Pages

Tuesday, June 21, 2011

"మఱపురాని అనుభవాలు"

మా నాన్నగారు "పిడపర్తివారు--కథలూ-గాధలూ" అని పిడపర్తివారి వంశచరిత్ర,, జ్యోతిష్యంలో వారికి గల అసమాన ప్రతిభ తెలిపే కొన్ని కథలూ కలిపి ఒక పుస్తకంగా వ్రాసారు. వాటి గురించి తర్వాత ప్రస్తావిస్తాను.
ఇప్పుడు మా నాన్నగారు బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు వ్రాసిన ఇంకో పుస్తకం "మఱపురాని అనుభవాలు" అన్నదానిని గురించి చెపుతాను. ఈ పుస్తకం ముందుమాటలో ఆయనే వ్రాసుకున్న మాటలు...
"నా జీవితకాలంలో నేను చూసినవి రెండు ప్రపంచ యుధ్ధాలు, దేశంలో జరిగిన సత్యాగ్రహ సమరము, తదుపరి నేను విధులు నిర్వహించిన ప్రభుత్వాలు రెండు; ఒకటి బ్రిటిష్ ప్రభుత్వము, రెండవది మన దేశ నాయకుల ప్రభుత్వములో. నా విధి నిర్వహణలో ఆఫీసర్లుగానున్న తెల్లదొరలతో వ్యక్తిపరమైన సంబంధం ఉండేది.
ఈ పై విషయాలను బట్టి మీరు గ్రహించేయుంటారు నా జీవితానుభవాలు అనేకములనీ, కొన్ని అసాధారణములై ఉంటాయనీ కూడా. నా మిత్రులతో ప్రసంగిస్తున్నప్పుడు ఈ అనుభవాలను కొన్ని వారికి విన్పింపగా వారు అనందించి, నా అనుభవాలను కొన్నింటిని పుస్తకరూపంలో అందించమని కోరారు. వారి కోరిక ఫలితమే ఈ చిన్న పుస్తకము. ఇందులో నేను చూపిన అనుభవాలు దేశంలోని మహనీయుల గొప్పతనాన్ని యెత్తిచూపడానికే గాని, నా గొప్పతనం కోసం గాదు."
అల్లూరి సీతారామరాజు



మా చిన్నతనంలో ఎంతో ఆసక్తితొ విన్నదీ, కన్నదీ అల్లూరి సీతారామరాజును గుఱించి. ఆయన జీవిత చరిత్ర నాటక రూపంలోనూ, చలనచిత్రరూపంలోనూ బాగా ఈమధ్య ప్రచారం కాబడింది. అందులో చూసిన సంఘటనలకున్నూ, మాకు మా చిన్నతనంలో తెలిసిన సంఘటనలకున్నూ చాలా వ్యత్యాసం కనబడుతుంది. ముఖ్యంగా రూథర్ పోర్డ్ షూట్ చేయగా సీతారామరాజు చనిపోయినట్లు చిత్రంలో చూపించారు అయితే మా చిన్నతనంలో మేము విన్న విషయమిక్కడ తెలియపరుస్తాను.
శ్రీ సీతారామరాజు సుమారు వందమంది అనుచరులతో ఒకనాటి రాత్రి అడవిలో నిర్జన ప్రదేశంలో నిద్రపోతూ ఉండగా, ఈ విషయం చారుల వలన తెలిసికొన్న తెల్లదొరలు కమాండర్లుగానున్న మలబారు స్పెషల్ పోలీసుదళం వారిపై ఒక్కసారి విరుచుకు పడి షూటింగ్ చేయడానికి సిధ్ధపడ్డారు. నిద్రలోనున్నవారు నిద్రనుండి లేవాలన్నా ఆ అవకాశం లేకపోయింది. వెంటనే ఒక వ్యక్తి ఆ కమాండర్ల దగ్గఱకు వచ్చి యెదురుగా నిల్చి, తానే సీతారామరాజుననీ, తాను లొంగిపోతున్నాననీ, షూటింగ్ ఆర్డర్లు ఇవ్వవద్దనీ చెప్పాడు. వెంటనే అతనిని అరెస్టు చేసారు. అతని అనుచరులు తప్పించుకొనిపోవడానికి అవకాశం కలిగింది. ఆ తెల్లదొరలు సీతారామరాజును పట్టుకోగలిగినందుకు మురిసిపోతూ, అతనిని జిల్లా ప్రధాన నగరమైన కాకినాడలో సబ్ జైల్ లో ఉంచేరు. దొరలు చేసిన ఘనకార్యం వార్త వెంటనే ప్రభుత్వంలోనున్న అధికారులందరికీ తెలియజేయబడింది. "Secretary of State for India in London" కు కూడా ఈ వార్త ఆఘమేఘాలమీద చేరింది. ఇంతటి సాహసం చేయగల్గిన ఆ తెల్లదొరల కమాండర్లు పై ఆఫీసర్ల అభినందనల వర్షంలో మునిగితేలేరు. ఇక్కడ చిన్న విశేషముంది. సీతారామరాజు ఉద్యమం నడిపినప్పుడు, తన చేతికి చిక్కిన దొరలనాతడు బ్రతకనీయలేదు. మన హిందువులు చేజిక్కినప్పుడు కొంత మందలించి విడిచిపెట్టేవాడు. అందువలన తాము అరెస్ట్ చేసిన వ్యక్తి సీతారామరాజు అవునోకాదో ఆతెల్లదొరలకు తెలియదు. ఆ వ్యక్తి మాట మీదే ఆధారపడి వ్యవహరించేరు. జైలులో నున్న వ్యక్తిని చూచిన హిందూ ఆఫీసరెవరో ఒకాయన ఆ పట్టుబడిన వ్యక్తి సీతారామరాజు కాదు అన్నాడు. వెంటనే ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇదివరలో సీతారామరాజు చేత పట్టుబడి వదిలి వేయబడిన ఇద్దరు ఆఫీసర్లను పిలిపించేరు. వారు కూడా ఆ వ్యక్తి సీతారామరాజు కాదని ధృవపరచారు. పట్టుబడిన రోజున, సీతారామరాజును రక్షించడానికే, ఇంకొక వ్యక్తి తానే రాజునని లొంగిపోయేడని నిశ్చయంగా ఋజువయింది. ఆ రోజుల్లో సబ్ జైల్ గోడలమీద నుండి ఆ జైలులో నున్న సీతారామరాజును చూడడానికి ప్రయత్నించిన చిన్నపిల్లలలో నేనొకడిని.
ఆ పరిస్థితులలో ఇంక చేసేదేమీలేక ప్రభుత్వంవారు ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేశారు. జైలునుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటే, షూట్ చేయవలసి వచ్చిందని ప్రచారం చేసేరు. అందువలన ఇంక కోర్టులూ, నేరాలూ, సాక్ష్యాలు మొదలయిన చర్యలన్నింటికీ స్వస్తివాక్యం పలికారు.
ఇంతకూ సీతారామరాజు ఏమయ్యారని ఆ రోజులలో ఏ కోయవారి నడిగినా, ఆయన చనిపోలేదనీ, విరక్తి చెంది, అడవులలో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయారనీ చెప్పేవారు. విరక్తి ఎందుకంటే, సీతారామరాజు ఉద్యమం నడిపేటప్పుడు కోయ మగవారు చాలామంది ఆయనతో ఉండగా, మలబారు స్పెషల్ పోలీసుదళంవారు తెల్లదొరలకమాండ్ లో పల్లెల మీద పడి నానాభీభత్సం చేసేవారట. స్త్రీలను హింసించి, పిల్లలను బాధపెట్టి, ఇండ్లను అగ్నికి ఆహుతిచేసి విపరీతమైన అరాచకం జరిపేవారనీ, ఆ వార్తలు వింటున్న సీతారామరాజుగారు చాలా బాధ పడుతుండేవారనీ, కొన్నాళ్ళకు ఆయనకు విరక్తి కలిగి ఈ ఉద్యమం ఆపవలసి వచ్చిందనీ, ఆయన తపస్సు చేసుకునేందుకు అడవులలోనికి వెళ్ళిపోయారనీ చెప్పేవారు.
1925వ సంవత్సరములోను, 1926వ సంవత్సరములోను అల్లూరి సీతారామరాజు చరిత్ర పుస్తకరూపంలో వచ్చింది. ఈ వివరాలు అందులో తెలియపరచారు. ఆ నకిలీ సీతారామరాజు ఫొటో కూడా ఆ పుస్తకంలో ఉన్నది.

(చిత్రం.. గూగులమ్మ సౌజన్యంతో..)


________________________________________________________

12 వ్యాఖ్యలు:

Sujata M said...

Very interesting!

జయ said...

చాలా కొత్త విషయాలు చెప్పారండి. సీతారామరాజు నది ప్రాంతంలో నీళ్ళు తాగుతుండగా షూట్ చేసారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మీ నాన్నగారి అనుభవాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయండి. నకిలీ చిత్రపటం ఉన్న బుక్ గురించిన వివరాలు చెప్పండి. మీ నాన్నగారు వ్రాసిన అనుభవాల పుస్తకమెక్కడ దొరుకుతుందండీ.

శ్రీలలిత said...

sujata..
Thank you..

శ్రీలలిత said...

జయా,
ఈ పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండీ. ఇలాంటి కథలు మమ్మల్ని కూర్చోబెట్టుకుని బోల్డు చెప్పేవారు మా నాన్నగారు.
పిడపర్తివారి కథలూ- గాధలూ పుస్తకం, మఱపురాని అనుభవాలు పుస్తకం, ఇంకా "రామకథ" అని మొత్తం రామాయణమంతా సంక్షిప్తంగా పద్యాలలో వ్రాసారు మా నాన్నగారు..ఇవేవీ బైట దొరకవండీ. తనకు తెలిసినవారందరికీ పంచిపెట్టడానికే ఆయన ఈ పుస్తకాలన్నీవేసుకున్నారు. నెమ్మదిగా ఒక్కొక్కటీ అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో నేను ఇక్కడ పెడుతున్నాను.

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
చాలా మంచి విషయము చెప్పారండి . ఆయన అనుభవాలు ఇంకా తెలుసుకోవాలని వుంది . మీ దగ్గర ఆ పుస్తకము కాపీ వుందా ? వుంటే ఈసారి మనము కలిసినప్పుడు ఇవ్వగలరు . చదివి భద్రము గా తిరిగి ఇస్తాను . నిజము గా పదిలము గా తిరిగి ఇస్తాను . నన్ను నమ్మండి .

శ్రీలలిత said...

మిమ్మల్ని నమ్ముతున్నాను మాలాగారూ,
మీకు తప్పకుండా పుస్తకం ఇస్తాను.. కానీ తిరిగి ఇవ్వడానికి కాదు.. అచ్చంగా..
నేను చాలాసార్లు మానాన్నగారితో అన్నాను.. ఇవన్నీ బ్లాగ్ లొ పెడతానని. కాని ఆయన, "ఇవి నా అనుభవాలు కనుక నాకు బాగుంటాయి. నా పిల్లలు కనుక మీకు బాగుంటాయి. అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం.." అని కాస్త మొహమాటపడ్డారు.
ఇప్పుడింక నేను ధైర్యం చేసి పెట్టేసేను. నచ్చినందుకు ధన్యవాదాలు.
ఒక్కొక్కటీ నెమ్మదిగా పెడతాను.

సుభద్ర said...

MUNDU ADIGAARANI MAAGARIKI,JAYAGAARI KI ICHCHESI NAA ANYAAYAM CHEYYAKANDI..
UNTEE NAAKU OKA KAAPI
...

సుభద్ర said...

MUNDU ADIGAARANI MAAGARIKI,JAYAGAARI KI ICHCHESI NAA ANYAAYAM CHEYYAKANDI..
UNTEE NAAKU OKA KAAPI
...

మనోహర్ చెనికల said...

ఇలాంటి గొప్ప విషయాలు, అనుభవాలు అందరికీ తెలియడం మంచిది, దయచేసి వాటిని జానానికి అందేలా చెయ్యండి. మీకు అభ్యంతరం లేకుంటె నాకు కూడా ఆ పుస్తకం గురించిన వివరాలు అందజేయ గలరు.

సిరిసిరిమువ్వ said...

మంచి విషయాలు పంచుకున్నారు లలిత గారూ. మాలాంటి చాలామందికి అల్లూరి సీతారామరాజు నిజంగా ఎలా మరణించిందీ తెలియదు. మీరు ఆ పుస్తకాలని అందరికీ అందుబాటులోకి తెస్తే బాగుంటుంది..ఒకసారి ఆలోచించండి. కినిగె వాళ్ళతో మాట్లాడి e-బుక్ గా తేవచ్చేమో చూడండి.

శ్రీలలిత said...


సిరిసిరిమువ్వగారూ,
మీ స్పందనకి ధన్యవాదాలండీ.
కినిగె పుస్తకాల గురించి ఈమధ్య చాలామంది దగ్గర వింటున్నాను. అవి చాలామందికి అందుబాటులో కూడా ఉన్నట్టు వింటున్నాను. కానీ నాకు ఈ పుస్తకాలు తేవడం వాటి గురించి సరిగ్గా తెలీదండీ. ఎవరినైనా కనుక్కోవాలి.

Katta Srinivas said...

అల్లూరి జీవితంలో మిస్టరీగా మిగిలి పోయన కోణాల్ని బాగా తెలియజేసారండీ.
నేను సేకరించిన మరికొన్ని వివరాలు ఇక్కడ చూడొచ్చు
http://antharlochana.blogspot.in/2014/06/blog-post_6534.html?utm_source=BP_recent