Pages

Tuesday, January 25, 2011

కదంబమాలిక - 9

ప్రమదావనం లో పరిమళిస్తున్న ఈ కదంబమాలిక 8వ భాగం శ్రీమతి లక్ష్మీరాఘవగారు వ్రాసారు.
మరింక నేను అల్లిన కాస్త మాలనూ ఇదిగో మీ ముందుంచుతున్నాను. అల్లిక అందాల గురించి కాస్త చెపుతారుకదూ..


వదిన అడిగిన ప్రశ్నకి నవ్వుతూ జవాబు చెప్పింది అనిత...
"నా లక్ష్యం మటుకు కలెక్టర్ కావడమే వదినా.. ఇవన్నీ ఆ గమ్యం చేరడానికి పనికొచ్చే దారులే. పుస్తకాల పురుగులా చదువులోనే ములిగిపోయి చుట్టూవున్న సమాజాన్ని చదవలేకపోతే కలెక్టర్ అయి మటుకు ఏం లాభం చెప్పు. కలెక్టర్ అన్నవాళ్ళు ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య వారధిలా వుండి ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి కదా.."
ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న అనిత మాటలకి వాళ్ళు మురిసిపోయారు.
అంతలోనే సుభద్ర ఏడుస్తున్నలక్ష్మమ్మని, పిచ్చి చూపులు చూస్తున్నట్టున్న ఓ పదేళ్ళ పిల్లని తీసుకొచ్చింది.
లక్ష్మమ్మ ఏడుపు చూసి, "ఏమైంది ..." సరోజిని ఖంగారుగా అడిగింది..
"అన్నాయమైపోనానమ్మా... " అంటూ కూలబడిపోయింది లక్ష్మమ్మ.
"జానక్కి ఎలావుంది? ఈ పిల్లెవరు..?"
ఆతృతగా అడిగారు శ్రీరాంగారు..
ఆయనకి చెయ్యెత్తి దండం పెట్టింది లక్ష్మమ్మ.
"బాబుగారూ, మీ పున్నాన్ని జానకి బానేవుందయ్యా...అమ్మగారూ... యాద్ మర్సినారా... ఇది సంద్రండీ... జానకి తరవాతిదండి.. రెండోది.. పిచ్చిదైపోయిందమ్మా" గొల్లుమంది.
నారాయణమ్మ నిర్ఘాంతపోయారు.
లక్ష్మమ్మ రెండో కూతురు చంద్రి. నిండా పదేళ్ళుంటాయేమో నంతే . ఎప్పుడూ నవ్వుతూ వుండేది. చాలా చురుకైంది. అస్తమానం ఆడుతూ గెంతులేస్తూనే వుండేది. ఆ పిల్లా ఇది....
లక్ష్మమ్మ పక్కనున్న పిల్లని నిశితంగా చూసారందరూ.
కళాకాంతీ లేకుండా ఎండిపోయిన ఎముకలపై సాగదీసినట్టున్న చర్మం, నెత్తిమీద నిక్కబొడుచుకుని ఒక అంగుళం మాత్రమే వున్న జుట్టూ, పొడారిపోయిన కళ్ళూ, బెదురుచూపులూ, వణికిపోతున్నట్టున్న ఆ పిల్లని చూడగానే నారాయణమ్మకి కడుపులోంచి బాధ తన్నుకు వచ్చింది.
"అదేంటీ? అది ఆఫీసరుగారమ్మాయితో బొంబాయ్ వెళ్ళి చదువుకుంటోంది కదా..."
సరోజిని అడిగింది..
"అదేనమ్మా నా కొంప ముంచింది. ఇది సానా సురుకైన పిల్లండి. ఏదైనా సరే ఒక్కసారి సెప్తే సాలు... అట్టా పట్టేస్తాదండి. సదువంటే మరిక అన్నవక్కర్లేదండి. మీకు తెల్సుగదండీ..
కాని సదువంటే మా అసంటోళ్ళకి ఎట్టాగమ్మా. ఆడపిల్లకి అయిదేళ్ళొస్తే చిన్న తమ్ముణ్ణి చంకనేసుకుని ఆడించాల. ఎనిమిదేళ్ళొస్తే పొయిమీద గంజిగిన్నె దింపాల. పదేళ్ళొస్తే పని చేసే ఇళ్ళకి నెమ్మదిగా అలవాటు కావాల. నాలుగేళ్ళూ నోట్లోకి పోవాలంటే ఇస్కూల్ కి పోదమంటే ఎట్టమ్మా..
కాని ఎంత సెప్పినా ఇనదే.. అదే పాట.. అదే పాట.. నేను ఇస్కూల్ కి పోతానూ... అంటూ..
గింతలో మన పెద్దాపీసరుగోరు లేరమ్మా... అదే పెద్దీధిలో పెద్ద మేడ... ఆరి బొట్టి బొంబయి నుంచోచ్చిందట...అగో.. ఆమె.. మీ పోరికి సదుగు సెప్పిస్తానూ... అంటూ మమ్మల్ని నిల్నీలేదమ్మా.. ఎప్పుడైతే ఆమె సదువు సెప్పిస్తానందో.. అగో ఆ మాటట్టుక్కూచుందీ.. పిచ్చిది. ఆమె అందికదా.. నాతో జానకిని బొంబయి తీసికెడతాను. ఒక్కదాన్నే ఉంటానుకదా.. అది నాకు ఇంట్లో సాయంగానూ ఉంటది.. దానికి నేను సదువూ సెప్పి పరీచ్చలకి కట్టిస్తానూ.. అందండి. గంతే..అప్పటి సంది గీ సంద్రి అమ్మగారితో బొంబయి పోతాను.. సదుకుంటానూ.. అని ఒకటే ఏడుపాయె. ఏం సేసేది సెప్పండి. గింక దాని లొల్లి పడలేక పంపినామమ్మా... ఆ తర్వాతే దాని బతుకు గిలా ఆగమమైపోయింది."
నోటమ్మట మాట రావటంలేదు లక్ష్మమ్మకి.
వింటున్న అందరూ ఒక్కసారిగా "ఏమైంది..?"అంటూ ఆతృతగా అడిగారు.
ఆమెని కాసేపు సేదదీరమన్నట్టు లక్ష్మమ్మ చేతిమీద చెయ్యి వేసి సుభద్ర అందుకుంది ఆవేశంగా..
"ఛ...ఛ...అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. అన్నీ అబధ్ధాలు చెప్పి ఈ చంద్రిని బొంబాయ్ తీసికెళ్ళిన ఆ ఆఫీసర్ గారమ్మాయి అసలు రంగు అక్కడ బయటపడింది. నిండా పదేళ్ళు కూడా లేని ఈపిల్లతో ఇంటెడు చాకిరీ చేయించేదిట. చదువు మాట దేవుడెరుగు.. అంతకన్నా ఘోరం ఏమిటంటే.. వాళ్ళింట్లో వాళ్ళ ఆడపడుచో ఎవరో..ఇరవైయేళ్ళ పిచ్చమ్మాయి ఒకమ్మాయి వుందిట. ఆ పిల్ల పని అస్తమానం తినడం, ఎదురుకుండా వున్నవాళ్ళమీద పడి గీరడం, పడి నిద్రపోవడం. ఆపిల్లని వంటింటి పక్కన ఒక గదిలో వుంచి, ఆ గదిలో ఒక స్టౌ, రెండు గిన్నెలు, కిటికీలో నాలుగురకాల పచ్చళ్ళ సీసాలూ వుంచి.. ఆగదిలోనే ఈ చంద్రినీ వుంచారుట. ఇది ఇంట్లో పని చెయ్యటమే కాకుండా.. ఆ పిచ్చిపిల్ల ఆకలనేటప్పటికి అన్నం వండి అందించాల్సొచ్చేదిట. అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైతే ఆపిల్ల మీద పడి గీరేసేదిట. అందులోనూ రాత్రి రెండుసార్లు లేచి అన్నం పెట్టమనేదిట. పగలంతా ఇంటి చాకిరీ, రాత్రుళ్ళు ఆ పిచ్చిదాని సేవ తో చంద్రి పాపం బెంబేలెత్తిపోయింది.
అలా రాత్రిళ్ళు మేలుకునీ.. మేలుకునీ.. ఈ పదేళ్ళపిల్ల కళ్ళు పొడారిపోయాయి. నిద్రపోదామంటే ఎప్పుడు ఆ పిల్ల మీద పడి గీరుతుందోనని హడలిపోతూ మేలుకునే వుండేదిట.. "
"మరి చంద్రి చదువు మాట ఆవిడని అడగలేదా.." అనిత కాస్త ఆవేశంగా అడిగింది.
"అడక్కేం.. అడిగిందిట.. నీకు చదువెందుకే.. చదివి ఎవర్ని ఉధ్ధరిస్తావు?.. నీలాంటి వాళ్ళంతా చదూకొని అందలాలెక్కితే మేం మోయాలా.. అంటూ.. అలా అడిగిందని దానికి రెండ్రోజులు భోజనం పెట్టలేదుట. "
సుభద్ర గొంతు గద్గదికమౌతుండగా మళ్ళీ చెప్పింది.
"పైగా ఈ జానకి జుట్టు చూసి నీ జుట్టు అలా పెంచుకుంటూ పోతే దానికి కొబ్బరినూనె ఎవడిస్తాడంటూ నెలకోసారి జానకికి జుట్టు తీయించేసేదిట.."
ఆశ్చర్యంతో వింటున్న వాళ్లందరికీ ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లాయి.
సరోజిని గొంతు బొంగురుపోతుంటే అడిగింది...
" ఛ.. చిన్నపిల్లనైనా చూడకుండా ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా..?
పళ్ళు గట్టిగా కొరుక్కుంటూ సుభద్ర
"డబ్బు పొగరు. డబ్బనేది కొంతమంది కళ్ళని మూసేస్తుంది.."అంది.
"అలా నానాబాధలూ పడుతూ అక్కడ వుండేకన్న తిరిగి ఇంటికి వచ్చెయ్యొచ్చుగా..?"
అనిత అమాయకంగా అడిగింది.
అనితని జాలిగా చూస్తూ.."అలా వచ్చేసే వీలుంటే ఎందుకు రాదు. బాగా కట్టడి చేసేవారుట. అసలు ఆ పిల్లకి బొంబాయ్ లో తనెక్కడుందో కూడా తెలీదుట. ఎంతసేపూ పనీ.. పనీ.. తర్వాత ఆ పిచ్చిదాని సేవాను.."అంది సుభద్ర.
"పోనీ.. ఇక్కడ లక్ష్మమ్మ వాళ్ళేనా ఎప్పుడూ ఆ ఆఫీసర్ వాళ్లని అడగలేదా.."
"చాలాసార్లు అడిగారుట.. అక్కడ బాగా చదువుకుంటోందనీ, వాళ్ళ అమ్మాయి నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటోందనీ చెప్పేవారుట. ఆఖరికి ఓ ఏడాది అయ్యాక ఇంక వుండబట్టలేక లక్ష్మమ్మే తన కూతుర్ని వెనక్కి పిలిపించేయమని గొడవ మొదలుపెట్టిందిట. వాళ్ళూ ససేమిరా అంటే.. పదిమందిచేతా గొడవ చేసినంత పనిచేస్తే మరింక విధిలేక ఎవరో తెలిసినవాళ్ళు వస్తుంటే వాళ్ళచేత ఇంటికి పంపించేసార్ట.. రాగానే చంద్రిని లక్ష్మమ్మ అస్సలు గుర్తే పట్టలేకపోయిందిట..
బెదురు చూపులతో, పొడారిపోయిన కళ్ళతో, నెత్తిమీద నిక్కబొడుచుకున్నట్టున్న జుట్టుతో, పదేళ్ళపిల్లా.. ఏడేళ్ళపిల్లలా కనిపించేసరికి లక్ష్మమ్మకి దుఃఖం ఆగలేదుట.."
సుభద్ర చెపుతున్న మాటలు వింటున్న వాళ్లందరూ గుండెలు బాధతో మండిపోతున్నట్లుంటే నోటమాటరాక బరువెక్కిన హృదయాలతో అలా మూగగా కూర్చుండిపోయారు.
అనిత ఆవేశం పట్టలేకపోయింది.
"సుభద్రా, నడు.. ఆ ఆఫీసరు కూతురి మీద కంప్లైంట్ ఇద్దాం... "
సుభద్ర ఓ వెర్రినవ్వులాంటిది నవ్వింది.
"నేను ఇప్పుడు అక్కడ్నుంచే వస్తున్నాను. నీలాగే నేనూ ఆవేశపడిపోయి వీళ్ళిద్దర్నీ తీసుకుని కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. కాని వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. "
"ఎందుకని..?"
"ఆ ఆఫీసర్ బాగా పలుకుబడున్నవాడుట. ఆయన మీద ఎలా ఇస్తారు కంప్లైంట్..? అన్నాడు ఇనస్పెక్టర్. కాస్త గట్టిగా అడిగితే మీరిలా గొడవ చేస్తే ఈ పిల్ల వాళ్ళింట్లో పని చేస్తూ గొలుసో, గాజులో దొంగిలించిందని వాళ్ళే ఇస్తారు మీమీద కంప్లైంట్.. జాగ్రత్త.. అన్నాడు. ఇంకేం చెయ్యలేక ఇలా వచ్చాం.."
వింటున్నవాళ్లందరూ ఈ అరాచకానికి ఏం చెప్పాలో తెలీనట్టుండిపోయారు.
అందరికన్నాశ్రీరాంగారే కాస్త తొందరగా తేరుకున్నారు.
"అనితా, నడమ్మా, వాళ్ళనీ రమ్మను. పోలీస్ స్టేషన్ కి వెడదాం.. ఎలా తీసుకోడో కంప్లైంట్ చూద్దాం. “
అని అనుకుంటూ పోలీస్ స్టేషన్ కి బయల్దేరబోతున్న అందరూ వేళకాని వేళలో అప్పుడే ఇంట్లో అడుగు పడుతున్న భాస్కర్ ని చూసి తెల్లబోయారు.
నారాయణమ్మ ఖంగారుగా ముందుకువచ్చి, భాస్కర్ చెయ్యి పట్టుకుని, "ఏరా అబ్బాయ్, ఒంట్లో బాగుందా..?" అని ఆతృతగా అడిగారు.
భాస్కర్ నవ్వుతూ "బానే వుందమ్మా.. వేరే పనిమీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చాను."
శ్రీరాం అడిగారు.." ఏం... ఏమైంది..?"
"మా బేంక్ లో అకౌంట్ వున్న ఒకాయన అకౌంట్ నుంచి ఎవరో కొన్ని లక్షలు డ్రా చేసేసారు. ఆయన వచ్చిచెప్పగానే ఆయన్ని తీసుకుని సైబర్ క్రైమ్ కింద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి, ఇంక ఎలాగూ బేంక్ మూసే టైమ్ అయిపోతోంది కదాని ఇంటికి వచ్చేసాను."
నారాయణమ్మ తెల్లబోయారు..
"అయ్యొ.. అయ్యొ.. అలా సంతకాలూ అవీ లేకుండా అంతంత డబ్బు ఎలా ఇచ్చేసేర్రా.."
అమాయకంగా అడిగిన ఆవిడ ప్రశ్నకి నవ్వుతూ సమాధానం చెప్పాడు భాస్కర్.
"అమ్మా.. ఈ రోజులు సంతకాలు చూసి డబ్బులిచ్చే రోజులు కావు. ఇంత పెద్ద ప్రపంచాన్నీ "గ్లోబల్ విలేజ్" అనే చిన్న మాటలో ఇమిడ్చేసి పనులు చేసుకునే రోజులు. నేరాలు కూడా దానికి తగ్గట్టుగానే రూపులు మార్చుకున్నాయి. ఎన్ని రూల్స్ పెట్టినా దానికి తగ్గ పక్కదార్లు వెతుక్కున్నట్టే ఇక్కడ కూడా ఏ రూల్ కైనా పక్కదారి కోసం వెతికే నేరప్రవృత్తి వున్నవాళ్ళు కొంతమందుంటారు. అందులోనూ ఈ సైబర్ క్రైమ్ చెయ్యడానికి విపరీతమైన తెలివితేటలు కావాలి. అమోఘమైన వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి ఇలా లక్షలూ, కోట్లూ దోచేయడమే కాకుండా మరికొంతమంది ప్రబుధ్ధులు అమాయకంగా నెట్ వాడుకుంటున్న వాళ్లతో స్నేహాలు చేసి, వాళ్ళని నమ్మించి, మానసికంగా హింసించి ఆనందిస్తున్నారు.."
"అయ్యో..అయ్యో..వాడి కదేం పొయ్యేకాలంరా.." నారాయణమ్మ విలవిలలాడిపోయారు.
"అలా జరుగుతున్నప్పుడు అది తెలిసినవాళ్ళు కాస్త మిగిలినవాళ్ళని జాగ్రత్తపడమని చెప్పొచ్చుకదా.." శ్రీరాంగారు అడిగారు.
"నాన్నా.. మీకు వినాయకుడి బొడ్డులో వేలు కథ తెలీదూ.(ఈ కథ తెలీనివాళ్ళు కింద కథ వుంది చదువుకోవచ్చు..) వీళ్ళూ ఆ బాపతే.. "ముందు మనమే ఎందుకు బయటపడాలీ... వాళ్ళని కూడా అనుభవించనీ.." అనుకునే మనస్తత్వం.
అసలు ఈ విషయం గురించి హెచ్చరించాలనే ఇటు ఇంటికి కూడా వచ్చింది. అనితా.. నువ్వు నీ సబ్జెక్ట్స్ లో రిఫరెన్స్ కోసం నెట్ కేఫ్ కి వెళ్ళి బ్రౌజింగ్ చేస్తుంటావుకదా.. ఒక్కొక్కసారి గ్రూప్ లుగా అయ్యి ఇన్ ఫర్మేషన్ పంచుకుంటూంటారు కదా.. అలాంటప్పుడు జాగ్రత్తగా వుండమ్మా.. నీకు పెర్సనల్ గా తెలీని వాళ్ళెవరైనా స్నేహం చెయ్యమంటే చెయ్యకు. చాలా రకాల గొడవలవుతున్నాయి.."
" మీరు మరీనండీ.. ఎవరైనా కావాలని మోసం చెయ్యడానికి స్నేహం చేస్తారా.."
సరోజిని అడ్డుపడింది.
"అదిగో.. అలాంటి బలహీనతలే వుండకూడదంటున్నది. ఇంతా స్నేహం చేసాక వాళ్ళు మోసగాళ్ళని తెలిస్తే పాపం అనిత మనసెంత బాధపడుతుంది.. అందుకే తన జాగ్రత్తలో తనుంటే మంచిది. ఈ రోజుల్లో శారీరకంగా ఆడపిల్లలు వాళ్లని వాళ్ళు రక్షించుకోడానికి కరాటే లాంటి విద్య లెంత అవసరమో.. మానసికంగా వాళ్ళు స్థిరంగా వుండడానికి ఇటువంటి జాగ్రత్తలు కూడా అంతే అవసరం. "
"మరి అటువంటి వాళ్లకి శిక్షలేమీ వుండవా.."
"ఎందుకుండవ్..? కాని ముందు వాళ్ళు పట్టుబడాలికదా.. ఈ లోఫల ఎంతమందిని వాళ్ళు మోసం చేసి ఆనందిస్తుంటారో.."
"ఎదుటివాళ్ళని మోసం చెయ్యడంలో ఆనందం ఏంట్రా.." నారాయణమ్మ అడిగారు.
"అలాంటి వాళ్ళనే పెర్వెర్టెడ్ అంటారమ్మా.. మన జాగ్రత్తలో మనం వుండడం మంచిదని అందుకే అనితకి చెప్తున్నాను. "
"పోనీ.. అంత ఛండాలమైతే అక్కడికి వెళ్ళడం మానెయ్యొచ్చుకదా.."నారాయణమ్మ సలహా ఇచ్చారు.
"మనకి కావల్సినది చదువు, ఙ్ఞానం. దానికోసం అక్కడికి వెడతామే కాని వీళ్ళకి భయపడి మానేసుకుంటామా.. ఏం ఫరవాలేదు అనితా, నువ్వు హాయిగా వెళ్ళి నీకు కావల్సినవి చూసుకో.. కానీ కాస్త జాగ్రత్తగా మాత్రం వుండు.. నెట్ లో ఎక్కడా నీ ఫొటోలు పెట్టకు. నీ పెర్సనల్ విషయాలేవీ ఇంకోళ్ళకి చెప్పకు. నీ చదువుకు కావలసి ఎంతవరకూ మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అంతే..అవునూ.. మీరందరూ ఎక్కడికి బయల్దేరేరూ..?"భాస్కర్ అడిగాడు.
సరోజిని అందరికీ కాఫీ తెచ్చేలోపల నారాయణమ్మ కొడుక్కి అనిత సంగతి, చంద్రి సంగతీ చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి బయల్దేరినట్టు చెప్పింది.
సంగతులన్నీ తెలుసుకున్న భాస్కర్ రగిలిపోయాడు.
"నాన్నా.. మీరుండండి. నేనూ కాస్త పలుకుబడి ఉపయోగించి కంప్లైంట్ ఎందుకు తీసుకోరో చూస్తాను. "
అంటూ వాళ్ళని తీసుకుని బయల్దేరాడు.

వినాయకుని బొడ్డులో వేలు కథ

పూర్వం ఒక ఊళ్ళో రావి చెట్టు కింద ఒక వినాయకుడి విగ్రహం వుండేది. ఊళ్ళోని జనాలు అక్కడికి వచ్చి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి, వినాయకునికి దండం పెట్టుకుని వెళ్ళడం రివాజుగా వుండేది.
ఒకరోజు ఒక పెద్దమనిషి అలా దండం పెట్టుకుంటూ, ఈ వినాయకుని పొట్ట ఇంత పెద్దగా వుందికదా.. ఆయన బొడ్డు అంత లోతుగా వుందికదా ...ఆ బొడ్డులో ఏముందో.. అనే కుతూహలం కొద్దీ వినాయకుని బొడ్డులో వేలు పెట్టాడుట. అంత లోతు బొడ్డులో ఎప్పటినుంచో వుంటున్న ఒక తేలు ఆ వేలిని కసక్కున కుట్టిందిట. ఆ పెద్దమనిషి గబుక్కున వేలు వెనక్కి లాక్కుంటే, పక్కనున్నాయన అడిగాడుట.."లోపల ఏముందీ..?" అని.
తేలు కుట్టినట్టు చెప్పుకుందుకు ఈ పెద్దమనిషికి నామోషీగా అనిపించిందో, లేకపోతే ఆ పక్కాయన సంగతీ చూద్దామనుకున్నాడో కానీ..మొహమంతా ఆనందం కనపరుస్తూ.."ఆహా... ఎంత హాయిగా వుందో.. ఎంత చల్లగా వుందో..." అన్నాడుట. ఆ హాయేదో తనుకూడా అనుభవిద్దామని పక్కాయన కూడా వినాయకుని బొడ్డులో వేలు పెట్టాడుట. తేలు మొహమాటం లేకుండా ఆయన్నీ కుట్టిందిట.. ఆయన కూడా గబుక్కున తన వేలు వెనక్కి లాక్కుని, "ఆహా.. ఎంత హాయిగా వుందో.. ఎంత చల్లగా వుందో.." అన్నాడుట...
అలాగ అప్పటినుంచీ ఎవరైనా మోసపోయినా, బాధపడినా పైకి చెప్పకుండా మిగిలినవాళ్లని కూడా పడనీ అనుకునేవాళ్ళని చూసి ఈ కథని చెపుతారన్నమాట.

దీని తరువాతి భాగం ప్రసీద గారి బ్లాగ్ లో చదవండి.

5 వ్యాఖ్యలు:

Lakshmi Raghava said...

పిల్లలను తీసుకెళ్ళి చాకిరీ చేయించుకోవడం ,సైబెర్ crime గురించి రాయడం బాగా అనిపించింది.
ఇలాటి విషయాలు ముక్యంగా internet బాధలు తెలిసిన మీరు ఇంకా రాస్తే మాలాటి వారికి ఎంతో వుపయోగపడుతుంది.కదంబమాల చాలాబాగా అల్లారు .అభినందనలు.
లక్ష్మీ రాఘవ

రుక్మిణిదేవి said...

excellent srilalitha gaaru, chaala baagaa vraasaaru...mukhyamgaa vinaayakuni boddulo velu story sandharbochitamgaa vraasaaru.. keep it up..

చెప్పాలంటే...... said...

chaalaa baagaa rasaaru abhinandanalu

మాలా కుమార్ said...

బాగా రాసారు .

శ్రీలలిత said...

లక్ష్మీరాఘవగారూ, రుక్మిణిగారూ, చెప్పాలంటేగారూ, మాలాగారూ...
నా అల్లిక నచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండీ...