప్రభువులకు నాదొక మనవి. శాస్త్రానికి తగిన గౌరవమివ్వదలిస్తే అల్లాంటివారు వేలకువేలు ఉన్నారు. వారందరూ ఆ గౌరవానికి అర్హులేనా ప్రభూ!"
"అదేమిటి దివాన్జీ! సుబ్బయ్యశాస్త్రిగారిని యితర పండితులతో జమ చేస్తున్నారే? పొరపాటు. ఆయన శాస్త్రం తెలిసున్నవారూ పండితులూ కారు. ఆయనే శాస్త్రం. శాస్త్రం యెంత గౌరవానికి అర్హత కలిగి ఉందో అంత గౌరవానికి ఆయన అర్హులు" అన్నారు మహారాజావారు. దివాన్జీకి యిది రుచించలేదు.
"సరే ప్రభూ! అట్లే సందేశం పంపిస్తాను. ఒక్క మనవి నాది అనుగ్రహించండి. ఆయన విద్యనొకసారి పరీక్ష చెయ్యాలనిపిస్తోంది. బంగారాన్ని గీటురాయి మీద రాస్తేనే కదా దాని గొప్పతనం తెలిసేది. అనుమతించండి ప్రభూ!" అన్నారు.
మహారాజావారు నిర్ఘాంతపోయేరు. దివానుగారివైపు కొంచెంసేపు చూసేరు.
కవిగారు కంగారుగా అన్నారు.
"అపచారం ప్రభూ! అటువంటి పనిని తలపెట్టడం కొరివితో తల గోక్కోవడమే"
"ఏమి? అందులో దోషమేముంది? మన పరీక్షకు నిలిస్తే బహుళంగా సత్కరిద్దాం వారిని" అన్నారు దివానుగారు, మహారాజావారు మౌనంగా ఉండడం అనువుగా తీసుకుని.
"దివాన్జీ! నిప్పుతో చెలగాటం పనికిరాదు. మూర్తీభవించిన శాస్త్రమాయన. కొంచెం నిదానంగా మంచి చెడ్డలు ఆలోచించి ముందుకు వెళ్ళండి. " అన్నారు కవిగారు.
"కవిగారి అభిప్రాయమేమో?" అన్నారు దివాన్జీ.
"నా అభిప్రాయం తమరు తలపెట్టిన కార్యం విషాదాంతమవుతుందని"
"ఏమి? పరీక్షకు నిలిచి శాస్త్రిగారు సత్కారాలనందుకోలేరా?" అన్నారు దివాన్జీ హేళనగా.
కవిగారికది సహించరానిదయింది.
"ప్రభువులు క్షమించాలి. సత్కారాల కాశించిన వారైతే శాస్త్రిగారు యెప్పుడో మహారాజావారి సత్కారాల నందుకొని ఉండేవారు. వారికవి అవసరం లేదు. అదిన్నీ గాక శాస్త్రిగారి అనుమానానికి కారణం యిప్పుడు నాకు అర్ధమయింది. మహారాజావారు యువరాజావారి జాతకం చూపించడానికి శాస్త్రిగారిని పిలిపిస్తున్నారు. ఇట్టి సమయంలో వారిని గౌరవంగా ఆహ్వానించి సగౌరవంగా సాగనంపడమే అందరికీ శ్రేయస్కరం. నాకు తోచింది మనవి చేసేను. ఆ తరువాత ప్రభువుల చిత్తం". అని కవిగారు మౌనం వహించారు.
మహారాజావారు ఏమీ అనలేక ఊరుకున్నారు. దివాన్జీ ఈ అవకాశం చూసుకుని
"ప్రభూ! ఆయన మర్యాదలకేమీ లోటు రానివ్వను. ఆస్థానానికి అప్రతిష్ఠ తెచ్చేటంత అవివేకిని కాను. కాని ప్రభువులే శాస్త్రిగారి ప్రతిభను పొగుడుతూ ఉంటే నాకు కూడా వారి పాండిత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ప్రభూ! తమరు అనుమతించాలి." అన్నారు.
మహారాజావారికి యెటు చెప్పడానికీ తోచలేదు.
"దివాన్జీ! బాధ్యత అంతా మీదే. అయినా ఆయన్ను పరీక్షించడమంటే యెట్లా చేయదలచుకున్నారో తెలియచేయండి"
"ప్రభువులు క్షమించాలి. ఇంకా నేనేమీ ఆలోచించలేదు. కాని త్వరలోనే విన్నవించుకుంటాను."అన్నారు దివాన్జీ.
కవిగారి కిదేదో విషాదాంతానికి దారితీస్తుందని భయం తోచింది.
"ప్రభువులు సెలవిప్పిస్తే రేపు పునర్దర్శనం చేసుకుంటాను" అన్నారు కవిగారు.
సరేనన్నారు మహారాజావారు. ఒక గంటసేపు మహారాజావారూ, దివానుగారూ మాట్లాడుకున్న తరువాత దివాన్జీవారింటికి వెళ్ళిపోయేరు.

3

మహారాజావారి ఆహ్వానాన్ని రెండవసారి కూడా కాదనలేకపోయేరు శాస్త్రిగారు. ఠాణేదారుగారు తగిన మర్యాదలతో సగౌరవంగా పాలకీపై రాజధానికి తీసుకువెళ్ళేరు శాస్త్రిగారిని. కో్టలోనూ, ఆస్థానంలోనూ కూడా అఖండమైన గౌరవం చూపించారు శాస్త్రిగారికి. దర్బారు ముగిసిన అనంతరం దివాన్జీ శాస్త్రిగారిని కలుసుకుని,
"నమస్కారం శాస్త్రివర్యులకు, మహారాజావారు తమతో ఆంతరంగికంగా మాట్లాడాలని కోరుతున్నారు. తమరు అభ్యంతర మందిరానికి ఒక తూరి దయచెయ్యాలి. " అని సవినయంగా మనవి చేసేరు.
ఈ గౌరవోన్నతికి చాలా ఆశ్చర్యపోయేరు శాస్త్రిగారు. తాను అపోహ పడ్డందుకు చాలా విచారించారు. దివాన్జీతో కలిసి సేవకులు ముందు దారి చూపుతుండగా అభ్యంతర మందిరంలోనికి ప్రవేశించారు. ఆ మందిరంలోని ఉన్నతాసనాలు తీసివేయబడ్డాయి. రత్నకంబళీ పరచబడి ఉన్నది. దానిపై కూర్చుని ఉన్నారు మహారాజావారు. శాస్త్రిగారిని చూచి లేచి నమస్కరించి లోనికి ఆహ్వానించేరు. శాస్త్రిగారు కూడా ఉచితరీతిని ఆశీర్వదించి దివాన్జీతోపాటు రత్నకంబళి మీదనే ఆశీనులయ్యేరు. అర్ధగడియసేపు సంభాషణ ముగ్గురి మధ్య చాలా సరసంగా నడిచిపోయింది. ఆ తరువాత దివాన్జీ మహారాజావారివైపు చూచి వారి ఆఙ్ఞను తెలుసుకుని యీ క్రిందివిధంగా ఉపక్రమించారు.
"శాస్త్రిగారూ! మీరు వేదమూర్తులూ, మూర్తీభవించిన శాస్త్రమేనని మా ప్రభువులు యెప్పుడూ అంటుంటారు. తమ ప్రఙ్ఞ వినడమే కాని తమ దర్శన భాగ్యం నాకెప్పుడూ కలుగలేదు. మహారాజుగారు కూడా మిమ్మల్నెప్పుడూ ముఖతః పరిచయం చేసుకోలేదనుకుంటాను. "
“ దివాన్జీ! తమరు అనర్హుణ్ణి నన్ను చాలా గౌరవిస్తున్నారు. క్షమించమని నా మనవి. తమరు నాకు చూపిన గౌరవానికి అర్హుణ్ణి కాను. నేను అనుమానాన్ని వెలిబుచ్చినందులకు ప్రభువులు నాకు సరిగానే బుధ్ధిచెప్పారు." అన్నారు శాస్త్రిగారు.
"తప్పు తప్పుశాస్త్రిగారూ! మీరల్లా అనకండి. తమ పాండిత్యానికి తగిన గౌరవం మేమివ్వలేకపోయినందులకు యింకా చింతిస్తున్నాం. అదలా ఉంచండి. తమర్ని మహారాజావారు ఒక విషయం తెలుసుకుందుకు పిలిపించేరు."
"సెలవియ్యండి"
దివానుగారు వారి లాంగుకోటు క్రింది జేబులోనుండి ఒక తాళపత్రం తీసేరు. అందుపై ఒక జాతకచక్రం వ్రాసి ఉంది. కావలసిన ఉడుగతులూ, గ్రహప్రవేశాలు అన్నీకూడా అందులో వ్రాసి ఉన్నాయి.
దివానుగారు ఆ జాతక చక్రాన్ని శాస్త్రిగారి చేతికిచ్చి,
"ఈ జాతకుని యోగం భవిష్యత్తులో యెల్లా ఉంటుందో కొంచెం మనవి చెయ్యండి" అన్నారు.
మహారాజావారు చిరునవ్వుతో చూస్తున్నారు.
శాస్త్రిగారు జాతకాన్ని చూసేరు. కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ చూసేరు. చాలా ఆశ్చర్యపోయేరు. ముఖంలో అనుమానం ప్రవేశించింది. వెంటనే కోపంగా మారింది. ముఖం కందగడ్డలా అయింది.
మహారాజు యిది చూసి చకితులయ్యారు. కాని దివాన్జీ తన తెలివికి లోలోన మురిసిపోతూ యిదేమీ గమనించలేదు.
"మౌనం వహించేరు సెలవీయండి" అన్నారు.
"చెప్పమన్నారా?" అన్నారు శాస్త్రిగారు. మేఘం ఉరిమినట్లుంది ఆ మాట. దివానుగారు తెల్లబోయారు. జాతకచక్రాన్ని దివానుముందుకు విసిరి యిల్లా అన్నారు శాస్త్రిగారు.
"చెపుతున్నాను. ఈ జాతకునికి గడ్డి తినే యోగమే ఉంది కాని అన్నం తినే యోగంలేదు. తెలుసుకోండి. ప్రభువులు క్షమిస్తే ఒక విషయం చెబుతాను. దివాన్జీ చేసిన ఈ పండిత అవమానం సహించరానిది. శాస్త్రానికి తీరని అపచారం. నా విద్యను పరీక్ష చేయడానికి ఆయనకాదు ఆయన్ను పుట్టించిన బ్రహ్మ దిగిరావాలని తెలుసుకోవలసి ఉంది ప్రభువులు... ఈ జాతకం ఒక కోడెదూడ పుట్టిన సమయానికి గ్రహకూటమిని తెలియచేస్తోంది, మానవశిశువు ఆ గ్రహకూటమి సమయంలో యెన్నడూ జన్మించడు.
ఇంతకూ ప్రభువులు నా విద్యను సగౌరవంగా మన్నిస్తారని హామీ యిచ్చిన మీదటనే తమ దర్శనానికి వచ్చేను. వచ్చినందుకు తగిన గౌరవమే జరిగింది...దివాన్జీ! పండితులతో చెలగాటం పనికిరాదయ్యా నీకు. విద్వాంసులూ పండితులూ అంటే నీ దగ్గరకు ద్రవ్యాపేక్షతో చేరే బ్రాహ్మణులనుకుంటున్నావయ్యా ? మహాపండితుల్నీ శాస్త్రాల్నీ కూలంకషంగా తెలుసుకున్న మహనీయుల్ని నువ్వు ఎరుగవు. వారిని పరీక్షించడానికి నీ తాహతేమయ్యా? నీకూ వారికీ హస్తిమశకాంతరం ఉందని గుర్తుంచుకో. ఇంతకీ నీవు చేసిన అపచారం సహించరానిదయ్యా. మా సరస్వతి దుఃఖపడుతోంది. నా ముఖతః నిన్ను శపిస్తోంది. నీ వంశం నీతోనే సరయ్యా. ముందుకైనా బుధ్ధి కలిగి ఉండు. "
"ప్రభూ! యీ బ్రహ్మణున్ని క్షమించండి. మా సరస్వతి మిమ్మల్ని కూడా దోషిగానే నిర్ణయిస్తోంది. ఇందులో మీ ప్రోత్సాహం లేకపోయినా మహారాజుగా దీనిని వారించకపోయినందుకు మీరు దండనార్హులని ఆమె తీర్పు. యువరాజావారి జాతకం చూపడానికి నన్ను పిలిపించేరు. ఆ పని కాలేదు. ఆ ముహూర్తాన కోడెదూడ జాతకం నా చేతికి వచ్చింది. ప్రభూ......మీ యువరాజావారు జీవించియున్న కాలంలోనే రాజ్యం మాసిపోతుందండి. ఆఖరి రోజుల్లో ప్రభూ! వారు కూడా గడ్డి కరవాలిసిందే.. ఇది సరస్వతి శాపం ప్రభూ! సెలవు ప్రభూ! పునర్దర్శనం వలదండి. సెలవ్" అంటూ నిష్క్రమించారు.
మహారాజావారూ, దివానుగారూ నిస్తబ్దులై అల్లాగే ఉండిపోయేరు.

---------------------------------------------------------------------------------

5 వ్యాఖ్యలు:

gp trading said...

enta goppa vadaina buddileni vyakti to saangtyam kaligi unte kalige paryavasanalu ela untayo spastam ga mee katha dwara chepperu. thanks

Giri prasad

కొత్త పాళీ said...

WOW!!!
speechless.

శ్రీలలిత said...

gGiriprasad garu,

అందుకేనండీ, దుష్టులకి దూరంగా ఉండమంటారు.

శ్రీలలిత said...

కొత్తపాళీగారూ,
ధన్యవాదాలండీ. పిడపర్తివారి విద్వత్తు చూపే కథలు ఇంకా ఉన్నాయండీ. నెమ్మదిగా ఒకటొకటీ బ్లాగ్ లో పెడదామనుకుంటున్నా. మీలాంటివారు చదివితే చాలు.

కొత్త పాళీ said...

అసలు దీనికి చాలా వ్యాఖ్య రాద్దామనుకున్నా.
చాలా చోట్ల శ్రీపాద వడ్లగింజలు పెద్దకథని తలపించింది. శ్రీపాద వారో మరొకరో కోనసీమ ప్రాంతపు జ్యోతిష పండితుల గొప్పతనాలు చెప్పిన కొన్ని వైనాలు కూడా గుర్తొచ్చినాయి. ఇంకా రాజాస్థానం వొద్దు అని శాస్త్రులవారు అనుకున్నప్పుడు అమరావతి కథల్లో "గుండెశివుడికిచ్చుకో" గుర్తొచ్చింది. ఇంకా ఏంటో చాలా గుర్తొచ్చాయి.
మీరు మాత్రం తప్పక రాఅయండి. నేను చదవడానికి సిద్ధం.