Pages

Thursday, October 5, 2017

మా వదినా - వల్లంగిపిట్టా..



6-10-2017, స్వాతి వారపత్రికలో ప్రచురించబడిన నా "మా వదినా - వల్లంగిపిట్టా.." కథ.



మా వదినా _ వల్లంగిపిట్టా..
                                                                                      జి.యస్.లక్ష్మి..
               రెండు వారాల్నించి మా వదిన నన్ను ఓ పూట భోజనానికి రమ్మని పిలుస్తోంది. విశేషమేవిటి వదినా అంటే ఉట్టినే రాకూడదా అంటుంది.. మీ అన్నయ్యింటికి ఓ పూట భోజనానికి రావడానికి కారణం కూడా ఉండాలా అంటూ నిష్ఠూరాలు కూడా మొదలెట్టింది. అన్నయ్యింటికి భోజనానికి వెళ్లడం నాకు ఇష్టమే. వదిన వంట కమ్మగా చేస్తుంది. ఆప్యాయంగా వడ్డిస్తుంది. ఎంచక్కా కబుర్లు చెపుతుంటే టైమ్ ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. అంత మాటకారి. మరి వెళ్ళడానికి అభ్యంతరం ఎందుకంటే ఈ మధ్యనే అన్నయ్య, వదినా అమెరికా వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసి వచ్చారు. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరగడం వల్ల వాళ్ళు అక్కడుండగానే యేయే ఊళ్ళు తిరిగారో, ఎవరెవరిళ్ళకి విజిట్ చేసారో అన్నీ వాట్స్ అప్ లో కబుర్లతో సహా ఫొటోలు కూడా వచ్చేసాయి. అంతేకాకుండా వారం క్రితం ఇటువైపు వస్తున్నప్పుడు అన్నయ్య, వదిన మాఇంటికి కూడా వచ్చి, ఓ పెర్ఫ్యూము బాటిలూ, చాక్లెట్లూ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అందుకని, ఇప్పుడు వాళ్ళింటికి వెళ్ళినా వాళ్ళ పిల్లల ఆడియో, వీడియోలు చూపించి, నా బుర్ర తింటారన్న భయం లేదు. మరింక వెళ్ళడానికి నా తటపటాయింపు అంతా మా వదిన గురించే. ఏదో కారణం లేనిదే ఇన్నిసార్లు రమ్మనదు. అది ఏమిటా అని ఎన్నిరకాలుగా అడిగినా వదిన బైట పడట్లేదు. ఇంకేం చెయ్యను.. వదిన నిష్ఠూరాలు పడడం కన్న, ఓసారి వెళ్ళివచ్చేస్తే నా మనసులో అనుమానం తీరిపోతుంది కదాని ఓ రోజు బయల్దేరాను.
 ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది వదిన. పక్కనే అన్నయ్యని చూసి “ఇవాళ ఆఫీస్ లేదా అన్నయ్యా?” అంటూ ఆశ్చర్యపోయాను. అన్నయ్య జవాబు చెప్పేలోగానే వదిన “నువ్వొస్తున్నావ్ కదా! కబుర్లు చెప్పుకుందామని శెలవు పెట్టేసార్లే.” అంది. అన్నయ్యకి దాపరికం లేదు. ఉన్నదున్నట్టు చెప్పేస్తాడని కొన్నికొన్నిసార్లు వదిన అన్నయ్యని అసలు విషయం చెప్పనివ్వక తనే ముందు సమాధానాలు చెప్పేస్తుంటుంది యిలాగే. ఏదో వుందనుకున్నాను. ఇంకేమీ మాట్లాడకుండా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయాను.
 ఎంతో ఆప్యాయంగా కమ్మని భోజనం వడ్డించింది వదిన. తృప్తిగా భోంచేసి హాల్లో కొచ్చి కూర్చోబోతుంటే.. “ఇదిగిదిగో.. ఈ కుర్చీలో కూర్చో..” అంది వదిన టీపాయ్ పక్కన కొత్తగా వేసిన కుర్చీ చూపిస్తూ. ఏమో అక్కడెందుకు కూర్చోమందో అర్ధంకాక అయోమయంగానే వెళ్ళి కూర్చున్నాను. అన్నయ్య యెప్పుడూ పెద్దగా వున్న సోఫాలో కూర్చుంటాడు. కానీ ఇవాళ అన్నయ్య వంటింటి వైపు వెళ్ళే సింగిల్ సోఫాలో కూర్చుని వదిన వైపు సాభిప్రాయంగా చూసాడు. వదిన ఓకే అన్నట్లు తలాడించింది. ఏంటి వీళ్ళిద్దరూ. ఒకవేళ వాస్తు శాస్త్రాన్నేమైనా కొత్తగా చదవడం మొదలెట్టారా. అందుకే దిక్కులూ గట్రా సరిచూసుకుని అందరికీ సీటింగ్ అరేంజ్‍మెంట్లు చేస్తున్నారా అనిపించింది. నా పక్కనే వున్న సింగిల్ సోఫాలో కూర్చుంటూ వదిన “మంచినీళ్ళు తాగేవా స్వర్ణా.. తెమ్మంటావా..” అంటూ అన్నయ్యని సాభిప్రాయంగా చూసింది.. నేను వద్దనేలోగానే అన్నయ్య లేచి చుట్టూ తిరిగి నా పక్కనుంచే వంటింటి వైపెళ్ళేడు. ఎక్కడో ఓ పిట్ట కూత లాంటిది వినిపించింది. అదేంటీ.. వదిన లేవకుండా అన్నయ్య లేచేడూ అనుకుంటూ నేను లేవబోతుంటే అన్నయ్య మళ్ళీ నా చుట్టూ తిరిగి వచ్చి నాకు మంచినీళ్ళగ్లాసు అందించి తనకి వదిన కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. మళ్ళీ యెక్కడో పిట్టకూత. వదిన నన్ను కుతూహలంగా చూస్తోంది. నేనదేమీ గమనించకుండా మొహమాటంగా అన్నయ్య చేతిలోని గ్లాసందుకున్నాను. ఓ రెండు నిమిషాలు వదిన పిల్లల చదువుల గురించి అడిగింది. నేను చెప్పే సమాధానం పట్టించుకోకుండా “అయ్యో, స్వర్ణకి అన్నం తిన్నాక వక్కపొడే యివ్వలేదూ.. ఏవండీ.. కిచెన్‍లో పైన డబ్బాలో వుంటుంది కాస్త తెస్తారా!” అంది. నాకు ఈసారి ఆశ్చర్యం వేసింది. అన్నయ్యని అలా పనికట్టుకుని వదిన యెందుకు లేపుతోందో తెలీక “పరవాలేదులే వదినా, నేను తెచ్చుకుంటాలే..” అనే లోపలే అన్నయ్య మళ్ళీ చటుక్కున లేచి నా చుట్టూ తిరుగుతూ వంటింటి వైపెళ్ళాడు. తిన్నగా వంటింటివైపు వెళ్ళకుండా యిలా నా చుట్టూ అన్నయ్య ప్రదక్షిణలు యెందుకు చేస్తున్నాడా అనుకుంటుండగానే మళ్ళీ యెక్కడిదో ఓ పిట్టకూత. వదిన నా మొహం వంక కుతూహలంగా చూడడం. అన్నయ్య వంటింట్లోంచి వక్కపొడి డబ్బా తెచ్చి మళ్ళీ నా చుట్టూ ప్రదక్షిణం చేసి, దానిని నా చేతిలో పెడుతుంటే మళ్ళీ పిట్టకూత. నేను ఆశ్చర్యంగా అటూ యిటూ చూస్తుంటే మా వదిన మొహం ఆనందంతో విచ్చుకుంది. నాకు యేం మాట్లాడాలో తెలీక అలా కూర్చుండిపోతే మళ్ళీ వదినే సినిమాల గురించి మాట్లాడుతూ, “అయ్యో.. స్వర్ణకి తమలపాకులు యివ్వడం మర్చిపోయేరండీ.. కడిగి, సున్నమూ, అవీ ఆ గట్టు మీద పైనే పెట్టాను. కాస్త తెండీ..”అనే వదిన మాట పూర్తయేలోపే మళ్ళీ అన్నయ్య ఠపీమని లేచి నిలబడి, ఎప్పట్లాగే నా చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వంటింట్లోకి వెళ్ళాడు. మళ్ళీ పిట్ట కూత. నేను అయోమయంగా అటూ యిటూ చూస్తుంటే వదిన “యేంటి స్వర్ణా.. అలా చూస్తున్నావ్” అంది ముందుకి వంగుతూ.
“అహా. యేదో పిట్ట కూస్తున్నట్టుంటేనూ..” అన్నాను యింకా అటూ యిటూ చూస్తూ.. వదిన మొహం చాటంతయింది. “అదే.. నీ పక్కనున్న వాజ్ లో వున్న పూలలోంచి వస్తోంది కదా..” అంది. అవునవును అన్నాను అటువైపు తిరుగుతూ. చక్కటి ఫ్లవర్‍వాజ్. అందులో యెంచక్కటి రంగురంగుల రకరకాల పూలు. ఆ రంగులన్నీ అందరికీ ఆహ్లాదంగా కనిపించేలా పేర్చిన వదినలోని కళోపాసనకు ఉప్పొంగిపోతూ వాటిని చూస్తున్నాను. వదిన వెనకనుంచి “కనిపించిందా?” అంది. “యేవిటీ?” అన్నాను.. “యేవండీ.. యిలా రండీ..” అంటూ అన్నయ్యని పిలిచింది. అన్నయ్య మళ్ళీ నాచుట్టూ గుండ్రంగా తిరుగుతూ వచ్చి పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు. ఆ పూలనే పరీక్షగా చూస్తున్న నేను అందులోంచి వచ్చిన పిట్టకూతకి ఆశ్చర్యపోయాను. పరీక్షగా చూస్తే ఆ పూల మధ్యలో ఓ పిచికలాంటి పిట్టబొమ్మ వుంది. ఆ కూత అందులోంచే వస్తోందని తెలుసుకుని ఆశ్చర్యంగా “అదేంటి వదినా..బటనేమీ నొక్కకుండానే కూస్తోందీ..” అన్నాను. అప్పటికి మా వదిన మొహం పూర్తిగా మందారంలా విచ్చుకుంది. ఇంక చెప్పడం మొదలుపెట్టింది. ఆ పిట్టబొమ్మకి ఆన్, ఆఫ్ చేసే మీటలు అక్కర్లేదుట. మనిషి పక్కనుంచి వెడుతుంటే చాలు సెన్సార్ చేసి కూసేస్తుందిట. అందుకే అన్నయ్య ఆ పక్కనుంచి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ పిట్టకూత వినిపించిందట. ఆ పిట్ట అలా కూయడం నచ్చి అమెరికా నుంచి వదిన దానిని తెచ్చుకుందిట. వదిన చెప్పింది విన్నాక కేవలం అది చూపించడానికే వదిన నన్ను భోజనానికి పిలిచిందన్న విషయం అర్ధమైపోయింది. కానీ మరోవిషయం అర్ధంకాక వదిన్ని సూటిగానే అడిగేసాను. “అలా పిట్టకూత వినిపించాలనుకుంటే నువ్వే లేచి దానివైపు వెళ్ళొచ్చుకదా వదినా. దీనికోసం పాపం అన్నయ్యని శెలవుకూడా యెందుకు పెట్టించి, ప్రదక్షిణాలెందుకు చేయించడం?”
“సరిలే.. యేదో అనుకుంటే మరేదో అయిందిట. అల్లాగ యింత ముచ్చటపడి ఆ పిట్టని తెచ్చుకుంటే నేను దగ్గర కెడితే అది కూయటంలేదు. మీ అన్నయ్య అటు వెడితేనే కూస్తోంది. మరి మీ అన్నయ్యచేత శెలవు పెట్టించక యేం చెయ్యనూ?” అంది సాగదీసుకుంటూ. “అలా యెలా వదినా?” అన్నాను ఆ పాయింట్ అర్ధంకాక.
“ఎలా యేముందీ? ఆ పిట్ట ఆడదైవుంటుందీ. అందుకే మగవాళ్ళు వెడితేనే కూస్తోందీ.” అంది వుడుకుమోత్తనంతో.
 నాకు ఫక్కున నవ్వొచ్చేసింది.


  

3 వ్యాఖ్యలు:

విశాలి said...

భలే ఉందండి మీ కథ... ఇలా కొత్త కొత్త వస్తువులు ఇంటికి తెస్తే అలా శెలవు పెట్టించకుండా ఉంచుతారా మన వదినలు. వల్లంకి పిట్ట కూత ఊరంతా ఇలా అందరికీ వినపడాలి కదా!!

శ్రీలలిత said...


హ హ .. కదండీ విశాలిగారూ..

శ్రీలలిత said...


Thank you Chowdarygaru..