Pages

Thursday, September 14, 2017

జి.యస్.హాస్యకథలు పుస్తకావిష్కరణ..(వదినగారి కథలు కూడా ఉన్నాయండోయ్..)


జి.యస్.హాస్యకథలు పుస్తకావిష్కరణ..
(వదినగారి కథలు కూడా ఉన్నాయండోయ్..)
2017, సెప్టెంబర్‍నెల మూడో తారీకున నా మూడో పుస్తకం “జి.యస్.హాస్యకథలు” పుస్తకావిష్కరణ ఆత్మీయుల మధ్య ఆనందంగా జరిగింది.
 ఒక విధంగా చెప్పాలంటే ఈ పుస్తకం టూ ఇన్ వన్.. అంటే ఒకవైపు నుండి చదువుకుంటే "హాస్యకథలు", రెండోవైపునుండి చదువుకుంటే "వదినగారి కథలు" వుంటాయన్న మాట.. ఇదిగో  ఇలాగ.. 
 ఈసారి పుస్తకావిష్కరణానికి వ్యక్తిగతంగానూ, సాహిత్యపరంగానూ కూడా ప్రత్యేకత లున్నాయి.
ముఖ్యంగా వ్యక్తిగతమైనది మొదటిది చెప్పుకోవాలంటే మా పెద్దక్క శ్రీమతి మంత్రాల మహాలక్ష్మి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం.
రెండోది మా బంగారుతల్లి, మా అమ్మాయి హిమబిందు పనికట్టుకుని ఈ ఆవిష్కరణకోసం అమెరికానుండి వచ్చి, అంతా తానై నిలబడి ఈ సంబరాన్ని అతి సమర్ధవంతంగా నిర్వహించడం.
 మరింక సాహిత్యపరంగా చెప్పుకోవాలంటే మాలతీచందూర్ అవార్డులవంటి అనేక పురస్కారాలందుకున్న ప్రముఖ రచయిత్రి, మేమందరం ఆత్మీయంగా పెద్దక్కగా గౌరవించుకునే డి.కామేశ్వరిగారు ఈ సభకు అధ్యక్షత వహించడం ఆవిడకు నాపట్ల వున్న అభిమానానికి నిదర్శనం.
అలాగే సాహిత్యపరంగా రెండో గొప్పవిషయం ప్రముఖ హాస్య రచయిత్రి, శ్రీమతి భానుమతీ రామకృష్ణ పేరు మీద పురస్కారం అందుకున్న శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారు, ఈ పుస్తకానికి ముందుమాట రాయడమే కాకుండా, ఆవిష్కరణసభకు కూడా వచ్చి, పుస్తకాన్ని పరిచయం చేసి, నాకు మరింత ఆత్మీయులవడం.
 మూడో గొప్ప విషయం యేమిటంటే, నామీద ఎంతో అభిమానంతో  ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, చిత్రలేఖిని శ్రీమతి మన్నెం శారదగారు ఈ పుస్తకానికి కవర్‍పేజి వేయడం. ఆవిడ వేసిన వదినా మరదళ్ల బొమ్మ చూడగానే, కథలు చదవకుండానే నవ్వొచ్చేస్తుంది. ఈ ముగ్గురు స్త్రీ రత్నాలకూ నేను వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
  ఈ పుస్తకావిష్కరణలో నాకు అన్నింటికన్న ఆనందం కలిగించిన విషయం పాతికేళ్ళుగా మేమందరం ఒకటిగా కలిసి నడుపుకుంటున్న మా లలితా మహిళామండలి సభ్యులు ఎంతో సంతోషంగా నా ఆనందంలో పాలు పంచుకోవడం,. 
ఈ సభాప్రారంభానికి ముందు స్వరాలంకృత మ్యూజిక్ స్కూల్ శిష్యులు వారి గానమాథుర్యంతో సభికులను అలరించారు.

 జ్యోతి ప్రజ్వలనతో సభ మొదలైంది.
ప్రముఖ రచయిత్రి నండూరి సుందరీ నాగమణి సభాధ్యక్షులు డి.కామేశ్వరిగారిని, పుస్తక పరిచయకర్త పొత్తూరి విజయలక్ష్మిగారిని, పుస్తక ఆవిష్కరణ కర్త మంత్రాల మహాలక్ష్మిగారినీ, రచయిత్రినయిన నన్నూ వేదిక మీదకు ఆహ్వానించి, ఆహూతులకు కూడా ఆత్మీయ ఆహ్వానాన్ని అందించింది. 
సభాధ్యక్షత వహించిన డి.కామేశ్వరిగారు సభను ప్రారంభించారు.. 


పొత్తూరి విజయలక్ష్మిగారు పుస్తకంలోని ముచ్చటగా మూడు కథలను పరిచయం చేసారు.. 

ఇదిగో ఇదే శ్రీమతి మంత్రాల మహాలక్ష్మిగారి చేత ఆవిష్కరించబడిన  పుస్తకావిష్కరణ చిత్రాలు..


ప్రముఖ సీనియర్ రచయిత్రి తమిరిశ జానకిగారు ఎంతో అభిమానంతో శాలువతో సత్కరించారు..ప్రియమైన స్నేహితురాళ్ళు మాలాగారు, పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారు, జ్యోతి వలబోజుగారు  ఎంతో అందమైన పూల బొకేలతో ఆహ్లాదపరిచారు..బంధువులు కూడా పూలబొకే లందించి నా ఆనందాన్ని పంచుకున్నారు..మా అమ్మాయి హిమబిందు ఒక కూతురిగా నన్ను గమనించి, విశ్లేషించి, మాట్లాడిన విధానం నన్ను అబ్బురపరచింది.  నా చిన్నారితల్లి ఇంతగా ఎప్పుడు యెదిగిపోయిందా అనిపించింది.
లలితా మహిళామండలి సభ్యురాలు శ్రీమతి రాజ్యలక్ష్మిగారు మా స్నేహాన్ని గురించి ఎంతో అందంగా చెప్పారు.వీరంతా మా మహిళామండలి సభ్యులు..


వీరంతా తోటి రచయిత్రులు..


చిరంజీవి శ్రీరామ సోహం మొట్టమొదటి గానకచేరీ ఈ సభతోనే మొదలైంది
ఈ ఫొటోలన్నీ బంధు మిత్రులందరితోటీ...

వడ్లమాని మణి  ఎంతో హృద్యంగా చేసిన వందన సమర్పణతో పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది. 

బంధు మిత్రులందరూ వచ్చి సభను ఇంత జయప్రదంగా జరిపినందుకు వారందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు.. 
-----------------------------------------------------------------------------

డిసెంబర్,2017 కౌముది అంతర్జాల పత్రికలో నా పుస్తకం "జి.యస్.హాస్యకథలు" పై వచ్చిన సమీక్ష. ధన్యవాదాలండీ కిరణ్‍ప్రభగారూ..   సమకాలీన తెలుగు రచయిత్రులలో ఒక ప్రత్యేకమైన శైలిని అలవరచుకుని సీరియస్ కథలనూ, హాస్యకథలనూ కూడా జనరంజకంగా వ్రాస్తున్న రచయిత్రి జి.ఎస్.లక్ష్మిగారు. ఏది వ్రాసినా ఒక ఆలోచనతో, సమతుల్యమైన పాత్రచిత్రణతో రచనలు చేసే రచయిత్రి లక్ష్మిగారు. ఆమె వ్రాసిన రెండు విభిన్నతరహా కథలసంపుటి ఈ పుస్తకం. ఇందులో ఒక వైపునుంచి చదివితే హాస్యకథలు నవ్విస్తాయి. మరోవైపునుంచి చదివితే వదినగారి కథలు పలకరిస్తాయి. రెండుతరహా కథలనూ కూడా సమానమైన సౌలభ్యంతో వ్రాసారు రచయిత్రి. హాస్యకథల విషయానికి వస్తే – ఈ కథల్లో హాస్యం సన్నివేశపరంగా ఉంటుంది. పాత్రచిత్రణలో ఉంటుంది. కథలో ఒక భాగంగా ఉంటుంది. ఇలాంటి హాస్యాన్ని పండించడానికి చలా నేర్పు కావాలి. అది ఈ హాస్యకథల్లో పుష్కలంగా కనిపిస్తుంది. “పాపం ఆత్మారాముడు” కథలో సంచీనిండా కూరగాయలు తీసుకొచ్చిన భార్యను చూసి ఆనందపడ్ద భర్తకి ఎదురైన వాస్తవం మనకీ చిరునవ్వు తెప్పిస్తుంది. పెళ్ళిపీటలమీద కూడా మొబైల్ ఫోన్ అలవాటుని మానలేని వధూవరులకు పురోహితులు చూపించిన పరిష్కారం “హమ్మ మొబైలా?” కథలో మనల్నీ నవ్విస్తుంది. ఏ హాస్యకథా నిరాశపరచదు. ‘ఇంతేకదా’ అనిపించదు. ఇవన్నీ కడుపుబ్బా నవ్వించే హాస్యకథలు కాకపోవచ్చు కానీ మనసులో నవ్వుల పువ్వులు పూయించే కథలు అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రెండోవైపునుంచి పలకరించే “వదినగారి కథలు” కూడా మొదటనుంచి చివరంటా చదివించే కథలే. ఈ వదినగారి కథల్లో వదినగారు ప్రేమమయి, అనురాగమూర్తి. వదినా మరదళ్ళ మధ్యనుండే అత్మీయతానురాగాలతో నిండిన సన్నివేశాలు ఈ కథలకు మూలం. చాలా సరళంగా, సులువుగా హాయిగా సాగుతాయీ వదినగారి కథలు. మొత్తం మీద ఈ కథలసంపుటి చదవడం పూర్తికాగానే రచయిత్రి కలంనుంచి రాబోయే రచనలు తప్పకచదవాలి అన్న భావం కలుగుతుంది. ఈ కథాసంపుటానికి ముందుమాట ప్రముఖ హాస్యరచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారు వ్రాశారు.

-------------------------------------------------------------------------------------------------------


డిసెంబర్ 1,2017ఆంధ్రభూమి 'అక్షర' లో న పుస్తకం "జి.యస్.హాస్యకథలు" పి సమీక్ష.


http://andhrabhoomi.net/content/akshara-802  హాస్యం ఎవరూ రాయడం లేదు అని పాపం చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అవార్డులూ గట్రా ఇవ్వటానికి పనికిరాక పోయినా అలా సరదాగా చదువుకునేందుకు హాస్యం కావాలి అందరికీనూ. ఎవరూ సభ పెట్టి సన్మానం చెయ్యకపోయినా, మెచ్చి మేకతోలు కప్పకపోయినా, పాఠకులు ఆదరిస్తున్నారు అదే పదివేలు అని ఓపిగ్గా హాస్యం రాస్తూనే ఉన్నారు. జి.ఎస్.లక్ష్మిగారు కూడా పాపం అదే పని చేస్తున్నారు. ఆవిడ కథల్లో హాస్యం ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ ట్రాక్‌లాగా విడిగా ఉండదు. కథలో కలిసిపోయే ఉంటుంది. కాబట్టి నవ్వు తెచ్చుకోనవసరం లేకుండా దానంతట అదే వచ్చేస్తుంది.
కథల్లోని పాత్రలన్నీ మనకు చుట్టూ వున్నవే. కాబట్టి ఇలాంటి వాళ్లను మనమూ చూసాం అనిపిస్తుంది. ఉదాహరణకు తాపీగా వంటచేసే మరదలూ, మొబైల్ యుగంలో పెళ్లి చేయించే పురోహితుల సమయస్ఫూర్తి హాయిగా నవ్విస్తాయి. ఇలాంటి చెణుకులూ చమత్కారాలు చాలా వున్నాయి మరి. కాబట్టి అలవోకగా చదివేసుకోవచ్చు. జి.ఎస్.లక్ష్మిగారి కథలు సమాజంలోని కుళ్లునూ కుత్సితాన్నీ ఎత్తిచూపవు. ఈవిడకి తన కథల ద్వారా సమాజాన్ని బాగు చేసేయాలన్న ఆవేశమూ లేదు. వీరి కథలకు మొదలుపెడితే చివరి దాకా చదివించే గుణం ఉంది. కాలక్షేపం కోసం కాసేపు నవ్వుకుంటూ కథలు చదవాలనుకునే వారిని ఏ మాత్రం నిరాశపరచవు.


2 వ్యాఖ్యలు:

నీహారిక said...

మీ బ్లాగ్ ద్వారా మీ వదినగారి అభిమానులమయిన మమ్మల్ని ఆహ్వానించనందుకు మేం అలిగాం.
వదినగారి కధలు కొనడం ఎలాగో తెలుపలేదు.

శ్రీలలిత said...


అమ్మో నీహారికా.. మీరలిగితే మేం తట్టుకోగలమా! కింద నా మెయిల్ ఐడి కి మీ అడ్రస్ పెట్టండి.. బుక్ పంపిస్తాను..
slalita199@gmail.com